ITR Filing: గత ఆర్థిక సంవత్సరానికి సంబంధించి రిటర్నుల దాఖలుకు గడువు జులై 31తో ముగియనున్న నేపథ్యంలో పన్ను చెల్లింపుదారులు ఐటీ పోర్టల్‌కు పోటెత్తారు. గడువు పెంచేందుకు ప్రభుత్వం అంతగా సుముఖత వ్యక్తం చేయకపోవడం వల్ల.. పన్ను చెల్లింపుదారులు రికార్డు స్థాయిలో రిటర్నులను దాఖలు చేశారు. దీంతో ఆదివారం ఒక్కరోజే (రాత్రి 8గంటల వరకు) 53,98,348 మంది తమ ఐటీ రిటర్నులు ఫైల్ చేశారని ఆదాయపన్ను శాఖ వెల్లడించింది.
ITR filing last date: చివరి ఒక్క గంట (సాయంత్రం 5 నుంచి 6గంటల మధ్య) వ్యవధిలోనే 5,17,030 మంది ఐటీఆర్‌లు దాఖలు చేశారని ట్విటర్‌లో ఐటీ శాఖ తెలిపింది. పన్ను చెల్లింపుదారులకు అసౌకర్యం తలెత్తకుండా సాంకేతిక నిపుణులు, సోషల్ మీడియా బృందంతో కూడిన వార్‌రూమ్ 24x7 పనిచేస్తోందని ఐటీశాఖ పేర్కొంది. ఫైలింగ్‌కు సంబంధించి వచ్చే ఫిర్యాదులను ఎప్పటికప్పుడు పరిష్కరించేందుకు హెల్ప్ డెస్క్‌ను ఏర్పాటు చేస్తూ ప్రత్యేక నంబర్లు కేటాయించింది.
గడువు తీరినా..
itr date extended: ఆదాయపు పన్ను రిటర్నుల గడువును పొడిగించే అవకాశం లేదని ఇప్పటికే ప్రభుత్వం స్పష్టం చేసింది. అయితే, గడువు తీరిన తర్వాత డిసెంబరు 31 వరకూ రిటర్నులు దాఖలు చేసే అవకాశం ఉంది. కానీ, దీనికి సెక్షన్ 234 ఎఫ్ ప్రకారం కొంత అపరాధ రుసుము చెల్లించాల్సి ఉంటుంది. మొత్తం ఆదాయం రూ.5లక్షల లోపు ఉన్న వారికి ఇది రూ.1,000.. అంతకు మించి ఉన్నవారికి రూ.5,000 జరిమానా వర్తిస్తుంది. ఆదాయపు పన్ను రిటర్నులు దాఖలు చేయాల్సిన అవసరం లేని వారు.. స్వచ్ఛందంగా వాటిని సమర్పించవచ్చు. ఇలాంటివారికి గడువు దాటిన తర్వాతా ఎలాంటి అపరాధ రుసుము ఉండదు.
గడువు పెంచండి.. వెల్లువెత్తుతున్న వినతులు:
itr date extension: రిటర్నుల దాఖలుకు గడువు పెంచాలని పన్ను చెల్లింపుదారులు కోరుతున్నారు. ఇప్పటికీ ఐటీ వెబ్‌సైట్‌లో కొన్ని లోపాలున్నాయని, వాటిని సరిచేయకుండా గడువులోపు దరఖాస్తు చేయాలనే ఒత్తిడి పెంచడం సరికాదని వారంటున్నారు. రోజుకు కోటి మంది రిటర్నులు దాఖలు చేసినా, పోర్టల్‌లో ఎలాంటి సమస్యా ఉండదని తరుణ్ బజాజ్ పేర్కొనడం గమనార్హం.
అవకాశం లేకపోవచ్చు..
itr extension: ఐటీఆర్ దాఖలుకు గడువు తేదీ పొడిగించే అవకాశాలు తక్కువేనని నిపుణులు పేర్కొంటున్నారు. ఆడిట్ పరిధిలోకి వచ్చేవారు రిటర్నులు దాఖలు చేసేందుకు అక్టోబరు 31 దాకా సమయం ఉంటుంది. గడువు ముగిసే నాటికి మొత్తం రిటర్నుల సంఖ్య క్రితం అసెస్‌మెంట్ ఏడాది స్థాయికి చేరే వీలుందని అభిప్రాయపడుతున్నారు. ఈ నేపథ్యంలో గడువు పొడగించే అవకాశం ఉండదని అంటున్నారు.