Infosys Profits Q1 Results: సాఫ్ట్‌వేర్ సేవల దిగ్గజ సంస్థ ఇన్ఫోసిస్, జూన్ త్రైమాసికానికి రూ.5,360 కోట్ల (షేరుకు రూ.12.78) ఏకీకృత నికరలాభాన్ని ప్రకటించింది. 2021-22 ఇదే త్రైమాసిక లాభం రూ.5,195 కోట్ల (షేరుకు రూ.12.24) కంటే ఇది 3.2% అధికం. ఇదే సమయంలో ఆదాయం రూ.27,896 కోట్ల నుంచి 23.6% పెరిగి రూ.34,470 కోట్లకు చేరింది. ఏప్రిల్-జూన్ వృద్ధికి తోడు, తమకు లభించిన ప్రాజెక్టులకు అనుగుణంగా, ప్రస్తుత ఆర్థిక సంవత్సరానికి ఆదాయ అంచనాలను 13-15% నుంచి 14-16 శాతానికి పెంచుతున్నట్లు సంస్థ ప్రకటించింది. మార్జిన్ అంచనాలను మాత్రం 21-23% వద్దే స్థిరంగా ఉంచింది.
అంచనాల కంటే తక్కువ లాభం
మార్కెటింగ్-విక్రయ (నిర్వహణ) వ్యయాలు 14.4% పెరగడం, నిర్వహణ మార్జిన్లు 23.7% నుంచి 20.1 శాతానికి తగ్గడం వల్లే, జూన్ త్రైమాసికానికి, అంచనాల కంటే తక్కువ లాభాన్ని ఇన్ఫోసిస్ ప్రకటించింది. ఏకీకృత నికరలాభం ఏడాది క్రితంతో పోలిస్తే 5.5-9.5% పెరుగుతుందని విశ్లేషకులు అంచనా వేశారు. ఎబిటా అంచనాల కంటే తక్కువగా రూ.6,914 కోట్లుగా నమోదైనా, ఆదాయం మాత్రం అంచనాలైన 21.5-22.5 శాతం కంటే మించడం గమనార్హం.
నిర్వహణ మార్జిన్ జనవరి-మార్చి నాటి 21.5 శాతంతో పోల్చినా తక్కువే. మార్చి త్రైమాసిక లాభం రూ.5,686 కోట్ల కంటే 5.7 శాతం తక్కువగానే జూన్ త్రైమాసికంలో సంస్థ ప్రకటించడం గమనార్హం. ఇదే సమయంలో ఆదాయం మాత్రం రూ.32,678 కోట్ల నుంచి 6.8 శాతం పెరిగింది.
కొత్త ఖాతాదారులు 106 మంది
జూన్ త్రైమాసికంలో 106 మంది కొత్తగా జత చేరడంతో, మొత్తం ఖాతాదారుల సంఖ్య 1,778కి చేరింది. 100 మిలియన్ డాలర్లకు పైగా ఆర్డరు ఇచ్చిన వారు 38 మంది కాగా, 50 మి.డా. కంటే ఎక్కువగా 69 మంది, 10 మి.డా.కంటే అధికంగా 278 మంది, 1 మి.డా. కంటే ఎక్కువగా 877 మంది ఆర్డర్లు ఇచ్చారు. మొత్తం ఆదాయాల్లో అగ్రశ్రేణి అయిదుగురి వాటాయే 13 శాతమని సంస్థ తెలిపింది. 25 మంది ఖాతాదార్ల నుంచే 36.3 శాతం ఆదాయం లభిస్తోంది.
మొత్తం ఉద్యోగులు 3.35 లక్షలు
జూన్ ఆఖరుకు మొత్తం ఉద్యోగుల సంఖ్య 3,35,186కు చేరింది. మార్చి ఆఖరు నాటి 3,14,015 కంటే నికరంగా 21,171 మందిని జత చేర్చుకున్నట్లు అయ్యింది. సిబ్బంది వలసలు 13.9 శాతం నుంచి 28.4 శాతానికి చేరాయి. మార్చి త్రైమాసికం నాటి 27.7 శాతం కంటే కూడా అధికమయ్యాయి. ‘నూతన నియామకాలకు తోడు, నిపుణులను అట్టేపెట్టుకునేందుకు ఇచ్చిన ప్రోత్సాహకాల వల్ల మార్జిన్లపై ప్రభావం పడింది. అయితే వలసలు తగ్గి, భవిష్యత్తులో సామర్థ్యం- కార్యకలాపాలు వృద్ధి చెందుతాయి’ అని చీఫ్ ఫైనాన్షియల్ ఆఫీసర్ నిలంజన్‌రాయ్ తెలిపారు.
సిబ్బంది వినియోగం 88.5 శాతం నుంచి 84.7 శాతానికి తగ్గింది. మార్చి త్రైమాసికం నాటి 87 శాతం కంటే కూడా తక్కువే.
విభాగాల వారీగా..
స్థిర కరెన్సీ రూపేణ మొత్తం ఆదాయాల్లో డిజిటల్ వ్యాపార వాటా 61 శాతంగా ఉంది. ఏడాది క్రితంతో పోలిస్తే 37.5 శాతం పెరిగింది. ఆర్థిక సేవల విభాగ వాటా 2.4 శాతం తగ్గి 30.6 శాతానికి పరిమితమైంది. రిటైల్ వాటా 14.5%, కమ్యూనికేషన్ విభాగం వాటా 13 శాతం, ఇంధనం-వినిమయ విభాగాల వాటా 12.4 శాతం, తయారీ విభాగం వాటా 12.1 శాతానికి చేరాయి.
"ఆర్థిక అనిశ్చితి వాతావరణంలోనూ పటిష్ఠ ఫలితాలు ప్రకటించడం ఇన్ఫోసిస్ సామర్థ్యాలకు నిదర్శనం. డిజిటల్ సామర్థ్యాల్లో పరిశ్రమలోనే అగ్రస్థానంలో ఉన్నాం. గత 3-6 నెలల కంటే అధికంగా పెద్ద ప్రాజెక్టులు లభిస్తున్నాయి. జూన్ త్రైమాసికంలో భారీ నియామకాలకు తోడు, నిపుణులకు ప్రోత్సాహకాలు, మెరుగైన అవకాశాలను అందించాం."
- సలీల్ పరేఖ్, ఇన్ఫోసిస్ సీఈఓ, ఎండీ
మొత్తంఆదాయాల్లో
ఉత్తర అమెరికా వాటా 61.8%, ఐరోపా వాటా 25%, భారత వాట 2.6% కాగా ఇతర ప్రాంతాల వాటా 10.6 శాతంగా ఉంది.
ఇవీ చదవండి: 'రాష్ట్రాల కోరిక మేరకే వాటిపై జీఎస్టీ.. నిర్ణయం కేంద్రానిది కాదు'
'యువతే మా టార్గెట్.. మేం కూడా విద్యుత్ స్కూటర్ తీసుకొస్తాం'