LIC IPO Listing: దేశంలోనే అతిపెద్ద జీవిత బీమా సంస్థ ఎల్‌ఐసీ మే 4న పబ్లిక్ ఇష్యూకు రానుంది. ఈ నేపథ్యంలోనే బుధవారం షేర్ ధరను నిర్ణయించింది సంస్థ. ఎల్ఐసీని లిస్టింగ్ చేయడం దీర్ఘకాలిక వ్యూహాత్మక దృక్పథంలో భాగమన్నారు దీపం(పెట్టుబడులు, ఆస్తుల నిర్వహణ విభాగం) కార్యదర్శి తుహిన్‌కాంత పాండే. మరోవైపు.. పబ్లిక్ ఇష్యూకు సంబంధించిన తుది పత్రాలను సెబీకి సమర్పించింది ఎల్ఐసీ.
- భారత జీవిత బీమా సంస్థ పబ్లిక్ ఇష్యూలో ఒక్కో షేర్ ధరను రూ.902-949 మధ్య ఉండనుందని ప్రకటించింది.
- ఎల్ఐసీ పబ్లిక్ ఇష్యూ మే 4న ప్రారంభమై మే 9న ముగియనుంది.
- యాంకర్ ఇన్వెస్టర్లకు ముందుగా మే 2న విక్రయించనున్నారు.
- రిటైల్, సంస్థాగత కొనుగోలుదారులకు కూడా మే 4 నుంచే విక్రయించనున్నారు.
- బిడ్డర్ల డీమ్యాట్ ఖాతాకు మే 16 న షేర్లను కేటాయించనున్నారు.
- ఎల్ఐసీ ఈ ఐపీఓ ద్వారా 22,13,74,920 షేర్లను అమ్మకానికి పెట్టింది.
- ఉద్యోగుల కోసం 15,81,249 షేర్లను రిజర్వ్ చేసింది.
- పాలసీదారుల కోసం 2,21,37,492 షేర్లను అట్టిపెట్టింది.
- అర్హత గల సంస్థల కొనుగోలుదారుల(క్వాలిఫైడ్ ఇన్స్టిట్యూషనల్ బయ్యర్స్) కోసం 9.88 కోట్ల షేర్లను రిజర్వ్ చేసింది.
- అర్హత లేని సంస్థల కొనుగోలుదారుల కోసం 2.96 కోట్ల షేర్లను కేటాయించింది.
- ఎల్ఐసీ ఉద్యోగులకు ఈక్విటీ షేర్‌పై రూ.45 తగ్గింపు ఇవ్వనున్నారు.
- ఎల్ఐసీ పాలసీదారులు షేర్‌పై రూ.60 తగ్గింపు పొందుతారు.
సంస్థలో 3.5 శాతం వాటా విక్రయం ద్వారా ప్రభుత్వం రూ.21,000 కోట్లు ఆర్జించాలని లక్ష్యంగా పెట్టుకుంది. ఎల్‌ఐసీ విలువ(ఎంబెడెడ్ వాల్యూ - భవిష్యత్తు లాభాల ప్రస్తుత విలువ, సర్దుబాటు చేసిన నికర ఆస్తి విలువ కలిసి)ను రూ.6 లక్షల కోట్లుగా లెక్కగట్టారు. గత ఫిబ్రవరిలో వేసిన ప్రణాళిక మేరకు ఎల్‌ఐసీలో 5 శాతం వాటాకు సమానమైన 31.6 కోట్ల షేర్లను ఐపీఓలో విక్రయించాల్సి ఉంది. అయితే, ఉక్రెయిన్-రష్యా యుద్ధంగా కారణంగా మార్కెట్ తీవ్ర ఒడుదొడుకులకు లోనైన నేపథ్యంలో ఐపీఓను ఇప్పటివరకు వాయిదా వేసుకుంటూ వచ్చారు.
ఇదీ చదవండి: ఎల్ఐసీ షేరు ధరల శ్రేణి ఎంతంటే?