Benefits Of Tokenization In Digital Payments : టెక్నాలజీ అందుబాటులోకి వచ్చిన తరువాత ఆన్లైన్/ డిజిటల్ పేమెంట్స్ సర్వసాధారణం అయిపోయాయి. ఇదే సమయంలో ఆన్లైన్ మోసాలు కూడా బాగా పెరిగిపోతున్నాయి. ఈ సమస్యను నివారించేందుకే ఆర్‌బీఐ త్వరలో.. డిజిటల్ పేమెంట్స్ టోకెనైజేషన్ విధానాన్ని తీసుకువచ్చేందుకు ప్రయత్నిస్తోంది. దీని వల్ల డిజిటల్ పేమెంట్స్ మరింత సురక్షితం కానున్నాయి.
త్వరలోనే!
త్వరలోనే మీ బ్యాంకు వెబ్‌సైట్ లేదా యాప్ ద్వారా కార్డు టోకెన్లను జనరేట్ చేసుకునేందుకు అనుమతులు రానున్నాయి. దీని ద్వారా ఆన్లైన్ కొనుగోళ్లు చేసేటప్పుడు.. జరిగే ఆర్థిక మోసాలను అరికట్టవచ్చు అని ఆర్‌బీఐ భావిస్తోంది.
టోకెనైజేషన్ అంటే ఏమిటి?
Card Tokenization Explained : సాధారణంగా మన దగ్గర డెబిట్ లేదా క్రెడిట్ కార్డు ఉంటుంది. దీనిలో మనకు సంబంధించిన వ్యక్తిగత వివరాలు, బ్యాంకింగ్ వివరాలు ఉంటాయి. ఇవి ఇతరులకు చిక్కితే ప్రమాదం. అందుకే మన దగ్గర ఉండే వాస్తవ కార్డులకు ప్రత్యామ్నాయంగా.. ఒక ప్రత్యేకమైన కోడ్‌ను రూపొందిస్తారు. దీనినే టోకెన్ అని అంటారు. ఇది ఒక్కో కార్డుకు, టోకెన్ రిక్వెస్టర్‌కు, వాడే డివైజ్‌కు అనుగుణంగా ప్రత్యేకంగా జనరేట్ అవుతూ ఉంటుంది. ఈ టోకెన్.. మర్చంట్ వెబ్‌సైట్ నుంచి కార్డు జారీదారుకు వెళుతుంది. అంటే ఆన్లైన్ చెల్లింపు ప్రక్రియలో.. కార్డుకు సంబంధించిన వాస్తవ వివరాలను మర్చంట్‌తో పంచుకోవాల్సిన అవసరం మనకు ఉండదు.
2021 నుంచే అమలవుతోంది!
ఆర్‌బీఐ 2021 సెప్టెంబర్‌లో కార్డ్ టోకెనైజేషన్ విధానాన్ని తీసుకువచ్చింది. ఇది 2022 అక్టోబరు 1 నుంచి అమలవుతోంది. ప్రస్తుతానికి ఈ కార్డ్ ఆన్ ఫైల్(సీఓఎఫ్) కేవలం మర్చంట్ అప్లికేషన్ లేదా వెబ్‌సైట్ ద్వారానే జరుగుతోంది. ఇపుడు బ్యాంకు స్థాయిలో నేరుగా ఈ సీఓఎఫ్ టోకెన్ జనరేషన్ సదుపాయాలను కల్పించాలని ఆర్‌బీఐ ప్రతిపాదించింది.
ఉపయోగం ఏమిటి?
Card Tokenization Benefits : ఆర్‌బీఐ చేసిన ఈ టోకెనైజేషన్ ప్రతిపాదన అమల్లోకి వస్తే.. కార్డుదార్లు తమ అవసరాలకు అనుగుణంగా టోకెన్లను జనరేట్ చేసుకుని.. తమ ఇ-కామర్స్ యాప్‌లతో అనుసంధానం చేసుకోవడానికి వీలుంటుంది. ఇలా బ్యాంకు స్థాయిలో టోకెన్లు జారీ చేయడం వల్ల కార్డుదార్లకు మాత్రమే కాక, అమ్మకందార్లకు కూడా మేలు కలుగుతుందని ఆర్థికవేత్తలు భావిస్తున్నారు.
డేటా - సేఫ్!
ముఖ్యంగా ఈ టోకెనైజేషన్ వల్ల కార్డు-డేటా సంబంధిత మోసాలు తగ్గుతాయని నిపుణులు భావిస్తున్నారు. డిజిటల్ లావాదేవీల్లో ఉండే అభద్రతా వాతావరణాన్ని ఇది తగ్గిస్తుందని వారు చెబుతున్నారు. భారత్‌లో ఒక బలమైన, భద్రమైన చెల్లింపుల వాతావరణాన్ని తీసుకురావడానికి ఆర్‌బీఐ కట్టుబడి ఉందనడానికి ఇది ఒక ఉదాహరణ అని వారు అభిప్రాయపడుతున్నారు.
భారీ స్థాయిలో
భారతదేశంలో టోకెనైజేషన్ ద్వారా జరుగుతున్న లావాదేవీల సంఖ్య తక్కువేమీ కాదు. ఒక లెక్క ప్రకారం, ఇప్పటిదాకా దాదాపు 56 కోట్ల టోకెన్లు జనరేట్ అయ్యాయి. ఈ లావాదేవీల విలువ రూ.5 లక్షల కోట్లకు పైగానే ఉంటుంది. ఇంత పెద్ద స్థాయిలో జరుగుతున్న లావాదేవీలకు మరింత భద్రతను అందించడం కోసమే ఆర్‌బీఐ ఈ ప్రతిపాదనతో ముందుకొచ్చిందని విశ్లేషకులు చెబుతన్నారు.
ఇష్టం వచ్చినట్లు వాడుకోవచ్చు!
Card Tokenization Service : వినియోగదార్ల వద్ద ఉండే మొబైల్ ఫోన్లు, ట్యాబ్లెట్లు, ల్యాప్‌టాప్‌లు, డెస్క్‌టాప్‌ల్లో.. డిజిటల్ పేమెంట్స్ కోసం టోకెన్లను సృష్టించుకోవచ్చు. అలాగే స్మార్ట్‌వాచ్, స్మార్ట్బ్యాండులు లాంటి వేరియబుల్స్‌తో సహా, ఇంటర్నెట్ ఆఫ్ థింగ్స్(ఐఓటీ) డివైజులు అన్నింటిలోనూ టోకెన్స్ జనరేట్ చేసుకోవచ్చు. అలాగే కాంటాక్ట్‌లెస్ కార్డు లావాదేవీలు, క్యూఆర్ కోడ్ ద్వారా చేసే చెల్లింపులు, యాప్‌ల్లోనూ.. టోకెనైజేషన్‌కు వీలుంటుంది.