స్టాక్ మార్కెట్ల (Stock Market) రెండు రోజుల లాభాలకు బుధవారం బ్రేక్ పడింది. బీఎస్ఈ-సెన్సెక్స్ (Sensex today) 555 పాయింట్లు కోల్పోయి 59,189 వద్ద స్థిరపడింది. ఎన్ఎస్ఈ-నిఫ్టీ (Nifty today) 176 పాయింట్ల నష్టంతో 17,646 వద్దకు చేరింది.
ఆరంభంలో సానుకూలంగా స్పందించిన సూచీలు మిడ్ సెషన్ తర్వాత నష్టాల్లోకి జారుకున్నాయి. దాదాపు అన్ని రంగాలు నష్టాల బాట పట్టడం వల్ల వరుస లాభాలకు బ్రేక్ పడింది. ఇటీవలి లాభాలను మదుపరులు సొమ్ము చేసుకునే పనిలో పడ్డట్లు మార్కెట్ విశ్లేషకులు చెబుతున్నారు.
ఇంట్రాడే సాగిందిలా (Intraday)..
సెన్సెక్స్ 59,963 పాయింట్ల అత్యధిక స్థాయి, 59,079 పాయింట్ల అత్యల్ప స్థాయిలను నమోదు చేసింది.
నిఫ్టీ 17,884 పాయింట్ల గరిష్ఠ స్థాయి, 17,613 పాయింట్ల కనిష్ఠ స్థాయిల మధ్య కదలాడింది.
లాభనష్టాల్లోనివి ఇవే..
హెచ్డీఎఫ్సీ బ్యాంక్, హెచ్డీఎఫ్సీ, బజాజ్ ఫినాన్స్ షేర్లు మాత్రమే 30 షేర్ల ఇండెక్స్‌లో స్వల్పంగా లాభాలను గడించాయి.
ఇండస్ఇండ్ బ్యాంక్, టాటా స్టీల్, బజాజ్ ఆటో, హెచ్‌సీఎల్‌టెక్, రిలయన్స్ ఇండస్ట్రీస్ నష్టాలను మూగట్టుకున్నాయి.
ఇతర మార్కెట్లు
ఆసియాలో ఇతర ప్రధాన మార్కెట్లలో.. నిక్కీ (జపాన్), కోస్పీ (దక్షిణ కొరియా), హాంగ్‌సెంగ్ (హాంకాంగ్) సూచీలు భారీగా నష్టపోయాయి. షాంఘై (చైనా) సూచీ సెలవులో ఉంది.
ఇదీ చదవండి: భద్రతతో పాటు ఆదాయానిచ్చే ఎస్బీఐ గోల్డ్ స్కీం