FED Recesion: ద్రవ్యోల్బణాన్ని అదుపులో ఉంచడానికి కష్టమైనా మరిన్ని రేట్ల పెంపునకు వెళ్తామని అమెరికా ఫెడరల్ రిజర్వ్ ఛైర్మన్ జెరోమ్ పావెల్ పేర్కొన్నారు. అయితే వడ్డీరేట్లను అధికంగా పెంచడం వల్ల మాంద్యం తరహా పరిస్థితులు ఏర్పడుతున్నాయని విశ్లేషకులు అంటున్నారు. వృద్ధి మందగించి, ఆర్థిక వ్యవస్థ మాంద్యంలోకి జారకుండా ఫెడ్ ప్రయత్నించాలని సూచిస్తున్నారు.
2 శాతానికి ఎలా?
ఈ ఏడాది మే నెలలో అమెరికా ద్రవ్యోల్బణం 8.6 శాతానికి చేరింది. 1981 తర్వాత ఇంతగా పెరగడం ఇప్పుడే. దీంతో ఫెడ్ తాజా సమీక్షలో ప్రామాణిక వడ్డీ రేట్లను 75 బేసిస్ పాయింట్ల మేర పెంచింది. 1994 తర్వాత ఇంత భారీగా ఫెడ్ వడ్డీరేట్లు పెంచలేదు. మరిన్ని పెంపులూ ఉంటాయని తెలుస్తూనే ఉంది. ఆర్థిక వ్యవస్థ పట్టాలు తప్పకుండా.. ద్రవ్యోల్బణ లక్ష్యమైన 2 శాతానికి చేర్చడమనేది పావెల్‌కు అత్యంత సంక్లిష్టమైన అంశమే.
ఆర్థిక వ్యవస్థపై ప్రభావం..: వడ్డీ రేటు పెంపుతో వినియోగదార్లకు రుణ వ్యయాలు పెరుగుతూ పోతాయి. వ్యాపారులకూ అధిక వడ్డీ భారం పడుతుంది. దీంతో తప్పనిసరి అవసరాలు మినహా, ఇతర వ్యయాలకు జంకుతారు. ఇవన్నీ ఉద్యోగ వృద్ధిపై.. ఆర్థిక వ్యవస్థపై ప్రభావం చూపుతాయి. 'ద్రవ్యోల్బణాన్ని 2 శాతానికి పరిమితం చేసేందుకు చర్యలు తీసుకుంటామంటున్నారు. ఇందుకు మూల్యం చెల్లించాల్సి రావొచ్చు. మాంద్యం ఏర్పడేందుకు 50-50 అవకాశాలు ఉన్నాయి. దాన్ని తప్పించుకోవడం కష్టతరమే' అని ఆర్థికవేత్తలంటున్నారు. అధిక రేట్ల వల్ల కొంత నష్టం జరుగుతోందని స్వయానా ఫెడ్ అంటోంది. అయితే ద్రవ్యోల్బణం అదుపు కోసం మాంద్యాన్నేమీ సృష్టించబోమని పావెల్ అన్నారు.
చరిత్ర ఏమంటోందంటే..: వృద్ధికి అవరోధంగా మారే రేట్ల పెంపు వల్ల మాంద్యం వస్తుందనే ఆర్థిక చరిత్ర అంటోంది. 1955 నుంచి ఇప్పటి దాకా ద్రవ్యోల్బణం 4% కంటే ఎక్కువకు వెళ్లినపుడు; నిరుద్యోగం 5% దిగువకు చేరినపుడు అమెరికా ఆర్థిక వ్యవస్థ రెండేళ్ల వ్యవధిలోనే మాంద్యంలోకి జారుకుంది. ఇపుడేమో అమెరికా నిరుద్యోగ రేటు 3.6 శాతంగా ఉంది. ద్రవ్యోల్బణం మార్చి నుంచీ 8% పైనే ఉంది. చూడాలి ఈ సారి ఏమవుతుందో.
