IHC Invest in Adani group: అబుదాబీ కేంద్రంగా పనిచేస్తున్న ప్రముఖ అంతర్జాతీయ సంస్థ 'ఇంటర్నేషనల్ హోల్డింగ్ కంపెనీ (IHC)'..బిలియనీర్ గౌతమ్ అదానీ నేతృత్వంలోని అదానీ గ్రూప్ కంపెనీల్లో భారీ ఎత్తున పెట్టుబడులను పెట్టనుంది. తమ సంస్థల్లో ఐహెచ్‌సీ 2 బిలియన్ డాలర్ల పెట్టుబడులు పెట్టనున్నట్లు అదానీ గ్రూప్ శుక్రవారం ప్రకటించింది.
అదానీ గ్రీన్ ఎనర్జీ లిమిటెడ్ (AGEL)లో రూ.3,850 కోట్లు, అదానీ ట్రాన్స్‌మిషన్ లిమిటెడ్ (ATL)లో రూ.3,850 కోట్లు, అదానీ ఎంటర్‌ప్రైజెస్ లిమిటెడ్ (AEL)లో రూ.7,700 కోట్లు ఐహెచ్‌సీ పెట్టుబడిగా పెట్టనుంది. అయితే, దీనివల్ల ఆయా సంస్థల్లో ఐహెచ్‌సీకి ఎంతశాతం వాటా వెళ్లనుందో మాత్రం బహిర్గతం చేయలేదు. ఈ మేరకు ఏజీఈఎల్, ఏటీఎల్, ఏఈఎల్ బోర్డులు శుక్రవారం సమావేశమై తమ ఆమోదం తెలిపాయి.
దీనికి నియంత్రణా సంస్థల నుంచి ఆమోదం లభించిన నెలలోగా లావాదేవీలు పూర్తి కానున్నాయి. ఈ నిధులను వ్యాపార విస్తరణ, బ్యాలెన్స్ షీట్ బలోపేతం, ఇతర జనరల్ కార్పొరేట్ అవసరాలకు వినియోగించనున్నారు. ఈజీఈఎల్ పునరుత్పాదక ఇంధన ఉత్పత్తి రంగంలో పనిచేస్తోంది. ప్రస్తుతం ఈ సంస్థ వివిధ విభాగాల్లో 20.4 గిగావాట్ల ఇంధనాన్ని ఉత్పత్తి చేస్తోంది. ఏటీఎల్ 18,875 సర్క్యూట్ కి.మీ కలిగిన ఇంధన ట్రాన్స్‌మిషన్ నెట్‌వర్క్‌గా కొనసాగుతోంది. ఇక ఏఈఎల్ వర్ధమాన మౌలికవసతుల వ్యాపారాల స్థాపనపై దృష్టిసారించింది.
ఇదీ చదవండి: కార్డు లేకుండానే నగదు ఉపసంహరణ.. ఇకపై అన్ని బ్యాంకుల్లో!