Must Follow Factors to Consider While Taking Personal Loans: తక్షణ ఆర్థిక అవసరాలు.. అనుకోకుండా వచ్చిపడే ఖర్చులను ఎదుర్కోవడానికి ఉన్న అతికొద్ది మార్గాల్లో పర్సనల్ లోన్ ఒకటి. రుణం అంటేనే రిస్క్. ఏ మాత్రం పొరపాటు చేసినా దాని పర్యవసానాలు దీర్ఘకాలం ఉంటాయి. మన ఆర్థిక పరిస్థితిపై తీవ్ర ప్రభావం చూపుతాయి. అందుకే.. రుణం ఇచ్చే సంస్థలు చెప్పే కండీషన్లను సరిగ్గా అర్థం చేసుకోవాలి. లేకపోతే ఇబ్బందులు తప్పవు. ఈ నేపథ్యంలో వ్యక్తిగత రుణాలు తీసుకునే ముందు కొన్ని కనీస విషయాలను తప్పక దృష్టిలో పెట్టుకోవాలి. అవేంటో చూద్దాం..!
పర్సనల్ లోన్ తీసుకునే ముందు పరిగణించవలసిన విషయాలు..
రుసుములు అండ్ ఛార్జీలు: పర్సనల్ లోన్ వడ్డీ రేట్లు, ప్రాసెసింగ్ ఛార్జీలు, ప్రీ పేమెంట్/ఫోర్‌క్లోజర్ పెనాల్టీలు, ఇతర ఛార్జీలను సరిపోల్చండి. ఇవన్నీ మీ ఖర్చును పెంచుతాయి. ఇక్కడ గుర్తుంచుకోవాల్సిన అత్యంత ముఖ్యమైన విషయం ఏంటంటే.. తక్కువ వడ్డీ రేటు ఆఫర్ చేసే బ్యాంకులు ప్రాసెసింగ్ ఛార్జీలు ఎక్కువగా తీసుకోవచ్చు. లేదా జప్తు కోసం పెనాల్టీలను కూడా అధికంగా విధించొచ్చు. కాబట్టి ముందు వీటి గురించి తెలుసుకోండి.
Personal Loan Problems: పర్సనల్ లోన్ తీసుకోవటం మంచిదేనా..? సమస్యలేంటి..?
ఆఫర్‌లు అండ్ జిమ్మిక్కులు: రుణదాతలు భవిష్యత్తులో టాప్-అప్ లోన్‌ల ఆఫర్‌లతో తక్కువ వడ్డీ రేట్లు లేదా ఇలాంటి ఇతర ఆఫర్‌లతో మిమ్మల్ని ప్రలోభపెట్టవచ్చు. ఇలాంటి ఆఫర్ల పట్ల జాగ్రత్త వహించాలి. మీకు ఆ టాప్-అప్ లోన్ అవసరం లేకపోతే తీసుకోకపోవడం ఉత్తమం. కొన్ని సమయాల్లో రుణాలు ఫ్లోటింగ్ వడ్డీ రేటుపై ఆధారపడి ఉండవచ్చు. ఇది మొదట్లో స్థిర వడ్డీ రేటు కంటే తక్కువగా అనిపించవచ్చుకానీ.. క్రమంగా పెరుగుతున్న వడ్డీ రేటు స్థిర వడ్డీ రేటుపై ఇచ్చే రుణాల కంటే ఖరీదైనదిగా మారే ఛాన్స్ ఉంటుంది. కాబట్టి, లోన్ తీసుకునే ముందు ఫైన్ ప్రింట్ చదవాలి.
తిరిగి చెల్లించే సామర్థ్యం: రుణం తీసుకోవడం చాలా సులభం.. అయితే మీరు చివరికి దాన్ని తిరిగి చెల్లించాల్సి ఉంటుందని గుర్తుంచుకోవాలి. మీరు ఏదైనా సమస్య కారణంగా పెద్ద మొత్తంలో లోన్ తీసుకుని దాన్ని తిరిగి చెల్లించడంలో డిఫాల్ట్‌గా ఉంటే.. అది మీ క్రెడిట్ రేటింగ్‌ను ప్రతికూలంగా ప్రభావితం చేయడమే కాకుండా మిమ్మల్ని చట్టపరమైన చిక్కుల్లోకి లాగుతుంది. అలాంటప్పుడు లోన్ డిఫాల్ట్ కారణంగా మీరు జరిమానాలతో పాటు చట్టం ప్రకారం రిస్క్ ప్రాసిక్యూషన్‌కు కూడా సొమ్ము చెల్లించాల్సి ఉంటుంది.
Personal Loan Requirements : పర్సనల్ లోన్ కావాలా?.. అయితే ఈ విషయాలు తప్పక తెలుసుకోండి!
