How To start Profitable Business : ప్రస్తుత రోజుల్లో చాలా మంది బిజినెస్ చేయడానికి ఆసక్తి చూపుతున్నారు. ముఖ్యంగా యువత ఉద్యోగాలకంటే వ్యాపారం వైపే మొగ్గు చూపుతున్నారు. అది చిన్నదైనా, పెద్దదైనా బిజినెస్ బెస్ట్ అని భావిస్తున్నారు. అంతేకాకుండా.. ప్రభుత్వాలు కూడా ప్రోత్సాహకాలు ఇస్తుండడంతో పెద్ద మొత్తంలో వ్యాపారాలు ఊపందుకున్నాయి. అయితే బిజినెస్(Business) అనేది ఎప్పుడూ కాస్త రిస్క్‌తో కూడుకున్నదని.. అనేక ఒడిదుడుకులను ఎదుర్కొవాలని నిపుణులు అంటున్నారు.
Business Planning Tips : అలాగే మారుతున్న కాలానికి అనుగుణంగా.. వినియోగదారుల అభిరుచులకు అనుగుణంగా ఎప్పటికప్పుడూ వ్యాపారంలో కొత్తదనం కనిపించాలంటున్నారు. అందుకే ఏదైనా కొత్తగా వ్యాపారం చేయాలనుకున్నప్పుడు కొన్ని బిజినెస్ టిప్స్ పాటించడంతో పాటు కొన్ని విషయాలపై అవగాహన కలిగి ఉండాలని సూచిస్తున్నారు. అప్పుడే చిన్న చిన్న నష్టాలు వచ్చినా తిరిగి పుంజుకోవచ్చని అంటున్నారు నిపుణులు.
ఎలాంటి బిజినెస్ ఎంచుకోవాలి.. మీరు ఏదైనా బిజినెస్ స్టార్ట్ చేయాలనుకున్నప్పుడు.. ముందు దాని గురించి పూర్తిగా తెలుసుకోవాలి. ఎలాంటి వ్యాపారం చేస్తే ఎలాంటి లాభాలు ఉంటాయి? దానిలో లోటుపాట్లు ఏంటి? అనేవి ఆలోచించుకుని చాలా జాగ్రత్తగా నిర్ణయం తీసుకోవాలి. ఏ పని చేసినా అది లాభదాయకంగా ఉండేలా చూసుకోవాలి. అంతేకాదు మీకు ఎక్కువ నాలెడ్జ్ ఉన్న బిజినెస్ ఎంచుకుంటే చాలా ఉత్తమం. లేదంటే తెలియని దాంట్లోకి అడుగుపెట్టి.. డబ్బును నష్టపోవద్దు.
మార్కెట్‌లో పోటీదారులు.. వ్యాపారం పెట్టాలనుకునే వారు కచ్చితంగా మార్కెట్లో తమ పోటీదారుల గురించి తెలుసుకోవాలి. యువ వ్యాపారులు సాధారణంగా తమ ఉత్పత్తులపై మాత్రమే డబ్బు, సమయాన్ని వెచ్చిస్తారు. అలాగే పోటీదారులపై తక్కువ పరిశోధన చేస్తారు. కానీ, ఇతర పోటీదారుల కంటే భిన్నంగా ఆలోచించి.. లోతైన మార్కెట్ పరిశోధన చేస్తే.. నష్టాలు రావనే విషయం గుర్తుంచుకోవాలి.
ముందస్తు ప్రణాళిక అవసరం.. బిజినెస్ పెట్టాలనుకునే ప్రతి వ్యాపారవేత్తకు ఒక స్పష్టమైన ప్రణాళిక ఉండాలి. వ్యాపారాన్ని ప్రారంభించే ముందు.. దానికి సంబంధించిన మ్యాప్‌ను రూపొందించుకోవాలి. ఎందుకంటే వ్యాపార ప్రణాళిక అనేది బిజినెస్ ప్రారంభించడానికి మాత్రమే కాదు.. నిధులు, వృద్ధికి కూడా గణనీయంగా దోహదపడుతుంది.
ఓపిక అవసరం.. ఎవరైనా కొత్తగా వ్యాపారం ప్రారంభిస్తే మొదట్లోనే విజయం రాలేదని బాధపడవద్దు. ఎందుకంటే లాభాలు అనేది అంత సులభంగా వచ్చేవి కావు. ప్రారంభించే వ్యాపారాన్ని బట్టి కొందరికి త్వరగా లాభాలు వస్తే.. ఇంకొందరికి కాస్త ఆలస్యంగా వస్తాయి. వ్యాపారాన్ని లాభాల బాట పట్టించాలంటే ఓపిక అవసరం. అందుకే తొందరపడకుండా ఒక్కో అడుగు వేసుకుంటూ ఆయా వ్యాపారంలో ముందుకు వెళ్లాలి.
స్కేలబుల్ బిజినెస్ మోడల్.. ఒక వ్యాపారం మొదలయ్యాక.. అదే ఇన్‌పుట్‌తో మరింత ఉత్పాదకతను పెంచగల పరిస్థితిని స్కేలబుల్ బిజినెస్ మోడల్ అని అంటారు. ఈ మోడల్లో అందుబాటులో ఉన్న వనరుల ద్వారానే మరింతగా కార్యకలాపాలను పెంచుకోవడానికి కంపెనీ అనుమతిస్తుంది. బాహ్య వనరులను అరువుగా తీసుకోవడం, వ్యవస్థలను ఆటోమేట్ చేయడం, అవసరమైన చోట అవుట్సోర్సింగ్కు పనులను అప్పగించడం ద్వారా ఈ స్కేలబిలిటీని మెరుగుపరచవచ్చు.
బిజినెస్ స్ట్రక్చర్.. బిజినెస్ స్ట్రక్చర్ కూడా చాలా కీలకమైనదనే విషయం గుర్తుంచుకోవాలి. ఇది మీ వ్యాపారాన్ని బాగా ప్రభావితం చేస్తుందనడంలో ఎలాంటి సందేహం లేదు. మీరు లిమిటడ్ లయబిలిటీ కంపెనీ (LLC), లిమిటెడ్ లయబిలిటీ పార్ట్‌నర్‌షిప్ (LLP), సోల్ ప్రొప్రేటర్, కార్పొరేట్ స్ట్రక్చర్ వంటి వాటిలో ఏదైనా వ్యాపార నిర్మాణాన్ని ఎంచుకోవచ్చు. అది ఏదైనా గానీ.. పక్కా ప్రణాళికతోనే వ్యాపారంలోకి దిగాలి.
How To Get Business Loan : బిజినెస్ లోన్ కావాలా?.. ఈ సింపుల్ స్టెప్స్ ఫాలో అవ్వండి!