అతి తక్కువ ధరలో ఎలక్ట్రిక్ విద్యుత్ కారు కొనాలనుకుంటున్నారా? అయితే ఓ గుడ్ న్యూస్. ముంబయికి చెందిన ఎలక్ట్రిక్ వాహనాల తయారీ సంస్థ అయిన పీఎంవీ ఎలక్ట్రిక్ సంస్థ రూ.5 లక్షల్లోనే ఓ మైక్రో కారును విడుదల చేసింది. ఈఏఎస్-ఈ ఈవీ (EaS-E EV) పేరుతో తెచ్చిన ఈ కారు.. ఇద్దరు ప్రయాణికుల సీటింగ్ కెపాసిటీ కలిగి ఉంటుంది. భారత్‌లోనే అతి చిన్న ఎలక్ట్రిక్ కారు ఇదేనని పీఎంవీ తెలిపింది. ఈ మైక్రో కారు 36 చదరపు అడుగులు కలిగి ట్రాఫిక్‌లో ప్రయాణించడానికి వీలుగా ఉంటుందని వివరించింది. ఇప్పటికే పీఎంవీ ఎలక్ట్రిక్ ముందస్తు బుకింగ్స్ ప్రారంభించింది. ఆసక్తిగల వారు పీఎంవీ ఎలక్ట్రిక్ వెబ్‌సైట్‌లోకి వెళ్లి రూ.2,000 చెల్లించి కారును బుక్ చేసుకోవచ్చని తెలిపింది. ప్రస్తుతానికి 6,000 మంది ముందస్తు బుకింగ్‌లు చేసుకున్నట్లు సంస్థ వెల్లడించింది.
ఈఏఎస్-ఈ కారు 10కిలోవాట్స్ సామర్థ్యంతో.. గరిష్ఠంగా గంటకు 70 కిలోమీటర్ల వేగంతో ప్రయాణిస్తుంది. ఈ బ్యాటరీ పూర్తి చార్జింగ్ కావడానికి దాదాపు నాలుగు గంటల సమయం పడుతుంది. 120 కి.మీ., 160కి.మీ., 200 కిలోమీటర్ల రేంజ్‌తో కూడిన మూడు రకాల బ్యాటరీలు అందుబాటులో ఉన్నాయి. ఈ కారులో కిలోమీటరు ప్రయాణానికి రూ.75 పైసలు ఖర్చు అవుతుంది.
రీజనరేటివ్ బ్రేకింగ్, రిమోట్ పార్కింగ్ అసిస్ట్, ఓటీఏ అప్‌డేట్స్, స్మార్ట్ ఫోన్ కనెక్టివిటీ వంటి పలు స్మార్ట్ ఫీచర్లు ఉన్నాయి. ఈ కారును మీ స్మార్ట్‌ఫోన్‌తో కనెక్ట్ చేయడం వల్ల దాని ఎయిర్ కండీషన్‌ను, హారన్‌ను, విండోలు, లైట్స్‌ను రిమోట్ సాయంతో కంట్రోల్ చేయొచ్చు. నాలుగు డోర్లతో ఇద్దరు మాత్రమే కూర్చునే వెసులుబాటు ఉంటుంది. ముందు డ్రైవర్ సీట్‌లో ఒకరు, వెనుక సీట్‌లో ఒకరు మాత్రమే కూర్చోవచ్చు. డ్రైవర్ సీట్‌కు పెద్ద కారు మాదిరి ఎయిర్‌బ్యాగ్ సదుపాయం కూడా ఉంది.
120 కిలోమీటర్ల రేంజ్ కలిగిన బ్యాటరీ కారును మొదటి 10,000 మంది కస్టమర్స్‌కు రూ.4.79 లక్షలకు అందించనున్నట్లు సంస్థ తెలిపింది. 160 కిలోమీటర్ల రేంజ్ ఉన్న కారును రూ.6.79 లక్షలకు.. 200 కిలోమీటర్ల రేంజ్ ఉన్న కారును రూ.7.79 లక్షలకు విక్రయించనున్నట్లు వెల్లడించింది.