Kisan Vikas Patra Scheme : ప్రజలు తమ పెట్టుబడులను రెట్టింపు చేసే పథకాల్లో ఇన్వెస్ట్ చేయాలని తపిస్తూ ఉంటారు. అందుకే ఇలాంటి వారి కోసం కేంద్ర ప్రభుత్వం పలు పోస్ట్ ఆఫీస్ స్కీమ్‌లను ప్రవేశపెట్టింది. వాటిలో ప్రధానమైనది 'కిసాన్ వికాస్ పత్ర' స్కీమ్. ఇది ప్రభుత్వ పథకం కనుక మీ పెట్టుబడి సురక్షితంగా ఉంటుంది. పైగా రిటర్నులు కూడా గ్యారెంటీగా వస్తాయి.
మీ డబ్బు రెట్టింపు అవుతుంది!
Kisan Vikas Patra Scheme Interest Rate : కిసాన్ వికాస్ పత్ర పథకాన్ని 1988లోనే ప్రారంభించారు. 'ప్రజలలో దీర్ఘకాలిక ఆర్థిక క్రమశిక్షణను ప్రోత్సహించడమే' లక్ష్యంగా ఈ పథకాన్ని ప్రవేశపెట్టడం జరిగింది.
కేంద్ర ప్రభుత్వం 2023 ఏప్రిల్ 1న ఈ కిసాన్ వికాస్ పత్ర పథకంపై ఇచ్చే వడ్డీ రేట్లును పెంచడం జరిగింది. అందువల్ల ఇప్పుడు ఈ స్కీమ్‌లో ఇన్వెస్ట్ చేసినవారికి సంవత్సరానికి 7.5 శాతం వడ్డీ చొప్పున అందుతుంది. దీని వల్ల కేవలం 115 నెలలు లేదా 9 సంవత్సరాల 7 నెలలోనే మీ డబ్బు రెట్టింపు అవుతుంది. ఉదాహరణకు ఇప్పుడు మీరు రూ.4 లక్షలు ఈ కిసాన్ వికాస్ పత్ర పథకంలో పెట్టుబడి పెడితే.. 115 నెలల్లో మీకు రూ.8 లక్షలు అందుతాయి. గతంలో కిసాన్ వికాస్ పత్ర స్కీమ్‌లోని డబ్బులు రెట్టింపు కావడానికి 120 నెలలు పట్టేది. అంటే మీ పెట్టుబడి రెట్టింపు కావడానికి కనీసం 10 సంవత్సరాలు వేచిచూడాల్సి వచ్చేది.
రైతులకు మాత్రమే కాదు..!
KVP Scheme 2023 : కిసాన్ వికాస్ పత్ర స్కీమ్‌లో కనిష్ఠంగా రూ.1000 నుంచి పెట్టుబడి పెట్టవచ్చు. అదే సమయంలో గరిష్ఠ మొత్తంపై ఎలాంటి పరిమితి లేదు. ఒక వేళ మీరు రూ.50,000 లేదా అంత కంటే ఎక్కువ మొత్తాన్ని ఈ పథకంలో ఇన్వెస్ట్ చేయాలంటే.. కచ్చితంగా మీ పాన్ కార్డ్ వివరాలు అందించాలి. ప్రధానంగా మనీలాండరింగ్ కేసులను నివారించేందుకు దీనిని తప్పనిసరి చేశారు.
ఒక వేళ మీరు రూ.10 లక్షలు అంత కంటే ఎక్కువ మొత్తాన్ని కిసాన్ వికాస్ పత్ర స్కీమ్‌లో పెట్టుబడి పెట్టాలంటే.. మీ ఇన్‌కం ప్రూఫ్‌లను అందించాల్సి ఉంటుంది. ముఖ్యంగా మీ శాలరీ స్లిప్స్, బ్యాంక్ స్టేట్మెంట్స్, ఐటీఆర్ డాక్యుమెంట్లు సమర్పించాల్సి ఉంటుంది. మొదట్లో ఈ కిసాన్ వికాస్ పత్ర పథకాన్ని కేవలం రైతులు కోసం మాత్రమే ప్రవేశపెట్టడం జరిగింది. కానీ నేడు అర్హులైన పౌరులందరికీ ఈ పథకంలో పెట్టుబడి పెట్టడానికి అవకాశం కల్పిస్తున్నారు. ప్రస్తుతం ఈ పథకం దేశంలోని అన్ని బ్యాంకులు, పోస్టు ఆఫీసుల్లో అందుబాటులో ఉంది.
అర్హతలు ఏమిటి?
Kisan Vikas Patra Scheme Eligibility : ఈ కిసాన్ వికాస్ పత్ర పథకంలో మదుపు చేయాలంటే.. దరఖాస్తుదారు కచ్చితంగా భారతీయ పౌరుడు అయ్యుండాలి. అలాగే 18 సంవత్సరాల వయస్సు నిండి ఉండాలి. అలాగే ఈ పథకంలో మైనర్ పిల్లల పేరుతో తల్లిదండ్రులు గానీ, గార్డియన్ గానీ ఇన్వెస్ట్ చేయవచ్చు. కానీ హిందూ అవిభాజ్య కుటుంబం (HUF), ప్రవాస భారతీయులు (NRI) ఈ పథకంలో చేరడానికి అనర్హులు.