Car Subscription Model : కొత్త కారు కొనాలంటే కాస్త ఖర్చుతో కూడుకున్న వ్యవహారమే. కొన్ని లక్షలు పోస్తే కానీ మంచి కారును కొనలేము. ఒకవేళ అంత మొత్తంలో వెచ్చించలేము సెకండ్ హ్యాండ్ కారు తీసుకుందాం అనుకుంటే వాటికి సంబంధించి రిపేర్ ఖర్చులు అదనంగా ఉంటాయి. అయితే ఈ రెండు పద్ధతుల ద్వారా కాకుండా మార్కెట్లో ఓ కొత్త మోడల్ అందుబాటులోకి వచ్చింది. అదే సబ్‌స్క్రిప్షన్ మోడల్. దీని సాయంతో మీకు నచ్చిన కారును సొంతం చేసుకొని అందులో ఎంచక్కా తిరగవచ్చు. ఇప్పుడిప్పుడే విస్తరిస్తున్న ఈ సబ్‌స్క్రిప్షన్ మోడల్ ఎలా పనిచేస్తుంది? దీని ద్వారా ఎవరికి లాభం, ఎవరికి నష్టం అనే వివరాలు ఇప్పుడు తెలుసుకుందాం.
సబ్‌స్క్రిప్షన్‌తో లాభమిది..!
Car Subscription Benefits : కొత్త కారును కొనేందుకు చాలామంది వెహికిల్ లోన్ ఆప్షన్‌కు వెళ్తుంటారు. ఈ రుణం తీరాలంటే వడ్డీతోపాటు అసలు చల్లించాల్సి ఉంటుంది. కారులో తరచూ పెట్రోల్, డీజిల్ పోయించడం సహా పాటు దానికి ఇన్సూరెన్స్ చేయించాలి. ఒకవేళ ఏమైనా పాడయితే వాటి రిపేర్ ఖర్చులు కూడా మనమే చూసుకోవాలి. కొంతకాలం తర్వాత కారును అమ్మాలనుకుంటే తరుగుదల కారణంగా దాని విలువ అమాంతం తగ్గిపోతుంది. అయితే ఇవన్నీ సబ్‌స్క్రిప్షన్ మోడల్లో కనిపించవు. అంటే ఈ పద్ధతిలో కారును సొంతం చేసుకుంటే గనుక నెలవారీగా నిర్దేశిత చందా చెల్లించి.. మీ అవసరాలకు తగినంత పెట్రోల్, టోల్ ఛార్జీల భారం భరిస్తే సరిపోతుంది.
ఇలా పనిచేస్తుంది..!
How Does Car Subscription Work : సాధారణంగా కొత్తకారు కొనేటప్పుడు ఖచ్చితంగా ఎంతోకొంత డౌన్ పేమెంట్ చేయాల్సి ఉంటుంది. మిగతా మొత్తాన్ని రుణం తీసుకొని చెల్లిస్తుంటారు. అయితే సబ్‌స్క్రిప్షన్ విధానంలో మాత్రం మీకు నచ్చిన కారును ఎంపిక చేసుకోవచ్చు. ఇందులో కేవలం నెలవారీ చందా మాత్రమే చెల్లిస్తే సరిపోతుంది. దీంతో మీరు ఎంపిక చేసుకున్న కాలవ్యవధి వరకు మీరు కోరుకున్న కారు మీ దగ్గరే ఉంటుంది. అప్పటి వరకు దానికి యజమాని మీరే. సబ్‌స్క్రిప్షన్ విధానంలో 12 నెలల నుంచి 48 నెలల కాలానికి.. తమకు అనువైన మోడల్‌ను చందాదారులు ఎంచుకోవచ్చు. ఇందుకోసం డ్రైవింగ్ లైసెన్స్‌తో పాటు బ్యాంకు రుణం తీసుకునే సమయంలో ఉపయోగపడే పత్రాలన్నింటినీ సదరు కంపెనీ వద్దకు తీసుకెళ్లాల్సి ఉంటుంది. ప్రభుత్వానికి చెల్లించాల్సిన ట్యాక్సులు, మెయింటెనెన్స్, సర్వీసింగ్, రోడ్ సైడ్ అసిస్టెన్స్, రిజిస్ట్రేషన్, వారంటీ, రిపేర్లు ఇలా అన్నీ ఖర్చులు మీరు తీసుకునే ప్యాకేజీలో భాగంగానే ఉంటాయి. అయితే ప్రస్తుతానికి ఈ సదుపాయాన్ని ప్రముఖ ఆటోమొబైల్స్ సంస్థలు మారుతీ సుజుకీ, హ్యుందాయ్, మహీంద్రా, ఎంజీ, నిస్సాన్, టయోటా లాంటి కంపెనీలు ఆసక్తిగలవారికి అందిస్తున్నాయి(Car Subscription Companies In India).