వడ్డీ రేట్లు: తక్కువ వడ్డీ రేటును అందించే రుణదాతను ఎంచుకోండి. ఎందుకంటే రుణాలను తిరిగి చెల్లించడం సులభం అవుతుంది. వడ్డీ రేటు తక్కువగా ఉన్న చోట లోన్ కోసం అప్లై చేసుకోవడం ఉత్తమం. అప్పుడు రుణ భారం తగ్గుతుంది. మీరు ఎక్కడ లోన్ తీసుకోవాలో నిర్ణయించుకున్న తర్వాత అప్లై చేసుకోవాలి. ఇక్కడ మీరు ఒక విషయం గుర్తు పెట్టుకోవాలి. ఒకటి కన్నా ఎక్కువ బ్యాంకులకు ఒకేసారి లోన్ కోసం అప్లై చేసుకోవద్దు. అప్పుడు క్రెడిట్ స్కోర్‌పై ప్రతికూల ప్రభావం పడే అవకాశం ఉంటుంది.
ఒప్పంద పత్రాన్ని క్షుణ్నంగా చదవండి: సొమ్ము మీ చేతికి అందే ముందు రుణ ఒప్పందంపై మీరు సంతకం చేయాల్సి ఉంటుంది. దానిలోని నియమ నిబంధనల్ని క్షుణ్నంగా చదవండి. వడ్డీరేటు, కాలపరిమితి వంటి వాటిని ఒకటికి రెండు సార్లు చెక్ చేసుకోండి. ఆలస్యమైతే చెల్లించాల్సిన పెనాల్టీ వంటి వాటిని జాగ్రత్తగా చూసుకోవాలి. ఒకవేళ అనుకోని పరిస్థితుల్లో నిబంధనల్ని ఉల్లంఘించినట్లయితే ఉండే పర్యవసానాల్ని అడిగి తెలుసుకోండి. అవన్నీ మీకు సమ్మతమైతేనే సంతకం చేయండి.
పర్సనల్ లోన్ తీసుకుంటున్నారా? ఈ ఛార్జీల గురించి తెలుసుకోండి!
సకాలంలో చెల్లింపు: పర్సనల్ లోన్ తీసుకుని దాని ఈఎంఐ భారాన్ని తొలగించాలనుకుంటే లేదా తగ్గించుకోవాలనుకుంటే ప్రీపేమెంట్, పార్ట్-పేమెంట్ ఉత్తమ మార్గం. ప్రీపేమెంట్ చేయడానికి మీరు ఎంత తక్కువ సమయం తీసుకుంటే అంత ఎక్కువ ప్రయోజనం ఉంటుంది. ముందస్తు చెల్లింపు అనేది కొన్ని బ్యాంకులు అందించే సేవ. ఇది రుణ ఒప్పందాలలో పేర్కొన్న వాస్తవ చెల్లింపు వ్యవధి కంటే ముందే రుణగ్రహీతలు తమ రుణాలను తిరిగి చెల్లించడానికి అనుమతిస్తుంది. లోన్ అమౌంట్‌ను సకాలంలో చెల్లించేలా చూసుకోవాలి. ఈఎంఐ చెల్లించడం లేట్ అయితే అది మీ క్రెడిట్ స్కోర్‌పై ప్రభావం చూపుతుంది.
క్రెడిట్ స్కోర్: మనం ఏ బ్యాంకుకైనా వ్యక్తిగత రుణం కోసం వెళ్లగానే వారు మొట్టమొదట చేసేది మన క్రెడిట్ స్కోర్‌ని చెక్ చేయడం. కొన్ని బ్యాంకుల్లో వారి సొంత విధానాలను వినియోగించి వ్యక్తి రుణ అర్హతను ధ్రువీకరించుకుంటారు. ఈ నేపథ్యంలో మనం మన క్రెడిట్ స్కోర్ పడిపోకుండా చూసుకోవాలి. 750 కంటే అధిక స్కోర్ ఉన్న వారికి రుణం మంజూరయ్యే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. మన ఆర్థిక కార్యకలాపాలను బట్టి ఇది మారుతూ ఉంటుంది. సకాలంలో వాయిదాలు చెల్లించడం, క్రెడిట్ కార్డు బిల్లు గడువులోగా చెల్లించడం వంటి చర్యల వల్ల మంచి స్కోర్ మెయింటైన్ చేయవచ్చు. క్రెడిట్ స్కోర్‌ను తరచూ చెక్ చేసుకోవాలి. తద్వారా ఒకవేళ ఎక్కడైనా తప్పులు దొర్లినా సవరించుకునే అవకాశం ఉంటుంది.
బంగారంపై అప్పు X పర్సనల్ లోన్.. ఏది బెటర్?