ఆర్బీఐ ద్రవ్యపరపతి విధాన సమీక్ష(RBI MPC meet), స్థూల ఆర్థిక గణాంకాలు, అంతర్జాతీయ పరిణామాలు ఈ వారం స్టాక్ మార్కెట్లకు (Stock market) కీలకం కానున్నాయని నిపుణులు చెబుతున్నారు. అయితే ఈ వారం కూడా సూచీలు కొంత దిద్దుబాటుకు లోనయ్యే అవకాశం ఉన్నట్లు (Stocks Outlook) అంచనా వేస్తున్నారు.
'అంతర్జాతీయ పరిణామాలు మార్కెట్లను ముందుకు నడిపించే వీలుంది. దేశీయంగా ప్రతికూల అంశాలు లేనప్పటికీ.. ఆర్బీఐ ద్రవ్యపరపతి విధాన సమీక్ష నిర్ణయాలు కీలకం కానున్నాయ'ని సాత్విక ఇన్వెస్ట్మెంట్ లిమిటెడ్ పరిశోధన విభాగాదిపతి సంతోశ్ మీనా తెలిపారు. దీనితోపాటు అమెరికా బాండ్ల రాబడుల లెక్కలు కూడా మార్కెట్లకు కీలకంగా కానున్నాయని వెల్లడించారు.
ఆర్బీఐ ద్రవ్యపరపతి విధాన కమిటీ సమీక్ష ఈ నెల 6న ప్రారంభమవనుంది. రెపో, రివర్స్ రెపో రేట్లతో పాటు ఇతర కీలక అంశాలపై తీసుకున్న నిర్ణయాలను 8వ తేదీన వెల్లడించనుంది. అదే రోజు దేశీయ టెక్ దిగ్గజం టీసీఎస్ ప్రస్తుత ఆర్థిక సంవత్సర రెండో త్రైమాసిక ఫలితాలను ప్రకటించనుంది. ఈ అంశాలన్ని మార్కెట్లను ప్రభావితం చేసే కీలకంగా ఉండనున్నాయని మార్కెట్ నిపుణులు చెబుతున్నారు.
వీటన్నింటితోపాటు.. ముడి చమురు ధరలు, రూపాయి మారకం విలువ, కరోనా కేసులు, వ్యాక్సినేషన్ వార్తలు మార్కెట్లపై ప్రభావం చూపే సాధారణ అంశాలుగా ఉండనున్నాయి.
గత వారం ఇలా..
స్టాక్ మార్కెట్లు గత వారం నష్టాలను మూట గట్టుకున్నాయి. బీఎస్ఈ-సెన్సెక్స్ (BSE Sensex) 1,282 పాయింట్లు కోల్పోయింది. దీనితో సూచీలు రికార్డు గరిష్ఠాల నుంచి వెనక్కి తగ్గాయి.
మార్కెట్ విలువపరంగా అత్యంత విలువైన టాప్ 10లో 8 కంపెనీలు నష్టాలను మూటగట్టుకున్నాయి. రిలయన్స్ ఇండస్ట్రీస్, ఎస్బీఐ మాత్రమే లాభాలను గడించాయి.
టీసీఎస్ మార్కెట్ విలువ (TCS M-cap) అత్యధికంగా రూ.52,526 కోట్లకుపైగా తగ్గి.. రూ.13,79,487 కోట్లకు చేరింది.
రిలయన్స్ ఇండస్ట్రీస్ మార్కెట్ విలువ (Reliance M-Cap) రూ.25,294 కోట్లకుపైగా పెరిగి.. రూ.15,99,346 కోట్ల వద్ద ఉంది.
ఇదీ చదవండి: ఆగని పెట్రో మంట- నాలుగో రోజూ పెరిగిన ధరలు