Gold Loan Vs Personal Loan : ఆర్థిక అవసరాలు ఎప్పుడు, ఎలా వస్తాయో ఎవరూ ఊహించలేరు. ఇలాంటి సమయంలో సాధారణంగా ఎవరైనా తమ దగ్గర ఉన్న బంగారాన్ని తనఖా పెట్టి డబ్బులు తెచ్చుకుంటారు. లేదా పరపతి ఉపయోగించి అప్పులు చేస్తారు. అయితే ఈ రెండింటిలో ఏది మంచిది? ఈ విషయం గురించి మీరు ఎప్పుడైనా ఆలోచించారా?
గోల్డ్ లోన్ వర్సెస్ పర్సనల్ లోన్
Personal Loan Vs Gold Loan : బ్యాంకింగ్ పరిభాషలో గోల్డ్ లోన్ అనేది ఒక సెక్యూర్డ్ లోన్. ఎందుకంటే ఇక్కడ బంగారాన్ని తనఖా పెట్టి, డబ్బులు అప్పుగా తీసుకుంటారు. ఒక వేళ రుణాన్ని తీసుకున్న వ్యక్తి దాన్ని చెల్లించకపోతే.. బ్యాంకులు లేదా నాన్-బ్యాంకింగ్ ఫైనాన్స్ కంపెనీలు (NBFC) ఆ బంగారాన్ని బాకీ కింద జమ చేసుకుంటాయి. కనుక ఇది సెక్యూర్డ్ లోన్.
వ్యక్తిగత రుణాలను అన్-సెక్యూర్డ్ లోన్స్ అని అంటారు. ఎందుకంటే పర్సనల్ లోన్స్‌కు ఎలాంటి హామీలు ఇవ్వడం జరగదు. కేవలం రుణగ్రహీత క్రెడిట్ స్కోర్, ఉద్యోగం, అప్పు తీర్చే సామర్థ్యాలను చూసి బ్యాంకులు లోన్స్ మంజూరు చేస్తూ ఉంటాయి.
లోన్ అమౌంట్ ఎంత వస్తుంది?
- Gold Loan Amount : గోల్డ్ లోన్ విషయంలో మనకు వచ్చే సొమ్ము అనేది సాధారణంగా మనం తనఖా పెట్టిన బంగారం విలువ, స్వచ్ఛతపై ఆధారపడి ఉంటుంది. బ్యాంకులు 18 క్యారెట్ లేదా అంత కన్నా ఎక్కువ ప్యూరిటీ ఉన్న బంగారంపై మాత్రమే రుణాలు మంజూరు చేస్తాయి. ఆర్బీఐ నిబంధనల ప్రకారం, లోన్ టూ వాల్యూ అనేది 75 శాతం ఉంటుంది. కానీ విపత్తుల సమయంలో ఇది 75 శాతం నుంచి 90 శాతం వరకు పెంచే అవకాశం కూడా ఉంటుంది. ఉదాహరణకు మీరు రూ.1 లక్ష విలువైన బంగారాన్ని బ్యాంకు వద్ద తాకట్టు పెడితే మీకు రూ.75,000 వరకు రుణం లభిస్తుంది.
- Personal Loan Amount : వ్యక్తిగత రుణం రేంజ్ అనేది రూ.20,000 నుంచి రూ.1 కోటి వరకు ఉంటుంది. పర్సనల్ లోన్ అమౌంట్ ప్రధానంగా మీ క్రెడిట్ స్కోర్, రీపేమెంట్ కెపాసిటీపై ఆధారపడి ఉంటుంది.
లోన్ కాలపరిమితి ఎలా ఉంటుంది?
- Gold Loan Tenure : సాధారణంగా బంగారంపై స్వల్పకాల రుణాలు మంజూరు చేస్తారు. ముఖ్యంగా 6 నెలల నుంచి 48 నెలల రేంజ్లో గోల్డ్ లోన్స్ ఇస్తూ ఉంటారు.
- Personal Loan Tenure : పర్సనల్ లోన్ విషయానికి వస్తే లోన్ టెన్యూర్ 12 నెలల నుంచి 72 నెలలు (6 సంవత్సరాలు) వరకు ఉంటుంది.
వడ్డీ రేట్లు ఎలా ఉంటాయి?
- Gold Loan Interest Rates : గోల్డ్ లోన్ వడ్డీ రేట్లు.. ఆయా సంస్థలు లేదా రుణదాతలను అనుసరించి మారుతూ ఉంటాయి. ముఖ్యంగా లోన్ టూ వాల్యూ, రుణ కాలపరిమితి, రుణ మొత్తం సహా ఇతర అంశాలపై వడ్డీ రేట్లు ఆధారపడి ఉంటాయి. సాధారణంగా బంగారు రుణాలపై 9 శాతం నుంచి 27 శాతం వరకు వడ్డీ రేట్లు ఉంటాయి.
