Stock Market Close: మంగళవారం సెషన్లో రికార్డు స్థాయి లాభాల అనంతరం.. స్టాక్ మార్కెట్లు మళ్లీ ఒడుదొడుకులకు లోనయ్యాయి. మిడ్ సెషన్లో భారీ లాభాల్లో ఉన్న సూచీలు.. ఆఖరి గంటలో నష్టాల్లోకి జారుకున్నాయి.
తీవ్ర ఒత్తిడికి లోనైన బొంబాయి స్టాక్ ఎక్స్చేంజి సూచీ సెన్సెక్స్ ఓ దశలో 350 పాయింట్లకుపైగా కోల్పోయింది. ఆఖర్లో మళ్లీ పుంజుకుంది. చివరకు 145 పాయింట్ల నష్టంతో 57 వేల 997 వద్ద సెషన్‌ను ముగించింది.
ఇవాళ 150 పాయింట్లకుపైగా లాభంతో ప్రారంభమైన సెన్సెక్స్.. ఓ దశలో 400 పాయింట్ల మేర పెరిగి 58 వేల 569 వద్ద సెషన్ గరిష్ఠాన్ని తాకింది. 57 వేల 780 వద్ద కనిష్ఠాన్ని నమోదు చేసింది.
జాతీయ స్టాక్ ఎక్స్చేంజి సూచీ నిఫ్టీ 30 పాయింట్ల పతనంతో.. 17 వేల 322 వద్ద ముగిసింది.
- ప్రభుత్వ రంగ బ్యాంకింగ్ షేర్లు భారీ కుదుపునకు లోనయ్యాయి. రియాల్టీ, ఫార్మా షేర్లు రాణించాయి.
- మిడ్, స్మాల్ క్యాప్ షేర్లు ఫ్లాట్‌గా ముగిశాయి. ఆటో, లోహ రంగంలో అమ్మకాలు కనిపించాయి. విద్యుత్, ఆరోగ్యం, ఆయిల్ అండ్ గ్యాస్ రంగం షేర్లలో కొనుగోళ్లు చేపట్టారు మదుపరులు.
యుద్ధం ప్రభావం తొలగిపోలేదు..
Russia Ukraine Conflict: ఉక్రెయిన్- రష్యా సంఘర్షణ ప్రభావం మార్కెట్లపై కొనసాగింది. తమ బలగాలను డ్రిల్స్ అనంతరం వెనక్కి పిలిపించినట్లు రష్యా ప్రకటించినా.. అమెరికా, నాటో సహా పలు దేశాధినేతలు దీనిని విశ్వసించడం లేదు. ఉక్రెయిన్‌పై రష్యా దాడి చేసే అవకాశాలు ఇప్పటికీ కనిపిస్తున్నాయని అమెరికా అధ్యక్షుడు జో బైడెన్ అన్నారు. ఈ నేపథ్యంలోనే మదుపరులు ఆచితూచి వ్యవహరించారు.
లాభనష్టాల్లోనివి ఇవే..
దివిస్ ల్యాబ్స్, అదానీ పోర్ట్స్, ఓఎన్జీసీ, ఐఓసీ, హెచ్డీఎఫ్సీ లైఫ్ లాభపడ్డాయి.
పవర్ గ్రిడ్ కార్పొరేషన్, అల్ట్రాటెక్ సిమెంట్, ఐసీఐసీఐ బ్యాంక్, ఎన్టీపీసీ, ఎస్బీఐ డీలాపడ్డాయి.
ఇవీ చూడండి: India Export Growth: దేశ ఎగుమతుల్లో 25 శాతం వృద్ధి