Home loan planning tips : సొంత ఇళ్లు ప్రతి ఒక్కరి కల. దీనిని నిజం చేసుకునేందుకు పాత కాలంలో జీవితాంతం కష్టపడి పనిచేసి, కూడబెట్టిన డబ్బుతో ఇళ్లు కట్టుకునేవారు. కానీ నేడు ఆ అవసరం లేదు. స్వయంగా బ్యాంకులు, హౌసింగ్ ఫైనాన్స్ సంస్థలు.. గృహ రుణాలు ఇచ్చేందుకు సంసిద్ధంగా ఉన్నాయి. మంచి క్రెడిట్ హిస్టరీ ఉన్న వారికి తక్కువ వడ్డీకే రుణాలు అందిస్తున్నాయి. మరి మీరు కూడా తక్కువ వడ్డీకే హోమ్ లోన్ పొందాలనుకుంటున్నారా? అయితే దీని కోసం ఏం చేయాలో ఇప్పుడు తెలుసుకుందాం.
దీర్ఘకాలిక రుణం
హోమ్ లోన్ అనేది ఒక దీర్ఘకాలిక రుణం. అందువల్ల దీనిపై చాలా పెద్ద మొత్తంలో వడ్డీ చెల్లించాల్సి ఉంటుంది. అయితే ఈ ఆర్థిక భారాన్ని తగ్గించుకునేందుకు కొన్ని వ్యూహాలు ఉన్నాయి. ఈ వ్యూహాలు పాటిస్తే.. తక్కువ వడ్డీకే గృహ రుణాలు తగ్గుతాయి. ఫలితంగా మీరు నెలవారీగా చెల్లించాల్సిన వాయిదాల భారం కూడా బాగా తగ్గుతుంది.
టెన్యూర్ విషయంలో జాగ్రత్త!
Home Loan Tenure : గృహ రుణం తీసుకునేటప్పుడు లాంగ్ టెన్యూర్ ఎంచుకుంటే, నెలవారీ వాయిదాల భారం తగ్గుతుంది. కానీ ఇది దీర్ఘకాలంపాటు కొనసాగుతుంది కనుక.. వాస్తవానికి మీరు చాలా ఎక్కువ మొత్తంలో వడ్డీ చెల్లించాల్సి వస్తుంది. ఒక వేళ మీరు షార్ట్ టెన్యూర్ ఎంచుకుంటే, మీరు చెల్లించే ఓవరాల్ వడ్డీ చాలా తక్కువ అవుతుంది. కానీ నెలవారీ చెల్లించాల్సిన వాయిదాల భారం చాలా ఎక్కువ అవుతుంది. అందువల్ల మీరు మీ ఆదాయ వనరులపై ఒక కచ్చితమైన అంచనాకు వచ్చి, దానికి అనుగుణంగా హౌస్ లోన్ టెన్యూర్‌ను ఎంచుకోవాల్సి ఉంటుంది.
నోట్ : సాధారణంగా బ్యాంకులు చాలా వరకు షార్ట్ టెన్యూర్.. హోమ్ లోన్ విషయంలో తక్కువ వడ్డీ రేట్లను వసూలు చేస్తూ ఉంటాయి.
ప్రీ-పేమెంట్స్ చేయండి!
Home loan pre payment charges : మీ నెలవారీ ఆదాయం పెరిగిన సందర్భాల్లో.. గృహ రుణ వాయిదాలను కాస్త ముందరగానే చెల్లించండి. అలాగే మీ దగ్గర అధికంగా నిధులు ఉన్నప్పుడు.. ప్రిన్సిపల్ లోన్ అమౌంట్‌ను కూడా కొంత మేరకు తీర్చే ప్రయత్నం చేయండి. దీని వల్ల మీ ఆర్థిక భారం బాగా తగ్గుతుంది. ముఖ్యంగా తరువాతి 'ఈఎంఐ'లు కూడా బాగా తగ్గుతాయి.
Home loan pre closure charges : ఇక్కడ మీరొక విషయాన్ని చాలా జాగ్రత్తగా గుర్తుంచుకోవాలి. హోమ్ లోన్ పార్ట్-ప్రీపేమెంట్ చేయాలంటే.. మీకు మంచి ఆర్థిక క్రమశిక్షణ ఉండాలి. ఒక వేళ మీది ఫ్లోటింగ్ టైప్.. హౌసింగ్ లోన్ ఇంట్రస్ట్ రేటు అయితే.. ముందస్తు చెల్లింపు ఛార్జీలు కూడా ఉండవు. దీని వల్ల మరింత ఆర్థిక భారం తగ్గుతుంది. ఒక వేళ మీరు ఫిక్స్డ్ ఇంట్రస్ట్ రేటుతో గృహరుణం తీసుకుంటే.. ప్రీ-పేమెంట్ ఛార్జీలు చెల్లించాల్సి వస్తుంది.
హయ్యర్ డౌన్ పేమెంట్!
Home loan down payment : మీరు హయ్యర్ డౌన్ పేమెంట్‌తో గృహ రుణం తీసుకున్నప్పుడు, దాని వడ్డీ రేటు కూడా తగ్గే అవకాశం ఉంటుంది. ఎందుకంటే మీరు చాలా బాధ్యతాయుతమైన వ్యక్తి అని బ్యాంకులు, రుణ సంస్థలు భావిస్తాయి. వాస్తవానికి ఎక్కువ మొత్తంలో గృహ రుణం తీసుకుంటే.. రుణదాత ఎక్కువ రిస్క్‌ను భరించాల్సి ఉంటుంది. అందుకే ఆ రిస్క్‌ను అనుసరించి అధిక వడ్డీని వసూలు చేస్తారు. అదే మీరు తక్కువ మొత్తంలో రుణం తీసుకుంటే.. రిస్క్ తక్కువ కనుక, తక్కువ వడ్డీ రేటుకే రుణం ఇచ్చే అవకాశం ఉంటుంది.
