స్టాక్ మార్కెట్లు వరుస నష్టాల నుంచి తేరుకున్నాయి. సోమవారం సెషన్లో బీఎస్ఈ-సెన్సెక్స్ (Sensex today) 226 పాయింట్లు పెరిగి 55,555 వద్ద స్థిరపడింది. ఎన్ఎస్ఈ-నిఫ్టీ (Nifty today) 46 పాయింట్ల లాభంతో 16,496 వద్ద ముగిసింది.
ఈ సెషన్లో కూడా ఆరంభంలో ఒడుదొడుకులు ఎదుర్కొన్న సూచీలు.. ఐటీ సహా వివిధ రంగాల్లోని హెవీ వెయిట్ షేర్ల అండతో లాభాలను సాధించగలిగాయి. అంతర్జాతీయ మార్కెట్లు సానుకూలంగా స్పందించడం, ఆర్థిక వ్యవస్థపై ఆశాభావ అంచనాలు సూచీలను ముందుకు నడిపించినట్లు విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు.
ఇంట్రాడే సాగిందిలా (Intraday)..
సెన్సెక్స్ 55,781 పాయింట్ల అత్యధిక స్థాయి, 55,240 పాయింట్ల అత్యల్ప స్థాయిలను నమోదు చేసింది.
నిఫ్టీ 16,592 పాయింట్ల గరిష్ఠ స్థాయి 16,395 పాయింట్ల కనిష్ఠ స్థాయిల మధ్య కదలాడింది.
లాభనష్టాల్లోనివి ఇవే..
హెచ్‌సీఎల్‌టెక్, టీసీఎస్, బజాజ్ ఫిన్సర్వ్, నెస్లే ఇండియా, భారతీ ఎయిర్టెల్ షేర్లు లాభాలను గడించాయి.
ఎం&ఎం, బజాజ్ ఆటో, అల్ట్రాటెక్ సిమెంట్, పవర్‌గ్రిడ్, ఐటీసీ నష్టాలను మూటగట్టుకున్నాయి.
ఇతర మార్కెట్లు
ఆసియాలో ఇతర ప్రధాన మార్కెట్లలో.. షాంఘై (చైనా), నిక్కీ (జపాన్), కోస్పీ (దక్షిణ కొరియా), హాంగ్‌సెంగ్ (హాంకాంగ్) సూచీలు భారీ లాభాలను నమోదు చేశాయి.
ఇదీ చదవండి: వొడా-ఐడియాకు 43 లక్షల యూజర్లు గుడ్‌బై- జియోకు జై!