Vehicle Brake Failure Tips in Telugu : కారు డ్రైవింగ్ ఇప్పుడు చాలా ఈజీగా మారిపోయింది. ఈ మధ్యకాలంలో బైక్ నడిపేవారిలో చాలా మంది కారు కూడా డ్రైవ్ చేస్తున్నారు. అయితే సరిగ్గా డ్రైవింగ్ చేయడం పెద్ద సవాల్‌తో కూడుకున్నది. ఎందుకంటే మీరు ఏదైనా హైవే మీద అతివేగంగా వావానాన్ని డ్రైవ్ చేస్తున్నప్పుడు కొన్నిసార్లు ఆకస్మాత్తుగా బ్రేక్స్ ఫెయిల్ అవుతుంటాయి. ఇలాంటి సమయంలో ఎంతటి వారికైనా గుండె జారుతుంది. బ్రేకులు ఫెయిల్ అయినప్పుడు ఏం చేయాలో తెలియక ఎదురొచ్చిన వాహనాలకు డ్యాష్ ఇస్తారు. లేదంటే ఏ చెట్టుకో, పుట్టకో తగిలించి ప్రాణాలు కోల్పోతారు. అయితే కారు డ్రైవ్ చేసేటప్పుడు సడెన్‌గా బ్రేకులు పని చేయకపోతే కంగారు పడకుండా కొన్ని చిట్కాలు పాటిస్తే ప్రమాదం జరగకుండా బయట పడవచ్చు. ఆ టిప్స్ ఏంటో ఇప్పుడు చూద్దాం..
భయం వద్దు.. ఎక్కువ వాహన ప్రమాదాలకు అసలు కారణం భయం. ఎవరైనా బ్రేకులు ఫెయిల్ అయిన విషయం తెలిసిన వెంటనే తీవ్ర భయాందోళనకు గురవుతారు. దాంతో ఏం చేయాలో తోచక ఆ సమయంలో చాలా తప్పుడు నిర్ణయాలు తీసుకుంటారు. కాబట్టి అందుకే ముందుగా మనలో భయాన్ని నియంత్రించుకోవాలి. ఎప్పుడూ బ్రేకులు ఫెయిల్ అయినా నిశ్చింతగా ఉండి.. కింద పేర్కొన్న కొన్ని స్టెప్పులను ఫాలో అయితే.. ప్రమాదం నుంచి ఈజీగా గట్టెక్కే అవకాశం ఉంది.
వార్నింగ్ లైట్స్ ఆన్ చేయడం: మీ చుట్టూ ఉన్న వాహనాలను అప్రమత్తం చేయడానికి.. వార్నింగ్ లైట్లను ఆన్ చేసి.. హారన్ కొడుతూ ఉండండి. మీరు కారులో సమస్యను ఎదుర్కొంటున్నారని రోడ్డుపై ఉన్న ఇతర వ్యక్తులను అప్రమత్తం చేస్తున్నారు కాబట్టి చుట్టుపక్కల ట్రాఫిక్‌ను క్లియర్ చేయడంలో ఇది సహాయపడుతుంది.
క్రూయిజ్ కంట్రోల్ టెక్నాలజీ : వెహికల్‌ను నియంత్రణలోకి తీసుకొచ్చేందుకు క్రూయిజ్ కంట్రోల్ టెక్నాలజీ ఉంటే దాన్ని ఆఫ్ చేయాల్సి ఉంటుంది. అదే విధంగా గేర్లను కూడా నెమ్మదిగా తగ్గించాలి. దాంతో పాటు ఎమర్జెన్సీ బ్రేకులనూ ఉపయోగించాలి. అయితే ఈ బ్రేకులు వాహనాన్ని పూర్తిగా నిలపలేకపోయినా.. వెహికల్ స్పీడ్‌ను కొంతమేర తగ్గిస్తాయి.
చివరి అవకాశంగా ఏం చేయాలంటే : ఇక వాహనాన్ని పూర్తిగా నిలిపేసేందుకు చివరి అవకాశంగా ఏదైనా తేలికపాటి వస్తువును ఢీకొట్టవచ్చు. అలా చేయడం ద్వారా వెహికల్ స్పీడ్ గణనీయంగా తగ్గి పూర్తిగా నిలిచిపోయే అవకాశం ఉంది. అయితే బ్రేకింగ్ ఫెయిలయిన టైమ్‌లో స్టీరింగ్ వీల్‌ను చాలా జాగ్రత్తగా ఉపయోగించాలి. కాబట్టి వెహికల్ స్పీడ్ నియంత్రించేందుకు ఇతర వస్తువును ఢీకొట్టడం అనేది చివరి అవకాశంగా మాత్రమే ఉపయోగించాలనేది మీరు గుర్తుంచుకోవాలి.
అదేవిధంగా పరిస్థితి చేయిదాటిపోయి వెహికల్‌ను పూర్తిగా నిలిపి వేసే అవకాశం లేనప్పుడు, ప్రమాదం జరుగుతుందని భావించినప్పుడు.. శరీరానికి గాయాలు కాకుండా భద్రతా చర్యలు తీసుకోవాలి. కాళ్లు, చేతులు సహా ముఖానికి గాయాలు కాకుండా వాహనంలో అందుబాటులో ఉన్న షీల్డ్ లాంటివి ఉపయోగించాలి. దాని ఫలితంగా ప్రమాదం జరిగినా.. శరీర భాగాలకు గాయాలు కాకుండా సురక్షితంగా బయటపడొచ్చు.
అయితే ప్రస్తుతం అన్ని కార్లు, ఇతర వాహనాలలో అత్యాధునిక బ్రేకింగ్ వ్యవస్థ అందుబాటులో ఉంటోంది. కాబట్టి మీ వాహనం బ్రేక్ ఫెయిల్ అయ్యే సందర్భాలు చాలా అరుదుగా జరుగుతాయి. ఒకవేళ అలాంటి పరిస్థితి ఎదురైనా ఆ సమయంలో ఆందోళన చెందకుండా.. పైన చెప్పిన టిప్స్ ఫాలో అవ్వండి..