Facebook AI Chatbot : ప్రముఖ సోషల్ మీడియా ప్లాట్‌ఫామ్ ఫేస్‌బుక్ మాతృసంస్థ 'మెటా' సరికొత్త కృత్రిమ మేధ (ఏఐ)ని ప్రవేశపెట్టింది. లామా-2 పేరుతో దీనిని అందుబాటులోకి తెచ్చింది. టెక్ దిగ్గజం మైక్రోసాఫ్ట్‌తో సహకారంతో దీనిని తయారు చేసింది. తాము కూడా ఏఐ రంగంలో సేవలను మరింత విస్తరించేందుకు సిద్ధంగా ఉన్నామని చెబుతూ తాజాగా ఈ ఓపెన్-సోర్స్ ఆర్టిఫీషియల్ ఇంటెలిజెన్స్ (ఏఐ) వ్యవస్థను లాంఛ్ చేసింది మెటా. కాగా, ఇప్పటికే సంచలనం సృష్టిస్తున్న చాట్‌జీపీటీ, గూగుల్ బార్డ్ వంటి చాట్బాట్లకు దీటుగా దీనిని రూపొందించినట్లు ఫేస్‌బుక్ అధినేత మార్క్ జుకర్‌బర్గ్ మంగళవారం వెల్లడించారు. ఈ నయా లాంగ్వేజ్ మోడల్‌ను పూర్తి ఉచితంగా వినియోగించుకునేందుకు వీలుగా అభివృద్ధి చేసినట్లు ఆయన తెలిపారు.
Meta Open AI : "ఇదొక ఓపెన్ సోర్స్ ఏఐ మోడల్. ఓపెన్ సోర్స్ అనేది కొత్త ఆవిష్కరణలను ప్రోత్సహిస్తుంది. ఎందుకంటే ఇది ఎక్కువ సంఖ్యలో డెవలపర్లకు కొత్త టెక్నాలజీతో మమేకం అవ్వటానికి వీలును కల్పిస్తుంది. భద్రత విషయంలో కూడా మెరుగ్గా పనిచేసేందుకు ఎంతో దోహదపడుతుంది." అని మెటా సీఈఓ మార్క్ జుకర్‌బర్గ్ తన ఫేస్‌బుక్ పోస్ట్‌లో తెలిపారు.
వారికి మాత్రమే యాక్సెస్..
Meta Chatbot Llama : కొద్ది నెలల క్రితమే కృత్రిమ మేధ రంగంలోకి అడుగుపెట్టిన మెటా.. లామా (Llama) అనే పేరుతో సరికొత్త లాంగ్వేజ్ మోడల్‌ను అందుబాటులోకి తెచ్చింది. అయితే ఇది నేరుగా వినియోగదారులకు కాకుండా పరిశోధన రంగంతో పాటు వ్యాపార రంగంలో మాత్రమే ఉపయోగించుకునేలా దీనిని అభివృద్ధి చేసింది. ఇప్పుడు ఏఐకి ఆదరణ పెరుగుతున్న నేపథ్యంలో పరిశోధకులతో పాటు, వాణిజ్య అవసరాల కోసం లామా 2 (Llama 2) పేరుతో మరో శక్తిమంతమైన ఏఐని లాంఛ్ చేసింది.
మొన్న చాట్‌జీపీటీతో.. నేడు మెటాతో..!
Microsoft AI : న్యూ జనరేషన్ ఏఐ లాంగ్వేజ్ మోడల్‌ను తీసుకురావటానికి మైక్రోసాఫ్ట్‌తో ఒప్పందం కుదుర్చుకున్న నేపథ్యంలో మార్క్ జుకర్‌బర్గ్ ఆ సంస్థ సీఈఓ సత్యనాదెళ్లకు కృతజ్ఞతలు తెలుపుతూ తన ఇన్‌స్టాగ్రామ్ హ్యాండిల్లో ఓ పోస్టు పెట్టారు. అయితే ఇప్పటికే మైక్రోసాఫ్ట్ చాట్‌జీపీటీని రూపొందించిన ఓపెన్‌ఏఐలో భారీ పెట్టుబడులు పెట్టింది. ఈ క్రమంలో ఏఐ రంగంలో తన సేవలను మరింత విస్తరించుకునేందుకు తాజాగా మెటాతోనూ ఒప్పందం కుదుర్చుకుంది.