ED On Loan Apps : రుణ యాప్‌ల వ్యవహారంలో ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) విచారణ వేగవంతం చేసింది. ఈ కేసుకు సంబంధించిన దర్యాప్తులో భాగంగా రేజోర్‌పే, పేటీఎం, క్యాష్‌ఫ్రీ వంటి ఆన్‌లైన్ పేమెంట్ గేట్‌వే సంస్థల కార్యాలయాల్లో శనివారం సోదాలు చేపట్టింది. కర్ణాటక రాజధాని బెంగళూరులోని ఆరు ప్రాంతాల్లో ఏకకాలంలో ఈ తనిఖీలు జరుగుతున్నట్లు ఈడీ ఓ ప్రకటనలో వెల్లడించింది.
చైనా నియంత్రణలో నడుస్తోన్న అనేక లోన్ యాప్ సంస్థలకు.. ఈ పేమెంట్ గేట్‌వేలతో సంబంధం ఉందన్న ఆరోపణలపై ఈ సోదాలు చేపట్టినట్లు తెలుస్తోంది. తనిఖీల్లో భాగంగా చైనా నియంత్రణలో ఉన్న సంస్థల బ్యాంక్ ఖాతాలు, మర్చెంట్ ఐడీల నుంచి రూ.17కోట్లు స్వాధీనం చేసుకున్నట్లు ఈడీ తెలిపింది.
లోన్ యాప్ సంస్థలు భారతీయుల నకిలీ ఖాతాలను ఉపయోగించి, డమ్మీ డైరెక్టర్లను పెట్టి ఈ నేరాలకు పాల్పడుతున్నట్లు ఈడీ పేర్కొంది. ఈ రుణ సంస్థలను చైనా వ్యక్తులు నిర్వహిస్తున్నట్లు దర్యాప్తులో తేలిందని వెల్లడించింది. పేటీఎం వంటి పేమెంట్ గేట్‌వేల వద్ద ఉన్న మర్చెంట్ ఐడీ/ఖాతాల ద్వారా ఈ అక్రమ వ్యాపారం సాగుతున్నట్లు గుర్తించామని తెలిపింది. ప్రస్తుతం రేజోర్‌పే, క్యాష్‌ఫ్రీ, పేటీఎం, మరికొన్ని చైనా నియంత్రణ సంస్థల కార్యాలయాల్లో ఈ సోదాలు జరుగుతున్నట్లు పేర్కొంది.
సత్వర రుణాల పేరుతో వినియోగదారులను ఆకర్షించి ఆ తర్వాత వేధింపులు గురిచేస్తోన్న మోసం ఆ మధ్య వెలుగులోకి వచ్చిన విషయం తెలిసిందే. దేశవ్యాప్తంగా పలు నగరాల్లో ఈ తరహా మోసాలు బయటపడ్డాయి. ఈ లోన్ యాప్ సంస్థలు తొలుత సత్వర రుణాలతో వినియోగదారులను ఆకట్టుకుని.. ఆ తర్వాత రుణం మంజూరైన వినియోగదారుల నుంచి అత్యధిక వడ్డీలు వసూలు చేస్తున్నట్లు పోలీసుల దర్యాప్తులో తేలింది. చెప్పిన వడ్డీ ఇవ్వకపోతే వారిపై బెదిరింపులు పాల్పడుతుండంతో ఈ సంస్థలపై పలు చోట్ల కేసులు నమోదయ్యాయి. ఈ లోన్ యాప్ సంస్థలను చైనా సంస్థలు/వ్యక్తులు నిర్వహిస్తోన్నట్లు తెలిసింది. దీంతో ఈడీ వాటిపై మనీలాండరింగ్ కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టింది.
ఇవీ చదవండి: ఐదో అతిపెద్ద ఆర్థిక వ్యవస్థగా భారత్.. ఆరోస్థానానికి పడిపోయిన బ్రిటన్
'రూ.5 కోట్లకు మించి జీఎస్టీ ఎగవేస్తే అధికారులే నేరుగా విచారించొచ్చు'