5G Spectrum Auction: 4జీ తో పోలిస్తే 10 రెట్లు వేగవంతంగా డేటా సేవలు అందించే వీలున్న 5జీ స్పెక్ట్రమ్ వేలం నేడు (ఈనెల 26) ప్రారంభం కానుంది. టెలికాం సంస్థలైన రిలయన్స్ జియో, భారతీ ఎయిర్‌టెల్, వొడాఫోన్ ఐడియాతో పాటు అదానీ గ్రూపునకు చెందిన అదానీ ఎంటర్‌ప్రైజెస్ కూడా పాల్గోనుండటంతో ఈ వేలంపై ఆసక్తి నెలకొంది. తమ సొంత అవసరాల (క్యాప్టివ్) నెట్‌వర్క్ కోసం స్పెక్ట్రమ్‌ను వినియోగించుకునేందుకు టెక్ సంస్థలకు అనుమతినివ్వడం ఈ సారి వేలంలో ప్రత్యేకతగా చెప్పొచ్చు. రోజూ ఉదయం 10 గంటల నుంచి సాయంత్రం 6 గంటలకు వరకు సంస్థలు బిడ్‌లు దాఖలు చేయొచ్చు. టెలికాం సంస్థల వ్యూహాలకనుగుణంగా స్పెక్ట్రమ్ కోసం వేసే బిడ్లను అనుసరించి, వేలం కొనసాగుతుంది. దాదాపు రెండురోజుల్లో ఈ ప్రక్రియ పూర్తవుతుందని భావిస్తున్నారు. స్పెక్ట్రమ్ కోసం నిర్ణయించిన కనీస ధర సమీపంలోనే, బిడ్లు ఖరారయ్యే అవకాశం ఉందని పరిశ్రమ వర్గాలు భావిస్తున్నాయి.
వేలం ముఖ్యాంశాలివే..
- 9 బ్యాండ్లలో మొత్తంగా 72 గిగాహెర్ట్జ్‌ల స్పెక్ట్రమ్‌ను విక్రయించనున్నారు. కనీస విలువ దాదాపు రూ.4.3 లక్షల కోట్లు.
- వేలంలో దక్కించుకున్న స్పెక్ట్రమ్‌ను 20 ఏళ్ల పాటు ఆయా సంస్థలు వినియోగించుకోవచ్చు. 10 ఏళ్ల తర్వాతే స్పెక్ట్రమ్‌ను సరెండర్ చేసుకునే వీలుంటుంది.
- స్పెక్ట్రమ్ కోసం తప్పనిసరిగా ముందస్తు చెల్లింపులు చేయనవసరం లేదు. 20 వార్షిక సమ వాయిదాల్లో కట్టుకునే వీలును ప్రభుత్వం కల్పించింది. ఏటా ప్రారంభంలో చెల్లించాల్సి ఉంటుంది.
- స్పెక్ట్రమ్ వినియోగం రుసుంను (ఎస్‌యూఎస్) రద్దు చేశారు.
ఏయే బ్యాండ్లలో..
- తక్కువ శ్రేణి బ్యాండ్లు- 600, 700, 800, 900, 1800, 2100, 2300 మెగాహెర్ట్జ్
- మధ్యశ్రేణి ఫ్రీక్వెన్సీ బ్యాండ్- 3.3 మెగాహెర్ట్జ్
- అధిక ఫ్రీక్వెన్సీ బ్యాండ్- 26 గిగాహెర్ట్జ్
- వీటిల్లో 600:, 700 మెగాహెర్ట్జ్, 3.3 గిగాహెర్ట్జ్, 26 గిగాహెర్ట్జ్ బాండ్లను వేలం వేయనుండటం ఇదే మొదటిసారి.
ఏయే సంస్థ.. ఎటు వైపు
- రిలయన్స్ జియో ఇన్ఫోకామ్ 800 మెగాహెర్ట్జ్ బ్యాండ్‌పై ఎక్కువగా దృష్టి సారించే అవకాశం ఉంది. ఇప్పటికే ఈ బ్యాండ్‌లో అత్యధిక స్పెక్ట్రమ్‌ను కలిగి ఉండటమే ఇందుకు కారణం. టెలికాం విపణిలో తన స్థానాన్ని మరింత బలోపేతం చేసుకునేందుకు, మార్కెట్ వాటా పెంచుకునేందుకు జియోకు ఇది ముఖ్యమే.
