Stock Market: ఉక్రెయిన్, రష్యా యుద్ధ భయం ఉన్నప్పటికీ.. అంతర్జాతీయ మార్కెట్ల నుంచి సానూకూల పవనాలతో దేశీయ స్టాక్ మార్కెట్లు గురువారం భారీ లాభాలతో ముగిశాయి. అమెరికా ఫెడ్ వడ్డీరేట్ల పెంపు తర్వాత అక్కడి మార్కెట్లు రాణించటమూ కలిసొచ్చినట్లు తెలుస్తోంది. ముడి చమురు ధరలు తగ్గడం, విదేశీ సంస్థాగత మదుపర్లు పెట్టుబడులకు మొగ్గచూపడమూ సానుకూలంగా మారింది. గడిచిన ఎనిమిది సెషన్లలో సెన్సెక్స్ ఏకంగా 5వేలకుపైగా పాయింట్లు పుంజుకోవటం వల్ల మదుపర్ల సంపద రూ.19 లక్షల కోట్లు పెరిగింది.
- ముంబాయి స్టాక్ ఎక్స్ఛేంజి సూచీ సెన్సెక్స్ 1047 పాయింట్ల లాభంతో 57,864 వద్ద ముగిసింది.
ఇంట్రాడే సాగిందిలా.. 57,620 వద్ద ప్రారంభమైన సెన్సెక్స్.. తొలుత స్వల్ప ఒడుదొడుకులకు లోనైంది. ఒక దశలో 57, 518 పాయింట్ల కనిష్ఠానికి పడిపోయి.. మదుపర్లు కొనుగోళ్లకు మొగ్గు చూపటం వల్ల పుంజుకుంది. 58,095 పాయింట్ల గరిష్ఠాన్ని తాకి 57,864 వద్ద స్థిరపడింది.
- జాతీయ స్టాక్ ఎక్స్ఛేంజి సూచీ నిఫ్టీ 311 పాయింట్ల వృద్ధితో 17,287 వద్ద స్థిరపడింది.
నిఫ్టీ.. 17,202 పాయింట్ల వద్ద ప్రారంభమవగా.. ఒకానొక దశలో 17,175 పాయింట్ల కనిష్ఠాన్ని తాకి.. మళ్లీ పుంజుకుంది. 17,344 పాయింట్ల గరిష్ఠాన్ని చేరుకుని చివరకు 17,287 వద్ద స్థిరపడింది.
లాభనష్టాల్లోనివి...
- హెచ్డీఎఫ్సీ, జేఎస్ డబ్ల్యూ స్టీల్, టైటాన్ కంపెనీ, ఎస్బీఐ బీమా, కొటక్ మహీంద్రా, ఏషియన్ పెయింట్స్, రిలయన్స్, టాటా స్టీల్, మారుతీలు సుమారు 3 శాతానికిపైగా లాభపడ్డాయి.
- ఇన్ఫోసిస్, సిప్లా, కోల్ ఇండియా, ఐఓసీ, హెచ్సీఎల్ టెక్లు నష్టాలను మూటగట్టుకున్నాయి.
ఇదీ చూడండి: రష్యా-ఉక్రెయిన్ యుద్ధంతో దేశార్థికానికి అనర్థం