August 2023 Bank Holidays : ప్రస్తుతం చాలా మంది ఆన్లైన్లోనే బ్యాంకింగ్ కార్యకలాపాలను పూర్తి చేసుకుంటున్నారు. ఏ చిన్న పని కోసమైనా ఆయా బ్యాంకుల యాప్‌లు, వెబ్సైట్లలోకి వెళ్లి ఒక్క క్లిక్‌తో క్షణాల్లో లావాదేవీలను చక్కబెట్టేస్తున్నారు. అయితే దాదాపు సింహభాగం పనులన్నీ ఆన్లైన్లో చకచకా జరిగే వ్యవస్థ ఉన్నా.. కొన్ని ముఖ్యమైన పనులకు మాత్రం బ్యాంకు శాఖలను సంప్రదించాల్సిందే. ఈ నేపథ్యంలో కొందరు సామాన్యులు బ్యాంకులకు సెలవు ఉన్న రోజున తెలియక బ్యాంకులకు వెళ్తుంటారు. తీరా అక్కడకు వెళ్లేసరికి బ్యాంకు హాలిడే బోర్డులు దర్శనమిస్తాయి. అలా చాలా మంది తమ పనులను మానుకొని మరీ వెళ్లి వెనుదిరుగుతుంటారు.
August Bank Holidays : అయితే ఇలా జరగకుండా ఉండాలంటే ప్రతిఒక్కరూ ఏ నెలలో, ఏ రోజున, ఏ ప్రాంతంలో బ్యాంకులకు సెలవులు ప్రకటించారో ముందే తెలుసుకుంటే మంచిది. దీనితో మన సమయం కూడా వృథా కాకుండా ఉంటుంది. ఇదిలా ఉంటే రేపటితో జులై నెల ముగిసి, ఆగస్టు నెల ప్రారంభం కానుంది. కాగా, ఆగస్టులో ముఖ్యమైన పర్వదినాలైన స్వాతంత్ర్య దినోత్సవం, రాఖీ పౌర్ణమి సహా వివిధ రాష్ట్రాలకు సంబంధించిన పండగలకు సెలవులను ప్రకటించింది రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా. మరి ఆర్బీఐ విడుదల చేసిన హాలిడేస్ లిస్ట్‌పై మీరూ ఓ లుక్కేసేయండి.
ఆగస్టులో బ్యాంకు సెలవు దినాల జాబితా :
- 2023 ఆగస్టు 6 - ఆదివారం
- 2023 ఆగస్టు 12 - రెండో శనివారం
- 2023 ఆగస్టు 13 - ఆదివారం
- 2023 ఆగస్టు 15 (మంగళవారం) - స్వాతంత్ర్య దినోత్సవం (జాతీయ సెలవు దినం)
- 2023 ఆగస్టు 20 - ఆదివారం
- 2023 ఆగస్టు 26 - నాలుగో శనివారం
- 2023 ఆగస్టు 27 - ఆదివారం
August Festivals 2023 : అయితే ఇవన్నీ తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ సహా దేశవ్యాప్తంగా ఉన్న అన్నీ బ్యాంకులకు వర్తించే సాధారణ సెలవులు. ఇవి కాకుండా ఆయా రాష్ట్రాల్లో అధికారికంగా జరుపుకునే పండగలను అనుసరించి ఆర్బీఐ సెలవు దినాలను ప్రకటించింది. అవి..
- 2023 ఆగస్టు 8 - టెండాంగ్ ల్హో రమ్ ఫాట్ పండగ (సిక్కిం - గ్యాంగ్‌టక్)
- 2023 ఆగస్టు 16 - పార్శీ కొత్త సంవత్సరం (మహారాష్ట్ర - బేలాపుర్, ముంబయి, నాగ్‌పుర్)
- 2023 ఆగస్టు 18 - శ్రీమంత శంకరదేవ తిథి (అసోం - గువాహటి)
- 2023 ఆగస్టు 28 - మొదటి ఓనం (కేరళ - కొచ్చి, తిరువనంతపురం)
- 2023 ఆగస్టు 29 - తిరువోనం (కేరళ - కొచ్చి, తిరువనంతపురం)
- 2023 ఆగస్టు 30 (బుధవారం) - రాఖీ పూర్ణిమ (రాజస్థాన్ -జైపుర్, హిమాచల్ ప్రదేశ్ - షిమ్లా)
- 2023 ఆగస్టు 31 (గురువారం) - రాఖీ పూర్ణిమ, శ్రీ నారాయణ్ గురు జయంతి, పాంగ్ ల్హాబ్సోల్ (కొచ్చి, తిరువనంతపురం, లఖ్‌నవూ, కాన్పూర్, గ్యాంగ్‌టక్, దెహ్రాదూన్)
ఇదీ బ్యాంకు సెలవులకు సంబంధించిన పూర్తి వివరాలు. మరి ఏవైనా ముఖ్యమైన పనులు ఉంటే గనుక ఈ లిస్ట్ ఆధారంగా ప్లాన్ చేసుకోండి.