చమురు ధరలు భారీగా పతనం కావడం, అంతర్జాతీయ విపణుల నుంచి ప్రతికూల సంకేతాల కారణంగా నేడు దేశీయ స్టాక్ మార్కెట్లు భారీ నష్టాలతో ట్రేడింగ్‌ను ముగించాయి. తమ దేశంలోకి వలసల్ని తాత్కాలికంగా నిషేధించనున్నామన్న అమెరికా అధ్యక్షుడు ట్రంప్ ప్రకటన కూడా మార్కెట్ల పతనానికి ఓ కారణమైంది.
బొంబాయి స్టాక్ ఎక్స్చేంజి సూచీ-సెన్సెక్స్ 1,011 పాయింట్ల నష్టంతో 30,636 వద్ద స్థిరపడింది. జాతీయ స్టాక్ ఎక్స్చేంజి సూచీ- నిఫ్టీ 280 పాయింట్లు క్షీణించి..8,981 వద్ద ముగిసింది.
లాభాల్లో..
డాక్టర్ రెడ్డీస్ ల్యాబ్స్, సిప్లా, ఇన్‌ఫ్రాటెల్, భారతీ ఎయిర్టెల్, బ్రిటానియా షేర్లు లాభాలతో ముగించాయి.
నష్టాల్లో...
ఇండస్ఇండ్ బ్యాంక్ షేర్లు దాదాపు 12 శాతం నష్టపోయాయి. బజాజ్‌ఫైనాన్స్, జీల్, హిందాల్కో, యాక్సిస్ బ్యాంకు షేర్లు నష్టాలు చవిచూశాయి.
రూపాయి....
డాలరుతో పోలిస్తే రూపాయి 30 పైసలు క్షీణించి రూ.76.83 వద్ద నిలిచింది.
చమురు పతనం...
చరిత్రలోనే ఎన్నడూ లేనంతగా తొలిసారిగా సోమవారం బ్యారల్ ధర ఓ దశలో -37.63 డాలర్లకు తగ్గిపోయింది. అంటే సరకు వదిలించుకోవడానికి విక్రేతే కొన్నవారికి ఎంతోకొంత ఎదురు చెల్లించుకోవాల్సిన పరిస్థితి నెలకొంది.
లాక్‌డౌన్ కారణంగా ప్రపంచవ్యాప్తంగా ముడి చమురుకు ఏమాత్రం గిరాకీ లేకుండా పోయింది. కర్మాగారాలూ మూతపడ్డాయి. చమురు డిమాండ్ భారీగా తగ్గింది. ఉత్పత్తిలో మాత్రం కోత పెట్టలేదు. పైగా ఆ మధ్య రష్యా, ఒపెక్ దేశాల మధ్య ధరలపోరు నడవడం వల్ల పోటాపోటీగా ఉత్పత్తిని పెంచాయి. ప్రస్తుతం వీరి మధ్య ఒప్పందం కుదరడం వల్ల ధరల యుద్ధం సమస్య సమసిపోయింది. రోజుకు 9.7 మిలియన్ బ్యారెళ్ల ఉత్పత్తిని తగ్గించేందుకు అంగీకరించాయి. కానీ, అది మే 1 నుంచి అమలులోకి రానుంది. దీంతో ప్రస్తుతం డిమాండ్, సరఫరాకు మధ్య భారీ వ్యత్యాసం నెలకొంది.