ట్రాన్స్ఫర్ ఆప్షన్!
Home loan transfer process : గృహరుణం తీసుకునేటప్పుడు.. హోమ్ లోన్ బ్యాలెన్స్ ట్రాన్స్ఫర్ ఆప్షన్ ఉండేలా చూసుకోవడం చాలా మంచిది. దీని వల్ల తక్కువ వడ్డీ రేట్లు ఆఫర్ చేసే బ్యాంకుకు మన గృహ రుణాన్ని ట్రాన్స్ఫర్ చేసుకునే అవకాశం ఉంటుంది. ఫలితంగా రుణ భారం భారీగా తగ్గుతుంది.
Home loan transfer charges : కానీ ఇక్కడ మీరు కొన్ని విషయాల్ని గుర్తుంచుకోవాలి. అవి ఏమిటంటే.. ముందుగా మీరు హోమ్ లోన్ బ్యాలెన్స్ బదిలీ చేయడానికి అయ్యే ఖర్చులను భరించాల్సి ఉంటుంది. అలాగే కొత్త రుణదాతకు ప్రాసెసింగ్ ఫీజు, ఫోర్క్లోజర్ ఛార్జీలను చెల్లించాల్సి వస్తుంది.
లోన్ విత్ ఫ్లోటింగ్ ఇంట్రస్ట్ రేట్
Home loan floating interest rate : ఫ్లోటింగ్ ఇంట్రస్ట్ రేట్‌తో గృహ రుణం తీసుకోవడం వల్ల చాలా ఉపయోగాలు ఉన్నాయి. వాస్తవానికి ఫిక్స్డ్ ఇంట్రస్ట్ రేటులతో పోల్చితే.. ఈ ఫ్లోటింగ్ ఇంట్రస్ట్ రేట్లు తక్కువగా ఉంటాయి. ముఖ్యంగా షార్ట్ టెన్యూర్ హోమ్ లోన్ విషయంలో ఇది బాగా ఉపయోగపడుతుంది.
ఫ్లోటింగ్ ఇంట్రస్ట్ రేటుతో గృహరుణం తీసుకుంటే.. ప్రీ-పేమెంట్ ఛార్జీలు చెల్లించాల్సిన అవసరం ఉండదు. కానీ ఈ వడ్డీ రేట్లు.. దేశ ఆర్థిక పరిస్థితులను అనుసరించి మారుతూ ఉంటాయని గుర్తుంచుకోవాలి.
Home loan fixed interest rate : మీరు ఫిక్స్డ్ ఇంట్రస్ట్ రేటుతో గృహ రుణం తీసుకుంటే.. పార్ట్- ప్రీపేమెంట్ చేసినా, లేక ఫోర్క్లోజ్ చేసినా అదనపు రుసుములు చెల్లించాల్సి వస్తుంది.
మంచి క్రెడిట్ స్కోర్ బిల్డ్ చేసుకోండి!
Credit score improvement : మంచి క్రెడిట్ స్కోర్ ఉన్నవారికి తక్కువ వడ్డీకే బ్యాంకులు రుణాలు మంజూరు చేస్తూ ఉంటాయి. క్రెడిట్ స్కోర్ 750 పాయింట్లు కంటే ఎక్కువ ఉన్నవారికి బ్యాంకులు తక్కువ వడ్డీకి లోన్స్ ఇస్తాయి. అదే క్రెడిట్ స్కోర్ 600 కంటే తక్కువ ఉన్నవారికి బ్యాంకులు లేదా రుణ సంస్థలు రుణాలు ఇచ్చే అవకాశం చాలా తక్కువగా ఉంటుంది.
కొంత మందికి క్రెడిట్ స్కోర్ అనేది ఉండదు. అలాంటి వారికి కూడా బ్యాంకులు రుణాలు ఇస్తూ ఉంటాయి. కానీ వారి వద్ద అధిక వడ్డీని వసూలు చేస్తూ ఉంటాయి. కనుక నేటి కాలంలో ప్రతి ఒక్కరూ మంచి క్రెడిట్ స్కోర్‌ను బిల్డ్ చేసుకోవడం ఎంతైనా మంచిది. ఇందుకోసం మీ క్రెడిట్ కార్డు బిల్లులు, ఈఎంఐలు సకాలంలో చెల్లిస్తూ ఉండాలి. అలాగే మీ క్రెడిట్ కార్డు పరిమితిలో కేవలం 30 శాతం మాత్రమే వినియోగించుకోవాలి. ఇలా చేస్తే మీ క్రెడిట్ యోగ్యత పెరుగుతుంది.
రీసెర్చ్ చేయండి!
Best bank for housing loan : గృహ రుణానికి దరఖాస్తు చేసే ముందు కచ్చితంగా రీసెర్చ్ చేయండి. మార్కెట్లో తక్కువ వడ్డీ రేటుకే హోమ్ లోన్ ఇచ్చే బ్యాంకుల గురించి తెలుసుకోండి. అలాగే మీ రుణ చెల్లింపు సామర్థ్యం గురించి కూడా ఒక స్పష్టమైన అంచనాకు రండి.
Housing loan calculator : ఆన్లైన్లో నేడు అనేక ఈఎంఐ కాలిక్యూలేటర్లు ఉచితంగా లభిస్తున్నాయి. వాటిని ఉపయోగించి నెలవారీ ఈఎంఐ భారం ఎంత పడుతుందో ఒక అంచనాకు రండి. ఈ విధంగా మీరు మీ గృహ రుణ భారాన్ని తగ్గించుకునే ప్రయత్నం చేయవచ్చు.