ఇప్పటికీ బలంగానే.. అమెరికా ఆర్థిక వ్యవస్థ బలంగానే ఉంది. ఉద్యోగ మార్కెట్ రాణిస్తోంది. ఏడాది కాలంగా కంపెనీలు నెలకు 5,45,000 ఉద్యోగాలు జత చేశాయి. నిరుద్యోగ రేటు 50 ఏళ్ల కనిష్ఠానికి చేరింది. ప్రతి నిరుద్యోగికి రెండు ఉద్యోగావకాశాలు కనిపిస్తున్నాయి. 2007-09 మహా మాంద్యం తరహాలో అమెరికా కుటుంబాలేమీ అప్పుల్లో కూరుకుపోలేదు. బ్యాంకులు, ఆర్థిక సంస్థలు మొండి బకాయిల్లో ఏమీ లేవు. ఇవన్నీ అమెరికాకు సానుకూల అంశాలే.
వడ్డీ రేట్లు పెంచిన బ్యాంక్ ఆఫ్ ఇంగ్లండ్
బ్యాంక్ ఆఫ్ ఇంగ్లండ్ వడ్డీ రేట్లను 25 బేసిస్ పాయింట్ల మేర పెంచింది. 40 ఏళ్ల గరిష్ఠానికి ద్రవ్యోల్బణం చేరినా.. ఆ ఒత్తిడిని పక్కకుపెట్టి తక్కువ స్థాయిలోనే పెంచింది. అందరి కంటే ముందుగా డిసెంబరులోనే ఈ కేంద్ర బ్యాంకు వడ్డీ రేట్లను పెంచడం మొదలుపెట్టింది. తాజాగా కీలక రేటును 1.25 శాతానికి చేర్చింది. అయితే యూఎస్ ఫెడర్ రిజర్వ్‌తో పోలిస్తే ఇవి తక్కువే. 'బ్యాంక్ ఆఫ్ ఇంగ్లండ్ కొంచెం కఠినంగా వ్యవహరిస్తేనే కొంత స్థిరత్వం కనిపించే అవకాశం ఉంది' అని విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. కరోనా అనంతరం కోలుకోవడానికి ప్రయత్నిస్తున్న ప్రపంచం కాస్తా ఉక్రెయిన్ యుద్ధం కారణంగా అధిక ద్రవ్యోల్బణం బారిన పడిన విషయం విదితమే.
వడ్డీ రేట్లు పెంచితే ఏమవుతుంది?
కీలక రేట్లు పెరిగితే.. ఆర్థిక వ్యవస్థలో ద్రవ్యలభ్యత తగ్గుతుంది. గృహ, వాహన రుణాలకు చెల్లించాల్సిన మొత్తం పెరుగుతుంది. అందువల్ల కొనుగోళ్లను ఆలస్యం చేయడం లేదా పూర్తిగా కొనుగోలు నిర్ణయాన్ని ఉపసంహరించుకోవడం జరుగుతుంది. వ్యాపారులు రుణాలు తీసుకోవడానికి ఎక్కువ వ్యయాలు చేయాల్సి ఉంటుంది. ఫెడ్ రేట్ల పెంపు వల్ల యూఎస్ బాండ్లపై పెట్టుబడిదార్లు దృష్టి పెడతారు. దీంతో డాలరు మారకపు రేటు పెరుగుతుంది. ఇందువల్ల అమెరికా ఉత్పత్తులు ఖరీదై, విదేశాల్లో విక్రయాలపై ప్రతికూలతలు కనిపించొచ్చు. అయితే దిగుమతులు చౌకగా మారి ద్రవ్యోల్బణ ఒత్తిళ్లు తగ్గుతాయి.
ఇదీ చూడండి : ప్రయాణికులకు షాక్.. 'టికెట్ రేట్లు 15% పెంపు!'.. ఏటీఎఫ్ బాదుడే కారణం!