ఇడ్లీని ఇష్టపడని వారెవరుంటారు! చాలా మంది ఇడ్లీని లొట్టలేసుకుంటూ తింటారు. దక్షిణ భారతదేశంలో ఇడ్లీకి క్రేజ్ మాములుగా ఉండదు!. ఇడ్లీ ఆరోగ్యానికి మంచిదనే కారణంతో చాలా మంది దీన్ని అమితంగా తింటారు. రుచి కూడా బాగుండటం వల్ల పాపులర్ బ్రేక్‌ఫాస్ట్‌ల్లో.. ఇడ్లీ కూడా ఒకటిగా నిలిచింది. అయితే హైదరాబాద్‌కు చెందిన ఓ వ్యక్తి ఒక సంవత్సర కాలంలో ఎన్ని ఇడ్లీలు ఆర్డర్ తెలిస్తే ఆశ్చర్యపోతారు. ఏడాదిలో ఆరు లక్షల విలువ చేసే ఇడ్లీలు ఆర్డర్ చేశాడు. ఎనిమిది వేల పైగా పేట్లకు స్విగ్గీ ద్వారా తెప్పించుకున్నాడు. గురువారం ప్రపంచ ఇడ్లీ దినోత్సవం సందర్భంగా ప్రముఖ ఫుడ్ డెలివరీ యాప్ అయిన స్విగ్గీ.. ఈ వంటకంపై తన వార్షిక నివేదికను విడుదల చేసింది.
2022 మార్చి 30 నుంచి 2023 మార్చి 25 మధ్య కాలంలో వినియోగదారులు ఇచ్చిన ఇడ్లీ ఆర్డర్లపై.. స్విగ్గీ ఓ అధ్యయనం చేసింది. ఇందుకు సంబంధించి ఓ నివేదికను సైతం తయారుచేసింది. ఈ పన్నెండు నెలల కాలంలో స్విగ్గీ 3.3 కోట్ల ప్లేట్ల ఇడ్లీలను డెలివరీ చేసిందని అందులో పేర్కొంది. అత్యధికంగా బెంగళూరు, హైదరాబాద్, చెన్నై నగరాల నుంచి ఇడ్లీ ఆర్డర్లు వచ్చినట్లు సంస్థ వెల్లడించింది. ఆ తర్వాత కోల్‌కతా, కోచి, ముంబయి, కొయంబత్తూర్, పుణె నుంచి కూడా వినియోగదారులు అత్యధికంగా ఇడ్లీలను ఆర్డర్లు చేసినట్లు పేర్కొంది.
ఇక హైదరాబాద్‌కు చెందిన ఓ కస్టమర్ విషయానికి వస్తే.. సంవత్సర కాలంలో అతడు రూ.6 లక్షల విలువ చేసే ఇడ్లీలను తమ వేదికపై ఆర్డర్ చేసినట్లు స్విగ్గీ పేర్కొంది. ఆ వినియోగదారుడు మొత్తం 8,428 ప్లేట్ల ఇడ్లీలను స్విగ్గీలో కొనుగోలు చేసినట్లు వెల్లడించింది. హైదరాబాద్ మాత్రమే గాక.. బెంగళూరు, చెన్నై నగరాల నుంచి ఆ వ్యక్తి ఇడ్లీలను ఆర్డర్ చేసినట్లు తెలిపింది. అంటే సరాసరి రోజుకు 23 ప్లేట్లు! ఇక ఎక్కువ మంది మసాలా దోశను స్విగ్గీలో కొనుగోలు చేసినట్లు కంపెనీ తన నివేదికలో వెల్లడించింది.
మన దేశంలో బిర్యానీకి సైతం మంచి డిమాండ్ ఉంది. 2023 న్యూ ఇయర్ వేడుకల సందర్భంగా దేశవ్యాప్తంగా 3.50 లక్షల బిర్యానీ ఆర్డర్లను డెలివరీ చేసినట్లు గతంలో స్విగ్గీ తెలిపింది. అదే సమయంలో 2.5 లక్షల పిజ్జాలను సైతం కస్టమర్లకు అందించినట్లు వెల్లడించింది. అందులో హైదరాబాదీ బిర్యానీ ఆర్డర్ల శాతం-75.4 శాతం ఉన్నట్లు తెలిపింది. లఖ్నవీ బిర్యానీ ఆర్డర్ల శాతం-14.2 శాతంగా ఉందని పేర్కొంది. కోల్‌కతా బిర్యానీ ఆర్డర్ల శాతం-10.4 శాతంగా ఉన్నట్లు వెల్లడించింది. హైదరాబాద్లో ఎక్కువ మంది బావర్చీ రెస్టారెంట్ నుంచి బిర్యానీ ఆర్డర్ చేసినట్లు స్విగ్గీ తెలిపింది. బావర్చీ నుంచి నిమిషానికి రెండు బిర్యానీలు డెలివరీ అందించినట్లు సంస్థ పేర్కొంది.