కరోనా వ్యాప్తి నిరోధక చర్యల్లో భాగంగా అమలు చేసిన 21రోజుల లాక్‌డౌన్ వల్ల.. దేశ ఆర్థిక వ్యవస్థకు 7 నుంచి 8 లక్షల కోట్లరూపాయల నష్టం వాటిల్లిందని సెంట్రమ్ ఇన్స్టిట్యూషనల్ రీసెర్చ్ సంస్థ అంచనా వేసింది.
అత్యవసర సేవలు మినహా 70 శాతం ఆర్థిక కార్యకలాపాలన్నీ ఎక్కడికక్కడ నిలిచిపోవడం వల్ల దేశ ఆర్థిక వ్యవస్థ రోజుకు దాదాపు 35 వేల కోట్లరూపాయలు నష్టాల్ని చవిచూడాల్సి వచ్చినట్లు సెంట్రమ్ అధ్యయనంలో తేలింది. రవాణా, హోటళ్లు, రెస్టారెంట్లు,రియల్ ఎస్టేట్ రంగాలపై లాక్‌డౌన్ తీవ్ర ప్రభావం చూపిందని వెల్లడైంది.
ఆ రంగాల్లో అపార నష్టం...
ఒక్క రియల్ ఎస్టేట్ రంగంలోనే లక్ష కోట్లరూపాయలు నష్టం వాటిల్లినట్టు వెల్లడించింది. మొదటి 15 రోజుల్లో 35 వేల 2 వందల కోట్ల రూపాయలు నష్టపోయినట్లు ఆల్ ఇండియా మోటర్ ట్రాన్స్‌పోర్ట్ కాంగ్రెస్ పేర్కొంది. రిటైల్ రంగం 3 వేల కోట్లు నష్టపోయినట్టు ఆ రంగానికి చెందిన నిపుణులు తెలిపారు. ఇప్పటికే పలు సంస్థలు 2020-21 ఆర్థిక సంవత్సరానికి దేశ వృద్ధిరేటు అంచనాలు భారీగా తగ్గించాయి. ఈసారి 5.2 శాతం ఉంటుదనుకున్న వృద్ధి రేటు 1.5 శాతం నుంచి 2.8 శాతానికే పరిమితమయ్యే అవకాశం ఉందని ప్రపంచ బ్యాంక్ అంచనా వేసింది.