Amrith Kalash Scheme : మనదేశంలో అతి పెద్ద ప్రభుత్వ రంగ బ్యాంకు అయిన స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా, తమ కస్టమర్లకు శుభవార్త చెప్పింది. అమృత్ కలశ్ పథకం గడువును మరోసారి పెంచుతూ కీలక నిర్ణయం తీసుకుంది. గతంలో ఈ పథకం గడువును ఆగస్టు 15 నుంచి డిసెంబర్ 31 వరకు పొడిగించింది. అయితే తాజాగా ఈ గడువును 2024 మార్చి 31 వరకు పెంచుతూ సర్క్యులర్ జారీ చేసింది.
స్పెషల్ ఫిక్స్‌డ్ డిపాజిట్ స్కీమ్
Amrith Kalash Scheme Interest Rates : ఎస్బీఐ 2023 ఫిబ్రవరి 15న అమృత్ కలశ్ పథకాన్ని ప్రవేశపెట్టింది. ఇది ఒక ప్రత్యేకమైన ఫిక్స్‌డ్ డిపాజిట్ స్కీమ్. దీని కాలపరిమితి 400 రోజులు మాత్రమే. ఎస్బీఐ ఈ స్కీమ్ ద్వారా ఆకర్షణీయమైన వడ్డీ రేట్లను అందిస్తోంది. సాధారణ పౌరులకు 7.10 శాతం, సీనియర్ సిటిజన్లకు ఏకంగా 7.60 శాతం వరకు వడ్డీ అందిస్తుంది. అంటే సీనియర్ సిటిజన్లు ఈ అమృత్ కలశ్ పథకం ద్వారా అధిక లబ్ధి పొందుతారు.
2023 ఫిబ్రవరిలో ప్రారంభమైన ఈ పథకాన్ని మార్చి 31 వరకే అందుబాటులో ఉంచాలని నిర్ణయించుకున్నారు. కానీ వినియోగదారుల నుంచి మంచి స్పందన రావడంతో రెండు సార్లు ఈ పథకం గడువును పెంచారు. ఈ పథకంలో గరిష్ఠంగా రూ.2 కోట్ల వరకు డిపాజిట్ చేయవచ్చు. ప్రవాస భారతీయులు కూడా ఈ స్కీమ్‌లో చేరడానికి అర్హులే.
ఈ పథకంలో చేరినవారు వడ్డీ చెల్లింపునకు తమకు నచ్చిన ప్లాన్ ఎంచుకునే సౌకర్యం ఉంది. నెల, ఆరు నెలల, లేదా సెమీ యాన్యువల్ ఆప్షన్లు ఉన్నాయి. వీటిలో మీరు ఎంచుకున్న విధానాన్ని అనుసరించి, నగదు మీ ఖాతాలో జమ అవుతుంది. అయితే, ఇందులో ఇన్కమ్ టాక్స్ చట్టం ప్రకారం, టీడీఎస్ కట్ అవుతుంది. ఇందులో రుణం సదుపాయంతోపాటు, ముందే డబ్బులు విత్‌డ్రా చేసుకునే అవకాశం కూడా ఉంది.
ఈ పథకంలో ఎలా చేరాలి?
ఎస్బీఐ అమృత్ కలశ్ ఫిక్స్‌డ్ డిపాజిట్ పథకం పొందడానికి, మీ దగ్గర్లోని ఎస్బీఐ బ్రాంచ్‌కు నేరుగా వెళ్లి సంప్రదించవచ్చు. లేదా ఆన్లైన్లోనే నేరుగా అప్లై చేసుకోవచ్చు. ఇవి రెండూ కాకుండా, ఎస్బీఐ యోనో అప్లికేషన్ ద్వారా కూడా స్కీమ్‌లో చేరవచ్చు.
ఎఫ్‌డీల వడ్డీ రేట్లు పెంపు
SBI FD Interest Rates : ఎస్బీఐ ఇతర ఫిక్స్‌డ్ డిపాజిట్ పథకాల వడ్డీ రేట్లను కూడా పెంచింది. రూ.2 కోట్లలోపు డిపాజిట్లపై గరిష్ఠంగా 50 బేసిస్ పాయింట్లు మేర వడ్డీ రేటు పెంచింది. 7 రోజుల నుంచి 45 రోజుల కాల వ్యవధి గల ఎఫ్‌డీలపై 3.5 శాతం వడ్డీ చెల్లించనునున్నారు. గతంలో ఇది 3 శాతంగా ఉండేది. 46 రోజుల నుంచి 179 రోజుల కాలవ్యవధి గల డిపాజిట్లపై వడ్డీని 25 బేసిస్ పాయింట్లు పెంచింది. దీనితో ఈ ఎఫ్డీ వడ్డీ రేటు 4.75 శాతానికి చేరింది. 180 నుంచి 210 రోజుల డిపాజిట్లపై వడ్డీని 5.25 శాతం నుంచి 5.75 శాతానికి; 211 రోజుల నుంచి ఏడాదిలోపు డిపాజిట్లపై 5.75 శాతం నుంచి 6 శాతానికి వడ్డీ రేట్లను పెంచింది. మూడేళ్ల నుంచి ఐదేళ్ల కాలవ్యవధి కలిగిన ఎఫ్‌డీలపై 6.50 శాతం నుంచి 6.75 శాతానికి వడ్డీ రేట్లను పెంచింది. అంతేకాదు, సీనియర్ సిటిజన్లకు 50 బేసిస్ పాయింట్లు మేర అదనంగా వడ్డీ చెల్లిస్తారు. ఎస్బీఐ ఇతర స్కీమ్‌ల వడ్డీ రేట్లను మాత్రం యథాతథంగా కొనసాగించింది. డిసెంబర్ 27 నుంచి ఈ సవరించిన వడ్డీ రేట్లు అమల్లోకి రానున్నాయి.
సెకండ్ హ్యాండ్ కారు కొనాలా? ఈ విషయాలు కచ్చితంగా తెలుసుకోండి!
ఆ యూనివర్సిటీ సూపర్ రిచ్ - 120+ దేశాల ఎకానమీ కంటే ఎక్కువ ఆదాయం!