How UPI Payment Works in Telugu : ఒకప్పుడు ఎవరికైనా డబ్బులను పంపించాలంటే బ్యాంకుకు వెళ్లి.. అక్కడ ఫారాలు నింపి, క్యూలో గంటల తరబడి సమయం వృథా చేసుకోవాల్సి వచ్చేది. ఎప్పుడైతే ఇంటర్నెట్ అందుబాటులోకి వచ్చిందో ఆ పని చాలా ఈజీ అయింది. అది ఎలాగో మనందరికీ తెలుసు. అదేనండీ ఫోన్‌పే, గూగుల్ పే యూపీఐ యాప్స్. వీటి ద్వారా దేశంలో ఎక్కడున్న వారికైనా వెంటనే ఎన్ని డబ్బులనైనా పంపించవచ్చు. మనందరికి నిత్యం ఆర్థిక లావాదేవీల్లో ఎంతగానో ఉపయోగపడుతున్న ఈ యూపీఐ యాప్స్ గురించి కొన్ని ఆసక్తికర విషయాలను ఈ స్టోరీలో తెలుసుకుందాం.
అసలేంటి ఈ యూపీఐ ?
యూనిఫైడ్ పేమెంట్స్ ఇంటర్‌ఫేస్ (UPI)ను నేషనల్ పేమెంట్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా (NPCI) అభివృద్ధి చేసింది. దీనిని రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (RBI) నియంత్రిస్తుంది. యూపీఐ ప్రతి యూజర్‌కు ఒక ప్రత్యేకమైన యూపీఐ ఐడీని క్రియెట్ చేస్తుంది. దీని ద్వారా యూజర్ ఇతరులకు చెల్లింపులు చేయడం, స్వీకరించడం జరుగుతుంది.
యూపీఐ ఎందుకు విజయవంతమైంది ?
యూపీఐ యాప్‌లో చెల్లింపులను చేయడం పూర్తిగా ఉచితం. మీరు నేషనల్ పేమెంట్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియాకు ఎటువంటి రుసుము చెల్లించకుండా ఎవరికైనా, ఎప్పుడైనా, ఎంత డబ్బునైనా బదిలీ చేయవచ్చు. ఈ యాప్‌లో ఆటోపే ఆప్షన్ కూడా ఉంది. దీని వల్ల మీరు మీ బిల్లులను, సబ్‌స్క్రిప్షన్‌లను ఆటోమెటిక్‌గా చెల్లించవచ్చు. దీంతో మీ సమయం ఆదా అవుతుంది.
యూపీఐ ఎలా పని చేస్తుంది ?
యూపీఐ యాప్‌లో మీరు డిజిటల్ చెల్లింపులను చేయడానికి యాప్‌ను ఇన్‌స్టాల్ చేయాలి. తరవాత మీరు దానికి బ్యాంకు ఖాతాను జోడించాలి. యాప్‌లు పేమెంట్ చేయడానికి పుష్, పుల్ మెకానిజం ఉపయోగిస్తాయి. మీరు డబ్బును పంపించాలనుకుంటున్న వ్యక్తి మొబైల్ నెంబర్‌ను లేదా క్యూఆర్ కోడ్‌ను స్కాన్ చేసి, యూపీఐ పిన్‌ను ఎంటర్ చేసి నగదును పంపించవచ్చు. ఈ యాప్స్‌లో డబ్బును స్వీకరించడానికి కలెక్ట్ లేదా రిక్వెస్ట్ మనీ ఆప్షన్‌ను ఎంచుకోవచ్చు. దీని కోసం వర్చువల్ పేమెంట్ అడ్రస్ (VPA) సాంకేతికతను ఉపయోగిస్తున్నారు. నగదును చెల్లించడానికి ఎప్పటినుంచో అందుబాటులో ఉన్న నేషనల్ ఎలక్ట్రానిక్ ఫండ్స్ ట్రాన్స్‌ఫర్ (NEFT), రియల్-టైమ్ గ్రాస్ సెటిల్‌మెంట్ (RTGS), ఇమ్మీడియట్ మొబైల్ పేమెంట్ సర్వీస్ (IMPS)లలాగే యూపీఐ చెల్లింపుల విధానం పూర్తిగా సురక్షితమైంది. యూపీఐ చెల్లింపుల విధానంలో మీ డేటాను ఎవరూ చోరీ చేయలేరు.