- భారత్ ఎయిర్‌టెల్, వొడాఫోన్ ఐడియాలు 900 మెగాహెర్ట్జ్ బ్యాండ్‌లో అధిక స్పెక్ట్రమ్‌ను కొనుగోలు చేసే అవకాశాలు కన్పిస్తున్నాయి.
- 1800 మెగాహెర్ట్జ్ బ్యాండ్ స్పెక్ట్రమ్ కోసం 3 సంస్థలూ బిడ్‌లు దాఖలు వేయొచ్చు.
- తక్కువ ఫ్రీక్వెన్సీతో, అధిక ప్రాంతం-భవనాల్లోపల కవరేజీకి అనువైన 600 - 700 మెగాహెర్ట్జ్ బ్యాండ్ స్పెక్ట్రమ్‌కు టెలికాం సంస్థలు బిడ్‌లు అంతగా దాఖలు చేయకపోవచ్చు. వీటి ధరలు ఎక్కువగా ఉండటమే కారణం.
- 5జీ సేవలకు ప్రధానమైన 3.3 గిగాహెర్ట్జ్ స్పెక్ట్రమ్‌ను సి-బ్యాండ్‌గాను, 26 గిగాహెర్ట్జ్ స్పెక్ట్రమ్‌ను ఎంఎం-వేవ్‌గా వ్యవహరిస్తారు. చౌకగా లభించే ఎంఎం వేవ్‌ను టెల్కోలు సాధ్యమైనంత మేర ఎక్కువగా కొనుగోలు చేయొచ్చు. అధిక ధర కారణంగా సి- బ్యాండ్ విషయంలో కంపెనీలు ఎలాంటి వ్యూహం అనుసరిస్తాయో వేచిచూడాల్సి ఉంది. ఈ స్పెక్ట్రమ్‌ను ప్రైవేట్ నెట్‌వర్క్‌ల కోసం టెక్నాలజీ కంపెనీలకు కేటాయించేందుకు ప్రభుత్వం అనుమతినివ్వడమూ మరో కారణం.
స్పెక్ట్రమ్ అంటే..
టెలికమ్యూనికేషన్స్ సహా పలు రకాల సేవలకు అవసరమైన సమాచారాన్ని వైరు లేకుండా తీసుకువెళ్లే విద్యుదయస్కాంత రేడియో తరంగాలను స్పెక్ట్రమ్‌గా వ్యవహరిస్తారు. ఈ తరంగాలను ప్రభుత్వం ఆయా రంగాలు లేదా కంపెనీలకు వినియోగం ఆధారంగా కేటాయిస్తుంది. వినియోగాన్ని బట్టి తక్కువ ఫ్రీక్వెన్సీ నుంచి అధిక ఫ్రీక్వెన్సీ వరకు బ్యాండ్లలో స్పెక్ట్రమ్‌ను విభజించారు. అధిక ఫ్రీక్వెన్సీ తరంగాలు అధిక డేటాను సరఫరా చేయడమే కాకుండా అధిక వేగాన్ని కలిగి ఉంటాయి. తక్కువ ఫ్రీక్వెన్సీ తరంగాల కవరేజీ విస్తృతి ఎక్కువగా ఉంటుంది కానీ, తక్కువ వేగాన్ని కలిగి ఉంటాయి.
- భారత్‌లో 2 జీ సేవలు- 900, 1800 మెగాహెర్ట్జ్ బ్యాండ్‌లను ఉపయోగించుకుంటున్నాయి.
- 3జీ- 900, 2100 మెగాహెర్ట్జ్
- 4జీ- 850, 1800, 2300, 2500 మెగాహెర్ట్జ్ స్పెక్ట్రమ్‌ను వినియోగించుకుంటున్నారు.
తాజా వేలంలో రూ.1- 1.1 లక్షల కోట్ల విలువైన స్పెక్ట్రమ్‌ను టెలికాం సంస్థలు కొనుగోలు చేసే అవకాశం ఉందని రేటింగ్ సంస్థ ఇక్రా అంచనా వేసింది. స్పెక్ట్రమ్ విక్రయానంతరం ఆగస్టులో 5జీ సేవలకు దేశంలో శ్రీకారం చుట్టే అవకాశం ఉంది.
ఇదీ చదవండి: త్వరలోనే భారత్‌లో '5G'.. సెకన్లలోనే హెచ్డీ సినిమా డౌన్లోడ్!