- Personal Loan Interest Rates : వ్యక్తిగత రుణాలపై ఏడాదికి 10.5 శాతం నుంచి 24 శాతం వరకు వడ్డీ వసూలు చేస్తారు. ఒక వేళ మీ క్రెడిట్ స్కోర్ చాలా బాగుంటే.. తక్కువ వడ్డీకే రుణాలు మంజూరు అయ్యే అవకాశం ఉంటుంది.
ముందస్తుగా రుణం చెల్లిస్తే..
- Gold Loan Foreclosure Charges : రుణదాతలను అనుసరించి గోల్డ్ లోన్ ముందస్తు చెల్లింపు ఛార్జీలు మారుతూ ఉంటాయి. సాధారణంగా మీరు తీసుకున్న గోల్డ్ లోన్ మొత్తంలో ఇది 1% - 2% వరకు ఉంటుంది.
- Personal Loan Foreclosure Charges : ఆయా బ్యాంకులను అనుసరించి ముందస్తు చెల్లింపు ఛార్జీలు అనేవి ఆధారపడి ఉంటాయి. కొన్ని బ్యాంకులు ఫోర్క్లోజర్ ఛార్జీలు వసూలు చేయవు. మరికొన్ని నియమ, నిబంధనల ప్రకారం ముందస్తు చెల్లింపు రుసుములను వసూలు చేస్తూ ఉంటాయి. సాధారణంగా వ్యక్తిగత రుణ మొత్తంపై 3 శాతం వరకు ముందుస్తు చెల్లింపు రుసుము విధిస్తారు. దీనికి అదనంగా రుణగ్రహీత టాక్స్ కూడా కట్టాల్సి ఉంటుంది.
ఏది బెటర్ ఛాయిస్?
అత్యవసర సమయంలో గోల్డ్ లోన్, పర్సనల్ లోన్ రెండూ అక్కరకు వస్తాయి. ఒక వేళ మీకు పెద్ద మొత్తంలో డబ్బులు అవసరమైతే.. అందుకు తగ్గ బంగారం మీ దగ్గర ఉండాల్సిన అవసరం ఉంటుంది. లేని పక్షంలో మీరు కచ్చితంగా వ్యక్తిగత బ్యాంకు రుణాల కోసం ప్రయత్నించాల్సి ఉంటుంది.
- Gold Loan Benefits : గోల్డ్ లోన్ విషయంలో డాక్యుమెంటేషన్ చాలా తక్కువగా ఉంటుంది. మరీ ముఖ్యంగా త్వరగా రుణం మంజూరు అవుతుంది. ఒక వేళ మీ క్రెడిట్ స్కోర్ తక్కువగా ఉన్నప్పటికీ.. స్వయంగా మీ బంగారాన్నే తనఖా పెడుతున్నారు కనుక వెంటనే లోన్ లభిస్తుంది. వాస్తవానికి బంగారు రుణాలను ఎప్పుడైనా తీర్చే అవకాశం ఉంటుంది. నెలవారీగా చెల్లించవచ్చు. లేదా ఒకేసారి మొత్తం రుణాన్ని కూడా తీర్చేయవచ్చు. బంగారం లోన్ విషయంలో డిఫాల్ట్ కావడం జరగదు. ఎందుకంటే.. మీరు రుణం తీర్చకపోతే, మీరు తనఖా పెట్టిన బంగారాన్ని, బ్యాంకు లోన్ అమౌంట్ కింద జమ చేసుకుంటుంది.
- Personal Loan Benefits : వ్యక్తిగత రుణాల విషయంలో క్రెడిట్ స్కోర్ బాగా ఉంటే.. తక్కువ వడ్డీకే రుణాలు లభిస్తాయి. ఒక వేళ క్రెడిట్ స్కోర్ బాగా లేకుంటే అసలు రుణం కూడా దొరికే పరిస్థితి ఉండదు. ఒక వేళ తీసుకున్న రుణం తీర్చకపోతే.. భవిష్యత్‌లో రుణాలు పొందే అవకాశం కోల్పోతారు.
మీకు కనుక గోల్డ్ లోన్, పర్సనల్ లోన్ ఆప్షన్స్ రెండూ అందుబాటులో ఉంటే.. కచ్చితంగా తక్కువ వడ్డీ రేటుతో వచ్చే రుణాలను తీసుకోవడమే ఉత్తమం. ఒక మీరు ఎటూ తేల్చుకోలేకపోతే.. మీ వ్యక్తిగత ఆర్థిక నిపుణుల సలహాలు తీసుకోవడం మంచిది.