EPF Account Merge Online : నేటి కాలంలో సరికొత్త ఉద్యోగ అవకాశాలు, మెరుగైన జీతాలు ఆశిస్తూ కంపెనీలు మారడం చాలా సహజం అయిపోయింది. కానీ చాలా మందికి ఉద్యోగం మారిన ప్రతిసారీ కొత్త ఈపీఎఫ్ ఖాతాలు తెరవడం పరిపాటి అయిపోయింది. కానీ ఇది ఏ మాత్రం మంచి విషయం కాదు. ఒక వేళ మీరు ఇప్పటికే ఒకటి కంటే ఎక్కువగా ఈపీఎఫ్ ఖాతాలు తెరచినట్లు అయితే, వెంటనే వాటిని విలీనం (Merge) చేసుకోవడం ఉత్తమం.
మల్టిపుల్ ఈపీఎఫ్ అకౌంట్స్ వద్దు!
Multiple EPF Accounts Disadvantages : యూఏఎన్ అంటే యూనివర్సల్ అకౌంట్ నంబర్. ఈపీఎఫ్ ఖాతా ఉన్న ప్రతి ఒక్కరికీ ఈ యూఏఎన్ కేటాయించడం జరుగుతుంది. వాస్తవానికి ఒక వ్యక్తి వేర్వేరు సంస్థలకు మారినప్పటికీ.. అతనికి ఒకటే యూఏఎన్ (UAN) ఉంటుంది. ఉద్యోగం మారిన ప్రతిసారీ ఈ యూఏఎన్ నంబర్ కిందే ఆయా సంస్థలు వేర్వేరు ఖాతాలు తెరుస్తాయి. ఇలా జరిగితే ఎలాంటి ఇబ్బంది ఉండదు. ఈపీఎఫ్ నియమాల ప్రకారం, ఒక వ్యక్తికి ఒకటి కంటే ఎక్కువ యూఏఎన్ నంబర్లు ఉండకూడదు. ఒక వేళ ఉన్నా కూడా ఎలాంటి పెనాల్టీ విధించడం జరగదు. కానీ ఉద్యోగాలు మారినప్పటికీ పాత యూఏఎన్ నంబర్‌నే ఉపయోగించాలని ఈపీఎఫ్ఓ సూచిస్తోంది.
ప్రయోజనాలు దెబ్బతింటాయ్!
Multiple EPF Accounts Pros and Cons : పీఎఫ్ ఖాతాల విషయంలో ఉద్యోగస్తులు చాలా అప్రమత్తంగా ఉండాలి. ఎందుకంటే వ్యక్తులు ఉద్యోగం మారిన ప్రతిసారీ ఒక్కో పీఎఫ్ అకౌంట్ క్రియేట్ అవుతుంది. వీటిని వేర్వేరుగా వదిలేయడం వల్ల చాలా ప్రయోజనాలు కోల్పోవడం జరుగుతుంది. పైగా అధికంగా పన్ను కట్టాల్సి వస్తుంది.
వరుసగా మూడేళ్లపాటు ఒక పీఎఫ్ ఖాతాలో డబ్బు జమ కాకపోతే, ఆ ఖాతాలోని డబ్బుపై ఈపీఎఫ్ఓ ఎలాంటి వడ్డీని జమ చేయదు. ఇక్కడ గుర్తుంచుకోవాల్సిన విషయం ఏమిటంటే.. సాధారణంగా పీఎఫ్ ఖాతా ఐదేళ్లు దాటితే.. అందులోని విత్‌డ్రాలపై ఎలాంటి పన్ను భారం పడదు. అదే ఐదేళ్లు పూర్తి కాకుండానే పీఎఫ్ ఖాతా నుంచి డబ్బులు డ్రా చేస్తే, 10 శాతం వరకు టీడీఎస్ కట్ అవుతుంది. అయితే సదరు పీఎఫ్ ఖాతాలో రూ.50,000 కంటే తక్కువ మొత్తం ఉంటే మాత్రం ఈ నియమం వర్తించదు. అందువల్ల ఉద్యోగస్తులు సంస్థలు మారినప్పటికీ.. తమ ఈపీఎఫ్ ఖాతాలను మాత్రం మెర్జ్ చేసుకోవడం మర్చిపోకూడదు.
ఉదాహరణకు A అనే వ్యక్తి ఒక్కో కంపెనీలో 2 ఏళ్లు చొప్పున.. నాలుగు కంపెనీల్లో పనిచేశాడు అనుకుందాం. ఆ తరువాత అతను తనకున్న నాలుగు ఈపీఎఫ్ ఖాతాలను విలీనం చేశాడనుకుందాం. అప్పుడు అతని సర్వీసు కాలాన్ని ఎనిమిదేళ్లుగా పరిగణించడం జరుగుతుంది. ఒక వేళ అతను ఆయా ఖాతాలను విలీనం చేసుకోకపోతే, అప్పుడు అతని సర్వీసు కాలం కేవలం రెండేళ్లుగా పరిగణించడం జరుగుతుంది. దీని వల్ల అతను ఎంతగానో నష్టపోవాల్సి వస్తుంది. పైగా డబ్బులు విత్‌డ్రా చేసినప్పుడు అదనపు పన్నులు కూడా చెల్లించాల్సి వస్తుంది.
ఈపీఎఫ్ ఖాతాలను విలీనం చేయడం ఎలా?
EPF Account Merge Online :
- స్టెప్ 1 : ముందుగా https://www.epfindia.gov.in/ వెబ్‌సైట్‌ను ఓపెన్ చేయాలి.
- స్టెప్ 2 : సర్వీస్ విభాగంలో 'వన్ ఎంప్లాయీ-వన్ ఈపీఎఫ్ అకౌంట్' ఆప్షన్‌ను ఎంచుకోవాలి.
- స్టెప్ 3 : తరువాత సదరు ఉద్యోగి ఇ-సేవా పోర్టల్‌లో లాగిన్ కావాలి.
- స్టెప్ 4 : అక్కడ ఉద్యోగి వ్యక్తిగత వివరాలు నమోదు చేయాలి.
- స్టెప్ 5 : ఆ తరువాత ఈపీఎఫ్ ఖాతాల విలీనం కోసం రిక్వెస్ట్ పంపించాలి. ఇందుకోసం మొబైల్ నంబర్, ప్రస్తుత యూఏఎన్, మెంబర్ ఐడీ సమర్పించాల్సి ఉంటుంది.
- స్టెప్ 6 : మొదటిగా సదరు వ్యక్తి పంపించిన రిక్వెస్ట్‌ను.. ప్రస్తుతం అతను పనిచేస్తున్న కంపెనీ ఆమోదించాల్సి ఉంటుంది.
- స్టెప్ 7 : ప్రస్తుత కంపెనీ ఆమోదం లభించిన తరువాత.. ఈపీఎఫ్ఓ సదరు ఉద్యోగి వివరాలు అన్నింటినీ పరిశీలించి, అన్ని ఈపీఎఫ్ ఖాతాల విలీన ప్రక్రియ మొదలుపెడుతుంది.
నోట్ : ఒక వేళ మీకు వేర్వేరు యూఏఎన్ నంబర్లపై, వేర్వేరు ఖాతాలు ఉంటే.. వాటిని మెర్జ్ చేయాలని కోరుతూ ఈపీఎఫ్ఓకు మెయిల్ చేయాల్సి ఉంటుంది.