NDTV Shares Adani: న్యూదిల్లీ టెలివిజన్‌లో తమకున్న మెజారిటీ వాటాలను అదానీ సంస్థకు విక్రయించనున్నట్లు సంస్థ వ్యవస్థాపకులు రాధికా రాయ్, ప్రణయ్ రాయ్ ప్రకటించారు. ఎన్డీటీవీలో ప్రస్తుతం తమకున్న వాటాల్లో 27.26 శాతం వాటాలను అదానీ గ్రూప్‌నకు విక్రయించబోతున్నట్లు స్టాక్ ఎక్స్ఛేంజీకి సమాచారం ఇచ్చారు. ఓపెన్ ఆఫర్ ప్రారంభించిన తర్వాత గౌతమ్ అదానీతో తమ చర్చలు నిర్మాణాత్మకంగా జరిగాయని ఓ ప్రకటనలో తెలిపారు. తామిచ్చిన సలహాలు సూచనలను అదానీ సానుకూలంగా పరిగణనలోకి తీసుకున్నట్లు పేర్కొన్నారు.
రుణాన్ని వాటాలుగా మార్చుకోవడం ద్వారా ఎన్డీటీవీలో వాటాలు పొందిన అదానీ.. ఆ తర్వాత ఓపెన్ ఆఫర్ ద్వారా మరిన్ని షేర్లు కొనుగోలు చేసి అతిపెద్ద వాటాదారుగా మారారు. ఈ నేపథ్యంలో తమకున్న 32.26 శాతం వాటాల్లో 5 శాతం వాటాలు మినహా మిగిలిన మొత్తాన్ని అదానీ గ్రూప్‌నకు చెందిన ఏఎంజీ మీడియా నెట్‌వర్క్‌కు విక్రయిస్తామని రాధికా, ప్రణయ్ రాయ్ తాజాగా ప్రకటించారు. ఇప్పటికే 37.44 శాతం వాటా కలిగిన అదానీ గ్రూప్.. ఈ షేర్లను కొనుగోలు చేయడం ద్వారా ఆ గ్రూప్ వాటా 65 శాతానికి పెరగనుంది.
రుణంతో మొదలై..
NDTV ప్రమోటర్ కంపెనీ అయిన RRPR హోల్డింగ్ ప్రైవేట్ లిమిటెడ్‌కు విశ్వప్రదాన్ కమర్షియల్ ప్రైవేట్ లిమిటెడ్ (VCPL) రూ.403.85 కోట్ల రుణం ఇచ్చింది. తర్వాతి కాలంలో VCPL యాజమాన్యం చేతులు మారి.. అదానీ గ్రూప్‌నకు చెందిన సంస్థ దాన్ని కొనుగోలు చేసింది. ముందస్తుగా చేసుకున్న ఒప్పందం ప్రకారం.. అప్పును 29.18 శాతం వాటాగా మార్చుకోవడంతో NDTVలో అదానీ గ్రూప్ వాటాలు పొందింది. దీనికి అదనంగా 26 శాతం వాటా కొనుగోలు కోసం ఓపెన్ ఆఫర్ ప్రకటించింది. ఓపెన్ ఆఫర్ గడువు పూర్తయ్యేసరికి ఎన్డీటీవీలో అదానీ గ్రూప్ వాటాలు 37.44 శాతానికి చేరాయి. రాధికా, ప్రణయ్ మెజారిటీ వాటాల విక్రయం కూడా పూర్తయితే ఎన్డీటీవీ పూర్తిగా అదానీ వశమైనట్లే.