Airtel 5G Plus : ప్రముఖ టెలికాం సంస్థ ఎయిర్‌టెల్ దేశంలోని 8 నగరాల్లో 5జీ ప్లస్ సేవలను ప్రారంభించింది. ఈ సేవలను పొందేందుకు సిమ్ కార్డు మార్చాల్సిన అవసరం లేదని, 5జీ ఫోన్ ఉంటే సరిపోతుందని ఎయిర్‌టెల్ వెల్లడించింది. హైదరాబాద్, దిల్లీ, ముంబయి, చెన్నై, బెంగళూరు, సిలిగుడి, నాగ్‌పుర్, వారణాసి నగరాల్లోని వినియోగదారులు 5జీ+ సేవలను ఆనందించొచ్చని ఎయిర్‌టెల్ తెలిపింది. దశలవారీగా ఈ సేవలు అందుబాటులోకి వస్తాయని పేర్కొంది.
ప్రస్తుతం ఉన్న వేగం కంటే 20 నుంచి 30 రెట్ల అధిక వేగంతో 5జీ ప్లస్ సేవలను పొందొచ్చని ఎయిర్‌టెల్ తెలిపింది. 5జీ సేవలు విస్తృతంగా అందుబాటులోకి వచ్చేంత వరకు 4జీ ప్లాన్లతోనే హైస్పీడ్ డేటా సేవలు పొందొచ్చని పేర్కొంది. అయితే, 5జీ ఫోన్లన్నీ ఎయిర్‌టెల్ 5జీకి సపోర్ట్ చేయకపోవచ్చని, దీనికి సంబంధించి మొబైల్ తయారుదారులు ఓటీఏ అప్‌డేట్ ఇవ్వాల్సి ఉంటుందని ఎయిర్‌టెల్ తెలిపింది.
మరోవైపు దసరా పండగను పురస్కరించుకుని అక్టోబర్ 5 నుంచి దిల్లీ, ముంబయి, కోల్‌కతా, వారణాసి నగరాల్లో ట్రయల్ బేసిస్‌పై 5జీ సేవలను ప్రారంభిస్తున్నట్లు జియో ప్రకటించింది. జియో ట్రూ 5జీ వెల్‌కం ఆఫర్ కింద ఈ పైన పేర్కొన్న నగరాలలో జియో యూజర్లకు బీటా ట్రయల్ సేవలు అందుబాటులోకి తీసుకురానున్నట్టు తెలిపింది. ఈ ఆఫర్ కింద వినియోగదారులు 5జీ అన్‌లిమిటెడ్ డేటాను 1 జీబీపీఎస్ వేగంతో పొందొచ్చని పేర్కొంది.
అధిక వేగంతో జియో 5జీ నెట్‌స్పీడ్..
జియో 5జీ బీటా ట్రయల్స్ దిల్లీలో ప్రారంభమయ్యాయి. నెట్ స్పీడ్ ఓ వినియోగదారుడి మొబైల్లో 1.5 జీబీపీఎస్‌గా నమోదైంది.
ఇవీ చదవండి: ఏడాదిలో ఆర్థిక మాంద్యం.. మెజారిటీ సీఈఓల అంచనా!
ట్విట్టర్ కొనుగోలుకు మస్క్ ఓకే.. డీల్ పునరుద్ధరణ కోసం సంస్థకు లేఖ