వివిధ యూపీఐ యాప్‌లు ఒక్కో కొత్త యూపీఐ ఐడీని సెటప్ చేస్తాయి.. మీరు ఉపయోగించే ఫోన్‌పే, గూగుల్ పేలో వేర్వేరుగా యూపీఐ ఐడీలు ఉంటాయి. ఇది మీరు గమనించారా ? ఈ విధంగా ఎందుకు ఉంటాయంటే.. మీరు వివిధ బ్యాంకులతో యాప్‌నకు లింక్ అవ్వడమే కారణం. ఉదాహరణకు Google Payలో ఉండే సాధారణ UPI IDలు @oksbi, @okhdfcbank, @okaxis, @okicici.
UPI Vs UPI Lite : బేసిక్ ఫోన్‌తో పేమెంట్స్ చేయాలా?.. UPI & యూపీఐ లైట్ వాడండిలా!
యూపీఐ లావాదేవీలు సురక్షితమేనా ?
యూపీఐ చెల్లింపులు ఆర్‌బీఐ ఏర్పాటు చేసిన కఠినమైన నిబంధనలను అనుసరించి ఉంటాయి. ట్రాన్స్‌పోర్ట్ లేయర్ సెక్యూరిటీ (TLS), అడ్వాన్స్‌డ్ ఎన్‌క్రిప్షన్ స్టాండర్డ్ (AES) వంటి ఎన్‌క్రిప్షన్‌లతో యూపీఐ పేమెంట్స్ యాప్స్‌ను కోడింగ్ చేస్తారు. కాబట్టి, మీరు యూపీఐ చెల్లింపుల విషయంలో ఎటువంటి ఆలోచన పెట్టుకోకండి. నిశ్చింతగా చెల్లింపులను చేయండి.
యూపీఐ చెల్లింపులలో వచ్చే మార్పులు ఏమిటి ?
త్వరలోనే యూపీఐ చెల్లింపుల విధానంలో పెద్ద అప్‌డేట్‌ను తీసుకువస్తామని ఆర్‌బీఐ ఆగస్టులో ప్రకటించింది. డిజిటల్ చెల్లింపుల విధానంలో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ సాంకేతికతను ఉపయోగించి మాట ద్వారా నగదును బదిలీ చేసే ప్రక్రియను అందుబాటులోకి తీసుకువస్తామని తెలిపింది. ఇవి ముందుగా హిందీ, ఇంగ్లీష్ భాషలలో అందుబాటులోకి వస్తాయని, తరవాత అన్ని భాషల్లోకి వస్తుందని ఆర్‌బీఐ తెలిపింది.
NFCని ఉపయోగించి ఆఫ్‌లైన్ UPI చెల్లింపులు : యూపీఐ లైట్ యాప్‌లో నియర్ ఫీల్డ్ కమ్యూనికేషన్ (NFC) సాంకేతికతను ఉపయోగించి ఆఫ్‌లైన్‌లో నగదును బదిలీ చేసే అవకాశం సమీప భవిష్యత్తులోనే ఉంది. దీని కోసం వినియోగదారులు తమ మొబైల్ ఫోన్‌ను పాయింట్ ఆఫ్ సేల్ మెషిన్ ఎదురుగా పెడితే చాలు. పేమెంట్స్ కంప్లీట్ అవుతాయి. ఈ ఫీచర్ ఇంటర్నెట్ లేదా సిగ్నల్ బలహీనంగా ఉన్న చోట నగదును సరిగ్గా బదిలీ చేసేలా ఉపయోగపడుతుంది.
యూపీఐ లైట్‌లో ఇక నుంచి రూ.500 వరకు బదిలి : ఆఫ్‌లైన్ మోడ్‌లో యూపీఐ లైట్ ద్వారా ఒకేసారి రూ. 200 పంపించే నగదును.. రూ.500 వరకు పంపించేలా ఆర్‌బీఐ పెంచింది.
UPI 2.0 అంటే ఏమిటి?
UPI 2.0 యూపీఐ తాజా వెర్షన్. ఈ ఫీచర్ ద్వారా కస్టమర్‌లు, వ్యాపారుల మధ్య జరిగే ఆర్థిక లావాదేవీల్లో మరింత భద్రత, సౌలభ్యం, పారదర్శకత మెరుగుపడుతుంది. ఇందులో ఓవర్‌డ్రాఫ్ట్ సదుపాయం, వన్-టైమ్ మ్యాండేట్, ఇన్‌వాయిసింగ్, వ్యాపారి సంతకం చేసిన కొత్త క్యూఆర్ కోడ్ స్కానర్లు.. వంటి కొత్త ఫీచర్లు ఉన్నాయి.