Bonus To Caratlane Startup Employees : టైటాన్ సంస్థతో కుదుర్చుకున్న ఒప్పందం ప్రకారం ప్రముఖ జ్యువెలరీ స్టార్టప్ సంస్థ క్యారెట్‌లేన్ ఉద్యోగులు భారీ మొత్తంలో బోనస్‌ను అందుకోనున్నారు. కంపెనీలోని ఉద్యోగుల్లో మొత్తం 75 మంది ఒక్కొక్కరు రూ.340-380 కోట్ల చొప్పున టైటాన్ నుంచి బోనస్ కింద ఈ భారీ మొత్తాన్ని దక్కించుకోనున్నారు. ESOP (ఎంప్లాయ్ స్టాక్ ఓనర్షిప్ ప్లాన్) పేఅవుట్ పద్ధతి కింద క్యారెట్‌లేన్ ఉద్యోగులకు ఈ జాక్‌పాట్ దక్కింది. కాగా, క్యారెట్లేన్లోని వాటాను కొనుగోలు చేసేందుకు టైటాన్ ఇప్పటికే ఒప్పందం ( Titan Caratlane Deals ) కుదుర్చుకుంది. ఈ డీల్ రెగ్యులేటరీ అనుమతుల మేరకు 2023 అక్టోబర్ 31తో పూర్తికానుంది.
వాటిని కూడా త్వరలోనే..
Jackpot To Caratlane Jewellery : క్యారెట్‌లేన్ సంస్థలో సుమారు 1500 మంది ఉద్యోగులు ఉన్నారు. ఇందులో అధిక శాతం రిటైల్, మ్యానుఫ్యాక్చరింగ్ రంగాల్లో పనిచేస్తున్నవారే. అయితే వీరికి సంస్థలో ఎటువంటి వాటాలు లేవు. అయినప్పటికీ వీరిలోని కొంతమందికి భారీ స్థాయిలో బోనస్, హైక్‌లను ప్రకటించింది టైటాన్. ఈ 1500 మందిలో దాదాపు 400 మంది ఉద్యోగులు ఈ స్టార్టప్‌లోని కార్పొరేట్ బృందంలో భాగస్వాములుగా కొనసాగుతున్నారు. వీరిలోని 75 మందికి తాజాగా రూ.340-రూ.380 కోట్ల మేర బోనస్‌ను ప్రకటించారు. దీంతో వీరంతా కంపెనీలో 1.72 శాతం వాటాను సొంతం చేసుకున్నట్లయింది. అయితే వీటిని కూడా టైటాన్ త్వరలోనే కొనుగోలు చేయనుంది. అయితే వీటిని ఈఎస్ఓపీ( ESOP Benefits For Caratlane) పద్ధతి ద్వారానే సొంతం చేసుకోగలదు.
వంద శాతం లక్ష్యంగా..
Titan Acquires Caratlane : టైటాన్‌కు క్యారెట్‌లేన్‌లో ప్రస్తుతం 71.09 శాతం వాటా ఉంది. మిగిలిన 27.18 శాతం వాటాను కూడా రూ.4,621 కోట్లకు కొనుగోలు చేసేందుకు సిద్ధమైంది. టైటాన్.. తాజాగా క్యారెట్‌లేన్ ఉద్యోగులకు లభించిన బోనస్ స్టాక్లను కూడా త్వరలోనే సొంతం చేసుకోనుంది. మొత్తం మీద స్టార్టప్‌లో వంద శాతం వాటాను సొంతం చేసుకోవాలని టైటాన్ సంస్థ భావిస్తోంది. కాగా, షాచెట్టి ఫ్యామిలీ నుంచి 27.18 శాతం వాటా కొనుగోలు చేసిన నేపథ్యంలో ఈ ఆభరణాల స్టార్టప్‌లో ప్రస్తుతం 98.28 శాతం మేర యాజమాన్య హక్కులను కలిగి ఉంది టైటాన్.
"స్టార్టప్ కార్పొరేట్ టీమ్‌లో భాగస్వాములుగా ఉన్న ఉద్యోగులకు ఈఎస్ఓపీలు ఇవ్వడం అనేది సర్వసాధారణమైన విషయం. ఈఎస్ఓపి కాంపోనెంట్ (కంపెనీలో 1.72 శాతం) కూడా అక్టోబర్ చివరి నాటికి టైటాన్ కొనుగోలు చేయనుంది. అప్పటికీ ప్రక్రియ పూర్తవ్వకుండా ఏమైనా వాటాలు మిగిలి ఉంటే టైటాన్ వెస్టింగ్ జరిగినప్పుడు వాటిని కూడా సొంతం చేసుకుంటుంది."
- మిథున్ సచెట్టి, క్యారెట్‌లేన్ సీఈఓ, సహ వ్యవస్థాపకులు
ఈఎస్ఓపీ అంటే ఏమిటి..?
What Is ESOP In Telugu : ఈఎస్ఓపీ అంటే 'ఎంప్లాయ్ స్టాక్ ఓనర్షిప్ ప్లాన్'. ఈ ప్లాన్ కింద కంపెనీ తమ ఉద్యోగులకు తక్కువ ధరలో లేదా ఉచితంగా సంస్థ వాటాలను బోనస్ కింద ప్రకటిస్తుంది. అయితే వీటిని పొందిన ఉద్యోగులు నిబంధనల ప్రకారం నిర్ణీత గడువులోగా నిర్దిష్టమైన ధరకు విక్రయించుకోవచ్చు. ఉదాహరణకు మీ పనితీరు నచ్చి మీరు పని చేసే కంపెనీ మీకు 1000 షేర్లను బోనస్‌గా ఇచ్చింది అనుకుందాం. మూడు సంవత్సరాల తర్వాత మీరు వాటిని ఒక్కోటి రూ.100 చొప్పున లేదా మార్కెట్ పరిస్థితుల ఆధారంగా అమ్ముకోవచ్చు. దీనితో ఉద్యోగులు మంచి లాభాలను పొందే అవకాశం ఉంటుంది. అయితే ఒక నివేదిక ప్రకారం.. 2021 ప్రారంభం నుంచి ఇప్పటి వరకు ESOPల ద్వారా స్టార్టప్‌లో పని చేసే ఉద్యోగులు ఏకంగా రూ.146 కోట్ల (1.46 బిలియన్ డాలర్ల) సంపదను సమకూర్చుకున్నారు.