High Interest Rate On FD For Senior Citizens In India : ఆ మధ్య కొన్ని బ్యాంకులు స్పెషల్ ఫిక్స్డ్ డిపాజిట్ పథకాలను తీసుకొచ్చాయి. వీటి వల్ల సాధారణ ఫిక్స్డ్ డిపాజిట్ల కంటే ఎక్కువ వడ్డీ ఇచ్చేలా.. స్వల్పకాలానికి గానూ ఈ ఫిక్స్డ్ డిపాజిట్లను బ్యాంకులు ప్రవేశపెట్టాయి. అలా స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా, ఇండియన్ బ్యాంక్, హెచ్డీఎఫ్సీ వంటి బ్యాంకులు తీసుకొచ్చిన కొన్ని స్పెషల్ ఫిక్స్డ్ డిపాజిట్ల గడువు త్వరలో ముగుస్తుంది. జూన్ చివరి వరకే ఈ ఎఫ్డీలు అందుబాటులో ఉండనున్నాయి. ఒకవేళ మీరు కూడా ఫిక్స్డ్ డిపాజిట్లు చేయాలని చూస్తుంటే త్వరలో ముగియనున్న ఆ పథకాలపై ఓ సారి లుక్కేయండి.
ఎస్బీఐ-400 రోజుల అమృత్ కలశ్..
SBI Amrit Kalash Deposit FD Scheme : 7.10% వడ్డీ రేటుతో 400 రోజుల (అమృత్ కలశ్) పథకాన్ని.. ప్రత్యేక కాలవ్యవధితో స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా గతంలో ఈ ఎఫ్డీని ప్రవేశపెట్టింది. ఈ ఫిక్స్డ్ డిపాజిట్లపై గరిష్ఠంగా 7.60% వడ్డీని.. సీనియర్ సిటిజన్లు పొందుతారు. 2023 జూన్ 30న ఈ పథకం ముగుస్తుంది.
ఎస్బీఐ 'వి కేర్'..
SBI Wecare Fd Scheme : ప్రత్యేకంగా సీనియర్ల సిటిజన్ల కోసమే 'వి కేర్' పేరుతో.. ప్రత్యేక ఎఫ్డీ పథకాన్ని రూపొందించింది ఎస్బీఐ. 5 నుంచి 10 సంవత్సరాల వరకు దీని కాలవ్యవధి ఉంటుంది. సీనియర్ సిటిజన్లు ఈ పథకం కింద 7.50% వడ్డీ రేటును పొందొచ్చు. 2023 జూన్ 30 వరకు ఈ ఎఫ్డీ పథకం అందుబాటులో ఉంటుంది.
ఇండియన్ బ్యాంక్ స్పెషల్ ఎఫ్డీ..
Indian Shakti 555 Days Plan : ఈ ఎఫ్డీ పథకం 555 రోజుల వ్యవధితో ఉంటుంది. ఈ పథకం కింద సాధారణ డిపాజిటర్లకు 7.25% వడ్డీని అందిస్తోంది ఇండియన్ బ్యాంక్. అదే సీనియర్ సిటిజన్లకు 7.75% వడ్డీని చెల్లిస్తోంది. 400 రోజుల కాలవ్యవధితో.. ఈ ఎఫ్డీపై 8% వడ్డీని సీనియర్ సిటిజన్లు పొందొచ్చు. ఈ ప్లాన్లో కనీస పెట్టుబడి పది వేల రూపాయలుగా ఉంటుంది. ఈ పథకం కూడా 2023 జూన్ 30న ముగుస్తుంది.
హెచ్డీఎఫ్సీ బ్యాంక్ 'సీనియర్ సిటిజన్ కేర్' ఎఫ్డీ..
HDFC Bank Senior Citizen Care FD : ఈ సీనియర్ సిటిజన్ కేర్ ఎఫ్డీని.. 2020లో హెచ్డీఎఫ్సీ బ్యాంక్ ప్రారంభించింది. ఈ పథకం కింద ఐదు కోట్ల రూపాయల కంటే తక్కువ డిపాజిట్లపై సీనియర్ సిటిజన్లకు ఇచ్చే అదనపు వడ్డీ 0.50% గాక, అదనంగా మరో 0.25% వడ్డీని హెచ్డీఎఫ్సీ బ్యాంక్ అందిస్తోంది. 5 నుంచి 10 సంవత్సరాల కాలానికి 7.75% వడ్డీ రేటును ఇస్తోంది. 2023 జులై 7న ఈ పథకం ముగుస్తుంది.