LIC Saral Pension Yojana : లైఫ్ ఇన్సూరెన్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా (ఎల్ఐసీ) అంటే తెలియని వారుండరు! ఇదొక ప్రభుత్వ జీవిత బీమా కంపెనీ. దీన్ని భారత మొదటి ప్రధాని జవహర్ లాల్ నెహ్రూ హయాంలో ప్రారంభించారు. కొద్దికాలంలోనే అన్ని వయసుల వారికి విభిన్నమైన పాలసీలు అందిస్తూ అందరి మన్ననలు అందుకుంది. గ్రామీణ భారతంలోనూ ఈ సంస్థకు అనేక మంది పాలసీదారులున్నారు. మామూలుగా ఈ సంస్థకు సంబంధించి అన్ని పింఛను పథకాలు వర్తించాలంటే కనీస వయసు 60 ఏళ్లు ఉండాలి. అప్పుడే వాటికి సంబంధించిన అన్ని ప్రయోజనాలుంటాయి. కానీ ఎల్ఐసీలో ఉన్న ఒక పథకం ద్వారా 40 ఏళ్ల నుంచే పింఛను పొందవచ్చు. అదే 'ఎల్ఐసీ సరళ్ పెన్షన్ యోజన'. ఈ పథకాన్ని 2021 జులైలో ప్రారంభించారు. దీనికి సంబంధించిన పూర్తి వివరాలివే.
- LIC Saral Pension Plan Age Limit : వయో పరిమితి : 40 నుంచి 80 ఏళ్ల వయసున్న వారు అర్హులు
- తక్షణ యాన్యుటీ : సరళ్ పెన్షన్ ప్లాన్‌తో పాలసీ జారీ అయిన వెంటనే పెన్షన్ రావడం ప్రారంభమవుతుంది.
- వన్ టైమ్ ప్రీమియం : పాలసీ కొనుగోలు సమయంలోనే ఒకే సారి ప్రీమియం మొత్తం చెల్లించాలి.
- నామినీ ప్రయోజనాలు : అనుకోకుండా పాలసీదారులు మరణిస్తే.. ఆ డిపాజిట్ అమౌంట్ మొత్తం సంబంధిత నామినీకి అందజేస్తారు.
- సరెండర్ ఆప్షన్ : పెట్టుబడి దారు పాలసీని ప్రారంభించిన 6 నెలల తర్వాత ఎప్పుడైనా సరెండర్ చేసే సదుపాయం ఉంది.
రెండు రకాలుగా..
LIC Saral Pension Yojana Premium Chart : రెండు రకాలుగా ఈ పాలసీని తీసుకోవచ్చు. అందులో మొదటిది సింగిల్ లైఫ్ పాలసీ. దీనిలో.. పాలసీదారులు జీవించినంత కాలం వారికి పింఛను వస్తుంది. అదే వారు చనిపోయిన తర్వాత పెట్టుబడి నగదు మొత్తం సంబంధిత నామినీకి తిరిగి ఇచ్చేస్తారు. ఇక రెండోది జాయింట్ లైఫ్ పాలసీ. ఇది దంపతులకు అనుకూలంగా ఉంటుంది. ఇందులోనూ పాలసీదారులు మరణించేవరకు పెన్షన్ పొందుతారు. మరణానంతరం వారి భాగస్వామికి పింఛను వస్తుంది. ఒకవేళ దంపతులిద్దరూ మరణిస్తే.. డిపాజిట్ అమౌంట్ నామినీకి ఇస్తారు.
వివిధ పెన్షన్ ఆప్షన్స్..
- మినిమం పెన్షన్ : ఈ పథకం కింద మీరు ఈ రకమైన పెన్షన్ ఎంచుకుంటే నెలకు కనీసం రూ.1000 పింఛను పొందవచ్చు.
- అపరిమిత పెన్షన్ : ఈ రకంలో పెన్షన్ మొత్తానికి గరిష్ఠ పరిమితి లేదు. పెట్టుబడి మొత్తం మీద పింఛన్ ఆధారపడి ఉంటుంది.
- ఫ్రీక్వెన్సీ : ఈ రకంలో నెలవారీ, అర్ధ వార్షిక, వార్షిక పింఛను విధానాల్ని ఎంపిక చేసుకోవచ్చు.
ఉదాహరణకు 42 ఏళ్ల ఒక వ్యక్తి రూ.30 లక్షల విలువైన యాన్యుటీ కొనుగోలు చేస్తే అతను.. నెలకు సుమారు రూ.12,400 పింఛను రూపంలో పొందుతాడు.