Petrol Diesel Price: అంతర్జాతీయంగా పెరిగిన చమురు ధరలకు అనుగుణంగా రేట్లను సవరించని కారణంగా ఏప్రిల్-జూన్ త్రైమాసికంలో దేశీయ ఆయిల్ మార్కెటింగ్ కంపెనీలు రూ.18,480 కోట్ల నికర నష్టాల్ని మూటగట్టుకున్నాయి. సమీక్షా త్రైమాసికంలో ఐఓసీ రూ.1,995.3 కోట్లు, హెచ్‌పీసీఎల్ రూ.10,196.94 కోట్లు, బీపీసీఎల్ రూ.6,290.8 కోట్ల నష్టాలను నివేదించాయి.
ఏప్రిల్-జూన్ త్రైమాసికంలో దిగుమతి చేసుకున్న బ్యారెల్ చమురు సగటు ధర రూ.109 డాలర్లుగా నమోదైంది. అయినప్పటికీ దేశీయ సంస్థలు 85-86 డాలర్లకు అనుగుణంగానే పెట్రోల్, డీజిల్‌ను విక్రయించాయి. దీంతో కంపెనీలకు భారీ ఎత్తున నష్టం వాటిల్లిందని సంస్థలు రెగ్యులేటరీ ఫైలింగ్‌లో పేర్కొన్నాయి. అయితే, ధరల సవరణ పూర్తిగా కంపెనీల నిర్ణయమని ప్రభుత్వం పలు సందర్భాల్లో తెలిపింది. మరి అంతర్జాతీయ ధరలకు అనుగుణంగా దేశీయంగా రేట్లను ఎందుకు సవరించలేదన్న విషయాన్ని మాత్రం కంపెనీలు వెల్లడించలేదు.
సాధారణంగా కంపెనీల రేట్లను అంతర్జాతీయ ధరలకు అనుసంధానించాల్సి ఉంటుంది. కానీ, దేశంలో కీలక ఎన్నికలకు ముందు కంపెనీలు రేట్లను సవరించడం లేదు. గత ఏడాది ఉత్తర్‌ప్రదేశ్, పంజాబ్, హరియాణా, గోవా, మణిపుర్, ఉత్తరాఖండ్ అసెంబ్లీ ఎన్నికలకు ముందు కంపెనీలు ధరల్ని స్తంభింపజేశాయి. ఎన్నికలు ముగిసిన తర్వాత తిరిగి రేట్లను సవరించడం ప్రారంభించాయి. దాదాపుగా లీటర్ పెట్రోల్, డీజిల్‌పై రూ.10 పెంచారు. అయితే, కేంద్రం ఎక్సైజ్ సుంకాన్ని తగ్గించడంతో సామాన్యులకు కాస్త ఊరట లభించింది. మరోవైపు ద్రవ్యోల్బణం రికార్డు గరిష్ఠమైన 7 శాతానికి చేరడంతో ఏప్రిల్ నుంచి తిరిగి ధరల్ని సవరించడం నిలిపివేశారు.
ఇవీ చూడండి: అద్దెకు ఉండాలా? ఇల్లు కొనాలా? ఏది బెటర్?
'మెటావర్స్ సేవలకు త్వరలో పైలట్ ప్రాజెక్ట్.. అన్ని రంగాలకు విస్తరణ'