Benefits Of Car Subscription :
సబస్క్రిప్షన్తో ఇతర లాభాలు..!
- డౌన్‌పేమెంట్ చెల్లించాల్సిన అవసరం ఉండదు.
- ప్రతి నెలా మీరు తీసుకున్న కారు కంపెనీకే నేరుగా చెల్లింపులు చేస్తే సరిపోతుంది.
- మీరు మెచ్చిన కారును మీకు నచ్చినంత కాలానికి సబ్‌స్క్రిప్షన్ తీసుకోవచ్చు.
- కారు సర్వీసింగ్, బీమా తీసుకోవడం లాంటివన్నీ కంపెనీయే చూసుకుంటుంది.
- ఒకవేళ మరికొంత కాలంపాటు అదే కారును మీరు వినియోగించుకోవాలనుకుంటే సబ్‌స్క్రిప్షన్ గడువును పొడిగించుకునే అవకాశం ఉంటుంది.
- మార్కెట్‌లోకి ఏదైనా కొత్త మోడల్ వచ్చినప్పుడు సులువుగా దానిని అప్‌గ్రేడ్ చేసుకోవచ్చు లేదా మార్చుకోవచ్చు.
వీటిని కూడా పరిశీలించండి..!
- కొత్త కారు కొనుగోలు, దానికి తీసుకునే రుణానికి చెల్లించే అసలు, వడ్డీ మొత్తం కంటే కొన్నిసార్లు సబ్‌స్క్రిప్షన్ మోడల్లో తీసుకునే కారుకే ఎక్కువ వెచ్చించాల్సి రావొచ్చు. అలాంటి సమయాల్లో బేరీజు పద్ధతిని పాటించండి. దేనికి ఎంత ఖర్చు అవుతుందో అని లెక్కలు చూసుకోండి.
- సబ్‌స్క్రిప్షన్ మోడల్‌ను ఎంచుకున్నప్పుడు మీరు ఎంపిక చేసుకున్న దాని కంటే ఎక్కువ కిలోమీటర్లు తిరగాల్సి రావచ్చు. అప్పుడు రూల్స్ ప్రకారం అదనంగా చెల్లించాల్సి వస్తుంది.
- అలాగే మీరు తిరిగే కారును మీకు నచ్చిన విధంగా మాడిఫై చేసుకునేందుకు వీలుంటుంది.
అదే మన కారైతే..
కొత్త కారు అయితే గనుక దానిపై సర్వ హక్కులూ మీకే ఉంటాయి. మీకు ఇష్టం వచ్చిన విధంగా దానిని తీర్చిదిద్దుకోవచ్చు. కిలోమీటర్ల లిమిట్ దాటిపోయిందన్న హైరానా అసలే అవసరం లేదు. అయితే అదే సమయంలో కొత్త కారు కొనడం కూడా ఖర్చుతో కూడుకున్న వ్యవహారం అని మాత్రం మర్చిపోవద్దు. పైపెచ్చు దాని మెయింటెనెన్స్ ఖర్చులన్నీ మీరే భరించాలి. ఒకవేళ కొన్ని సంవత్సరాల తర్వాత మీరు నడుపుతున్న కారుపై మీకు మోజు తీరి దాన్ని అమ్ముదామనుకుంటే మాత్రం తరుగుదల కారణంగా దాని విలువ భారీగా పడిపోతుంది. ఇన్సూరెన్స్ మొదలు, ట్యాక్సులు లాంటివన్నీ వాహనదారులే చూసుకోవాలి.
చివరిగా కొత్త కారు కొనాలా? సబ్‌స్క్రిప్షన్ మోడల్‌కు వెళ్లాలా? అనేది వ్యక్తుల ఆధారంగా మారుతూ ఉంటుంది. తరచూ కార్లు మార్చే వారికి సబ్‌స్క్రిప్షన్ మోడల్ ఓ మెంచి ఎంపిక. అదే దీర్ఘకాలం పాటు వినియోగించే వారైతే సొంతంగా కొనుగోలు చేయడం బెటర్ ఆప్షన్. ఏదైనా సరే ఈ రెండింట్లో మీకు ఏది అనువుగా ఉంటుందో ఆలోచించి నిర్ణయం తీసుకోవడం ఉత్తమం.