చిన్న మొత్తాల పొదుపు పథకాలపై వడ్డీ రేట్లను కేంద్ర ప్రభుత్వం పెంచింది. పోస్టాఫీసు టర్మ్ డిపాజిట్, నేషనల్ సేవింగ్స్ సర్టిఫికెట్, సీనియర్ సిటిజన్ స్కీమ్‌పై 1.1 శాతం వరకు వడ్డీని సవరించింది. బ్యాంకులు, ఇతర ఆర్థిక సంస్థలు వడ్డీ రేట్లు పెంచిన నేపథ్యంలో పెంపును ప్రకటించింది. జనవరి 1 నుంచి వడ్డీ రేట్లు అమలు కానున్నాయి. పబ్లిక్ ప్రావిడెండ్ ఫండ్, ఆడపిల్లల కోసం ఉద్దేశించిన సుకన్య సమృద్ధి యోజన పథకాలపై ఎలాంటి పెంపూ లేదు.
నేషనల్ సేవింగ్స్ సర్టిఫికెట్ ప్రస్తుతం 6.8 శాతం వడ్డీ ఇస్తుండగా.. జనవరి 1 నుంచి 7 శాతం వడ్డీ ఇవ్వనున్నారు. సీనియర్ సిటిజన్ సేవింగ్స్ స్కీమ్ వడ్డీ రేటును 7.6 శాతం నుంచి 8 శాతానికి పెంచారు. పోస్టాఫీసు టర్మ్ డిపాజిట్లపై 1 నుంచి ఐదేళ్ల కాలావధికి ఇస్తున్న వడ్డీని 1.1 శాతం మేర పెంచినట్లు కేంద్రం తెలిపింది. అలాగే మంత్లీ ఇన్‌కమ్ స్కీమ్‌పై వడ్డీని 6.7 శాతం నుంచి 7.1 శాతానికి పెంచుతున్నట్లు ప్రకటించింది. కిసాన్ వికాస్ పత్ర వడ్డీ రేటును 7.0 శాతం నుంచి 7.2 శాతానికి పెంచారు. మెచ్యూరిటీ అయ్యే నెలలను 123 నుంచి 120కి తగ్గించారు. వచ్చే ఏడాది జనవరి 1 నుంచి మార్చి 31 వరకు ఈ వడ్డీ రేట్లు వర్తించనున్నాయి.