సంవత్సరానికి ఒకసారి ప్రీమియం చెల్లించే పాలసీలను ఎంచుకున్నప్పుడు.. ఎప్పటికప్పుడు పెరిగిన ప్రీమియం మొత్తాన్ని చెల్లించాల్సి వస్తుంది. రెండేళ్లు లేదా మూడేళ్ల కోసం ఒకేసారి ప్రీమియం కట్టినప్పుడు.. కొంత భారం తగ్గుతుంది. దాంతో పాటు ఏడాది తర్వాత పునరుద్ధరణ మర్చిపోకుండా.. రెండు లేదా మూడేళ్లపాటు ఎలాంటి అవాంతరం లేకుండా పాలసీ కొనసాగేలా ఇది తోడ్పడుతుంది.
ప్రీమియం పెరిగినా.. ఇబ్బంది ఉండదు..
ఏడాదికోసారి చెల్లిస్తే.. పెరిగిన ప్రీమియాన్ని చెల్లించాలి. బీమా సంస్థలు సాధారణంగా ప్రతి ఏడాది తమ ప్రీమియాలను కొంతమేర పెంచుతాయి. ఇలా పెంపు భారం తగ్గాలంటే.. దీర్ఘకాలిక వ్యవధి ఉన్న పాలసీలను తీసుకోవచ్చు. ముందే ప్రీమియం మొత్తం చెల్లిస్తారు కాబట్టి.. ప్రీమియం పెరిగినా కొంతకాలం వరకూ ఇబ్బంది ఉండదు.
ప్రీమియంపై రాయితీ..
ఏడాది పాసీలతో పోలిస్తే.. రెండు, మూడు ఏళ్ల ప్రీమియం ఒకేసారి చెల్లించడం భారమే. కానీ, బీమా సంస్థలు ఈ విధంగా ప్రీమియం చెల్లించేవారికి.. 10 శాతం దాకా రాయితీని ఇస్తున్నాయి. అయితే, బీమా సంస్థలను బట్టి ఈ రాయితీ విధానం మారుతుంది.
ఈఎంఐ సదుపాయం..
అధిక మొత్తంలో ప్రీమియం డబ్బులు చెల్లించాలనే ఇబ్బంది లేకుండా బీమా సంస్థలు కొంత వెసులుబాటు కూడా కల్పిస్తున్నాయి. మనకు కావాలనుకుంటే ఈ సౌకర్యాన్ని వినియోగించుకోవచ్చు. దీర్ఘకాలిక పాలసీలే కాదు.. వార్షిక ప్రీమియం చెల్లించే సందర్భంలోనూ నెలవారీ ఇన్స్టాల్మెంట్లను వాడుకోవచ్చు.
అలా చేస్తే ప్రీమియం ఆగిపోదు..
కొన్నిసార్లు పాలసీని పునరుద్ధరించుకోవడం సాధ్యం కాకపోవచ్చు. ఆదాయం మార్గాలు సన్నగిల్లడం.. ఆగిపోవడం, అనారోగ్యం, ప్రమాదాలు తదితర సందర్భాల్లో ఆర్థిక ఇబ్బందుల వల్ల పాలసీ ఆపేయాల్సి వస్తుంది. అలాంటప్పుడు దీర్ఘకాలిక పాలసీ ఉంటే.. కొన్నాళ్లపాటు అండగా ఉంటుంది. ఈ దీర్ఘకాలిక పాలసీ తీసుకునేటప్పుడు.. ప్రీమియం భారం పడకుండా చూసుకోవాలి. అందుకే చేతిలో డబ్బు ఉన్నప్పుడే ఇలాంటి పాలసీలు తీసుకోవడం ఉత్తమం.
పన్ను ప్రయోజనం..
వార్షిక ఆరోగ్య బీమా పాలసీకి, దీర్ఘకాలిక బీమా పాలసీలకు చెల్లించే ప్రీమియానికి ఆదాయపు పన్ను చట్టం సెక్షన్ 80డీ ప్రకారం మినహాయింపు లభిస్తుంది. ఉదాహరణకు మీరు మూడేళ్ల పాలసీకి రూ.45వేల ప్రీమియం చెల్లించారనుకుంటే.. అప్పుడు ప్రతి ఆర్థిక సంవత్సరంలో రూ.15వేల చొప్పున పన్ను మినహాయింపు పొందడానికి వీలు కలుగుతుంది. సెక్షన్ 80డీకి సంబంధించిన ధ్రువీకరణను బీమా సంస్థ మీకు అందిస్తుంది. ఇందులో కొత్త పన్ను విధానం ఎంచుకున్న వారు మినహాయింపులు చూపించాల్సిన అవసరం లేదు.
రోజురోజుకు పెరుగుతున్న వైద్య ఖర్చులను దృష్టిలో ఉంచుకొని.. ఆరోగ్య బీమా పాలసీ మొత్తం ఉండేలా చూసుకోవాలి. అప్పుడే అది మీకు సంపూర్ణ రక్షణ కల్పిస్తుందని మర్చిపోవద్దు. అదే సమయంలో మంచి చెల్లింపుల చేసిందన్న చరిత్ర ఉన్న బీమా సంస్థలకే పాలసీలు కట్టాలి.