టెస్లా సీఈఓ ఎలాన్ మస్క్, ట్విట్టర్ మధ్య వివాదం రోజురోజుకూ ముదురుతున్నట్లు కనిపిస్తోంది. ట్విట్టర్ కొనుగోలు ఒప్పందం నుంచి వెనక్కి తగ్గిన మస్క్‌పై ఇటీవలే ఆ సంస్థ కోర్టులో దావా వేసింది. దీంతో ఇరు పక్షాల మధ్య సుదీర్ఘ న్యాయపోరాటం కొనసాగే అవకాశం ఉందన్న విశ్లేషణలు వెలువడుతున్నాయి. తాజాగా మరో ఆసక్తికరమైన విషయం వెలుగులోకి వచ్చింది. డీల్‌ను రద్దు చేసుకోవడానికి ముందే మస్క్ ట్విట్టర్ సీఈఓ పరాగ్ అగర్వాల్‌కు ఓ సందేశం పంపినట్లు తెలుస్తోంది. కొనుగోలు కోసం తాను సమీకరిస్తున్న నిధుల వనరులకు సంబంధించిన కీలక సమాచారాన్ని ట్విట్టర్ న్యాయవాదులు అడుగుతున్నారని ఆయన దాంట్లో పేర్కొన్నారు. ఫలితంగా ఇబ్బందులు సృష్టించే ప్రయత్నం చేస్తున్నారని ఆరోపించారు. వెంటనే దీన్ని ఆపాలని కోరారు.
ట్విట్టర్ కొనుగోలు ఒప్పందాన్ని రద్దు చేసుకుంటున్నట్లు మస్క్ ఇటీవలే ప్రకటించారు. ట్విట్టర్‌ను 44 బిలియన్ డాలర్లతో కొనుగోలు చేయాల్సిందేనంటూ ఆ కంపెనీ ఇటీవల మస్క్‌పై దావా వేసింది. దీనిపై మస్క్ మండిపడ్డారు. విచారణ సంసిద్ధతకు నెలల సమయం పట్టవచ్చని అన్నారు. ట్విట్టర్ కావాలనే నకిలీ ఖాతాల సమాచారాన్ని నొక్కిపెట్టి ఉంచిందని మస్క్ తరఫు న్యాయవాదులు డెలావర్ కోర్ట్ ఆఫ్ ఛాన్సరీలో పిటిషన్ దాఖలు చేశారు. ఇక వేగవంతమైన విచారణకు ట్విట్టర్ చేసుకున్న విజ్ఞప్తిపైనా విమర్శలు చేశారు. నకిలీ ఖాతాలకు సంబంధించిన అన్ని సాక్ష్యాలను ఇవ్వడానికి ట్విట్టర్ నుంచి సమాచారం తెలుసుకోవడానికి నెలల సమయం పట్టొచ్చని వ్యాఖ్యానించారు. దీంతో ట్విట్టర్ న్యాయపోరాటం మొదలుపెట్టింది. ఇద్దరు అత్యున్నత స్థాయి మేనేజర్లను మస్క్‌కు తెలియకుండా తొలగించడం ద్వారా కొనుగోలు ఒప్పందాన్ని ట్విట్టర్ ఉల్లంఘించిందన్న ఆరోపణలతో పాటు పలు అంశాలను కోర్టుకు మస్క్ న్యాయవాదులు తెలియపరిచారు.
ఇవీ చదవండి: 'పెరుగుతున్న గిరాకీ.. ఎంఎన్సీల చూపు భారత్ వైపు.. 2030 నాటికి అలా..'
సామాన్యుడిపై మరో పిడుగు.. నిత్యావసర ధరలు పైపైకి.. పాలు, పెరుగు సహా..