మిఠాయిలు, టపాకాయలతోనే కదా దీపావళి సందడి మొదలయ్యేది. నిజమే కానీ.. టపాసులు కాల్చినప్పుడు సంతోషంగానే ఉన్నా ఆ వెంటే అవి మోసుకొచ్చే పొగ, కాలుష్యం ఆరోగ్యానికి హానిచేస్తాయి. ఇక మిఠాయిల గురించి మీకు తెలిసిందే! బరువుని పెంచేస్తాయి. రోగాలని మోసుకొస్తాయి. ‘అలాగని పండగ ఆనందాన్ని దూరం చేసుకోలేం కదా?’ అనేవారి కోసం మధ్యప్రదేశ్‌కు చెందిన శ్వేత ఓ వినూత్నమైన ప్రయోగం చేసింది.
పర్యావరణానికి హాని కలగకుండా మేలు చేసే ‘సీడ్‌క్రాకర్స్’ తయారీని చేపట్టింది. ఇవి మామూలు టపాకాయాల్లా పెద్ద శబ్దంతో పేలడం, పొగతో కాలుష్యాన్ని పెంచడం వంటివి చేయవు. ఎదురు బోలెడు ఆక్సిజన్‌ని కూడా అందిస్తాయి. ‘పర్యావరణాన్ని కాపాడుకోవాల్సిన బాధ్యత ఏ ఒక్కరిదో కాదు. అందరిదీనూ’ అనే శ్వేత సామాజిక ప్రయోజనాలే లక్ష్యంగా ‘గ్రామ్‌ఆర్ట్ ప్రాజెక్టు’ అనే సంస్థను ప్రారంభించింది. ఈ సంస్థ కార్యక్రమాల్లో భాగంగా... 60 మంది మహిళలతో కలిసి ఈ ‘సీడ్‌క్రాకర్స్’ తయారీ మొదలుపెట్టింది. మధ్యప్రదేశ్‌లోని చింద్వారా జిల్లాలోని పరద్‌సింగా గ్రామానికి చెందిన మహిళలకు ఇందుకు సంబంధించిన శిక్షణ కూడా ఇచ్చింది. వీరంతా ఆరునెలల నుంచి ఈ పేలని టపాసుల తయారీలో క్షణం తీరిక లేకుండా ఉంటే.. మరోపక్క రైతులకూ ఉపాధి దొరుకుతోంది.
పేలవు.. మొలకెత్తుతాయి...
ఈ సీడ్‌క్రాకర్స్ తయారీకి చిత్తు కాగితాలూ, విత్తనాలే ముడిసరకులు. ఎటువంటి రసాయనాలూ, పేలుడు పదార్థాల వాడకం ఉండదు. చిత్తుకాగితాలను గుజ్జుగా చేసి, వాటికి రసాయనాలు లేని సహజ వర్ణాలను అద్ది ఆరబెడతారు. వాటిని ఉతుత్తి చిచ్చుబుడ్లూ, ఉల్లిపాయ బాంబులూ, భూచక్రాలూ, కాకరపువ్వొత్తులూ, తారాజువ్వల ఆకారాల్లో తయారుచేస్తారు. వాటిల్లో స్థానిక రైతుల నుంచి సేకరించిన ఉల్లి, గోంగూర, దోసకాయ, కొత్తిమీర, టొమాటోలు వంటి విత్తనాలను నింపుతారు. ఈ టపాసులను పాతితే మొలకెత్తుతాయన్నమాట. ఇక చిత్తుకాగితాల్ని ముద్దచేసి వాటితో చేసిన స్వీట్లయితే అచ్చంగా మిఠాయిలనే తలపించి నోరూరించేస్తాయి. కానీ అవి కూడా అంతే... తినడానికి ఏమాత్రం పనికిరావు. వాటిని మట్టిలో పెడితే మాత్రం ఎటువంటి రసాయనాలు లేని సేంద్రియ ఆహారం మీకు దొరుకుతుంది. ‘కాగితం గుజ్జుతో నోరూరించే లడ్డూలూ, కుకీలూ, బర్ఫీలూ, చమ్‌చమ్‌లు తయారుచేస్తాం. కానీ కంటికి మాత్రమే విందు సుమీ. వీటిని నాటితే టొమాటో, ముల్లంగి, వంకాయ, బెండ, పచ్చిమిర్చి, క్యారెట్ వంటి కూరగాయలని మీరు కూడా పొందొచ్చు. వీటితోపాటూ సీతమ్మవారి జడగంటలు, నక్షత్రపూలు వంటి పూలమొక్కల విత్తనాలనూ ఉంచాం’అంటోంది శ్వేత.
రైతుల మీద ప్రేమతో..
బరోడా విశ్వవిద్యాలయం నుంచి శిల్పకళలో మాస్టర్స్ పూర్తి చేసిన శ్వేత.. గతంలో మొలకెత్తే క్యాలెండర్లు, శుభలేఖలు, రాఖీలు తయారు చేసింది. పదహారు ఎకరాల్లో సేంద్రియ వ్యవసాయం చేస్తోంది. మరోవైపు స్థానిక రైతులకు చేయూతగా ఉండేందుకే ఈ సీడ్‌క్రాకర్స్‌ని మొదలుపెట్టింది. తాను తయారుచేసిన మొలకెత్తే స్వీట్లు, టపాసులని ఆన్‌లైన్‌లో ఉంచి విక్రయిస్తోంది. ‘పర్యావరణ ప్రేమికులు మా ఉత్పత్తులను బాగానే ఆదరిస్తున్నారు. ముఖ్యంగా హైదరాబాద్, ఆంధ్రప్రదేశ్, దిల్లీ, ముంబయి, రాజస్థాన్, బెంగళూరుల నుంచి మాకు ఆర్డర్లు ఎక్కువగా వస్తున్నాయి. వీటి ధర కూడా తక్కువే. రూ.35 నుంచి మొదలవుతున్నాయి’ అని చెబుతోంది శ్వేత. స్నేహితులకు కానుకగా ఇచ్చి మనం కూడా పర్యావరణం రక్షణ దిశగా అడుగులు వేయొచ్చేమో ప్రయత్నించి చూడండి.