బ్యాంకింగ్, ఆర్థిక సంస్థల కార్యకలాపాలను సాధారణ స్థితికి తీసుకొచ్చేందుకు రిజర్వు బ్యాంకు ప్రకటించిన ఉద్దీపన చర్యలు మార్కెట్లలో జోరు నింపాయి. కరోనా సంక్షోభంతో దెబ్బతిన్న ఆర్థిక వ్యవస్థకు ఊతమిచ్చేందుకు రూ.50 వేల కోట్లతో ఎల్టీఆర్ఓ ప్రకటించడం వల్ల స్టాక్ మార్కెట్లు భారీ లాభాల్లో ముగిశాయి.
ఇవాళ్టి ట్రేడింగ్లో బొంబాయి స్టాక్ ఎక్స్ఛేజీ సూచీ సెన్సెక్స్ 986 పాయింట్లు వృద్ధి చెందింది. చివరకు 31,589 వద్ద స్థిరపడింది. బ్యాంకింగ్ రంగ షేర్లు ఆకాశమే హద్దుగా చెలరేగాయి.
యాక్సిస్ బ్యాంక్ 14 శాతం వృద్ధి చెందింది. ఐసీఐసీఐ, ఇండస్ఇండ్ బ్యాంక్ షేర్లు 8 శాతానికి పైగా పెరిగాయి. వీటితో పాటు మారుతీ, టీసీఎస్, రిలయన్స్, కొటక్ బ్యాంక్, హెచ్డీఎఫ్సీ షేర్లు లాభాల్లో పయనించాయి.
మరోవైపు నెస్లే, హెచ్యూఎల్, టెక్ మహీంద్ర, సన్ ఫార్మా షేర్లు నష్టాలపాలయ్యాయి.
జాతీయ స్టాక్ ఎక్స్ఛేంజీ సూచీ నిఫ్టీ సైతం భారీ లాభాలు నమోదు చేసింది. 274 పాయింట్లు వృద్ధి చెంది 9,267 వద్ద ముగిసింది.