Co Branded Credit Cards : నేటి కాలంలో క్రెడిట్ కార్డుల వినియోగం రోజురోజుకూ బాగా పెరిగిపోతోంది. ఒకప్పటిలా కాకుండా బ్యాంకులు కూడా వీటిని చాలా సులువుగా మంజూరు చేస్తున్నాయి. పైగా క్యాష్‌బ్యాక్, రివార్డ్ పాయింట్స్, డిస్కౌంట్లు లాంటి బహుళ ప్రయోజనాలను అందిస్తున్నాయి. ఫలితంగానే నేడు క్రెడిట్ కార్డ్ వినియోగదారుల సంఖ్య విపరీతంగా పెరుగుతోంది. ఈ క్రమంలో కొన్ని సంస్థలు తమ వ్యాపారాన్ని పెంచుకునేందుకు.. ఇతర సంస్థలు/ బ్యాంకులతో కలిసి .. కో బ్రాండెడ్ క్రెడిట్ కార్డులను జారీ చేస్తున్నాయి.
కో బ్రాండెండ్ క్రెడిట్ కార్డ్ అంటే ఏమిటి?
What Is Co Branded Credit Card : కో బ్రాండెండ్ క్రెడిట్ కార్డులు.. సాధారణ క్రెడిట్ కార్డుల కంటే అదనపు ప్రయోజనాలను అందిస్తాయి. వాస్తవానికి మారుతున్న పరిస్థితులు, వినియోగదారుల అవసరాలకు అనుగుణంగా మార్కెట్లోకి అనేక రకాల క్రెడిట్ కార్డులు వస్తున్నాయి. వ్యాపారులు, రిటైలర్లు, సర్వీస్ ప్రొవైడర్లు, నిర్దిష్ట బ్రాండెడ్ కంపెనీలు.. బ్యాంకులతో కలిసి (టై-అప్‌తో) కో బ్రాండెడ్ క్రెడిట్ కార్డులను తీసుకొని వస్తాయి. వీటి ద్వారా తమ యూజర్లకు బెస్ట్ ఆఫర్స్, బెనిఫిట్స్, డిస్కౌంట్స్ అందిస్తాయి. వాస్తవానికి ఆయా కంపెనీలు.. తమ అనుబంధ బ్రాండ్లతో, బ్యాంకులతో కలిసి వీటిని అందిస్తూ ఉంటాయి. ముఖ్యంగా తక్కువ వడ్డీతో ఈఎంఐ సౌకర్యం కల్పిస్తాయి. అలాగే ప్రాసెసింగ్ ఫీజుపై రాయితీలు కల్పిస్తాయి. అందువల్ల మీ అలవాట్లకు సరిపోయే కో బ్రాండెడ్ క్రెడిట్ కార్డును తీసుకోవడం ఉత్తమం. అప్పుడే మీరు సాధారణ క్రెడిట్ కార్డు కంటే అదనపు రివార్డు పాయింట్లు, డిస్కౌంట్ ప్రయోజనాలు పొందుతారు.
కో బ్రాండెండ్ క్రెడిట్ కార్డు ప్రయోజనాలు
Co Branded Credit Card Benefits : కో బ్రాండెడ్ క్రెడిట్ కార్డును ఉపయోగించి లావాదేవీలు చేసే వారు నిర్దేశిత టార్గెట్‌ను చేరుకుంటే.. వార్షిక రుసుము మినహాయింపు పొందవచ్చు. అంతేకాదు మైల్స్టోన్ రివార్డ్ పాయింట్ల కింద అదనపు ప్రయోజనాలు కూడా లభిస్తాయి. కోబ్రాండెడ్ క్రెడిట్ కార్డులు సూచించిన మర్చంట్స్ నుంచి నో-కాస్ట్ ఈఎంఐ ఆప్షన్ ద్వారా కొనుగోలు చేస్తే తక్కువ వడ్డీకే లోన్స్ లభిస్తాయి. కో బ్రాండెడ్ క్రెడిట్ కార్డులను కొత్తగా తీసుకున్న వారికి వెల్‌కమ్ ఆఫర్ కింద షాపింగ్ కూపన్లు, డిస్కౌంట్లు లభిస్తూ ఉంటాయి.
ఎలాంటి క్రెడిట్ కార్డు ఎంచుకోవాలి?
How To Choose Best Credit Card : మీరు ఏదైనా క్రెడిట్ కార్డును ఎంచుకునే ముందు.. కచ్చితంగా మీ అవసరాలను గుర్తించాలి. అందుకు అనుగుణంగానే మంచి క్రెడిట్ కార్డ్‌ను ఎంచుకోవాలి. కో బ్రాండెడ్ క్రెడిట్ కార్డులను తీసుకునే ముందు.. అవి ఇచ్చే ఆఫర్లు, డిస్కౌంట్లు మీ అవసరాలను తీర్చే విధంగా ఉండాలి. అంతే కాని ఫ్రీగా వస్తున్నాయి కదా అని అవసరం లేని వాటిని తీసుకోకూడదు. దీని వల్ల మీపై ఆర్థిక భారం పడుతుంది. ఒక వేళ మీరు వాటిని సకాలంలో చెల్లించకపోతే.. మీ క్రెడిట్ స్కోర్ కూడా తగ్గుతుంది. ఇది భవిష్యత్‌లో మీరు రుణాలు పొందలేని పరిస్థితిని ఏర్పరుస్తుంది. కనుక క్రెడిట్ కార్డులు తీసుకునేముందు.. దాని ఫీచర్లు, రుసుములు, వడ్డీ రేట్లు, ఆఫర్లు, రివార్డ్ పాయింట్లు అన్నింటినీ పరిశీలించండి. అలాగే మల్టిపుల్ బ్రాండ్ల అనుసంధానంతో తీసుకొచ్చిన క్రెడిట్ కార్డులను ఎంచుకోవాలి. అప్పుడే మీకు సరైన లబ్ధి చేకూరుతుంది.