పరోటాపై 18 శాతం జీఎస్‌టీ.. ఇటీవల సామాజిక మాద్యమాల్లో చర్చకు దారితీసిన అంశం. రెస్టారెంట్లలో సర్వ్ చేసే ఫ్రోజెన్ (నిల్వ సేసిన) పరోటా(మలబార్ పరోటా)లను 18 శాతం జీఎస్‌టీ శ్లాబ్‌లోనే కొనసాగించాలని కర్ణాటకలోని ప్రత్యేక పన్నుల కోర్టు (అథారిటీ ఆఫ్ అడ్వాన్స్ రూలింగ్) ఇటీవల తీర్పునివ్వడం ఇందుకు కారణమైంది.
ఉత్తరాది రాష్ట్రాల్లో ఎక్కువగా తినే రోటీకి దగ్గర పోలికలు ఉన్న మలబార్ పరోటాను మాత్రమే 18 శాతం శ్లాబ్‌లో కొనసాగించడం, తీర్పును కేంద్ర ప్రభుత్వ అధికారులూ సమర్థించడం ఈ విషయంపై వాడీవేడి చర్చకు దారి తీసింది. కోర్టు తీర్పుపై వేలాది మంది ట్వీట్టర్ వేదికగా స్పందించారు.
ఈ అంశంపై కేంద్ర ప్రభుత్వ అధికారి ఒకరు 'ఈటీవీ భారత్'తో ప్రత్యేకంగా మాట్లాడారు.
ప్రభుత్వాధికారి స్పందన..
'ఫ్రోజెన్ పరోటాలు ఎక్కువగా ధనవంతులే తినేందుకు ఇష్టపడతారు. వారికి పన్ను కట్టే సామర్థ్యం ఉంటుంది' అని ప్రభుత్వాధికారి అభిప్రాయపడ్డారు. సామన్యులు కూడా ఎక్కువగా కొనుగోలు చేసే బిస్కెట్లు, కేకుల వంటి వస్తువులపైనా జీఎస్‌టీ 18 శాతం విధిస్తున్న విషయాన్ని ఆయన గుర్తు చేశారు. సామాన్యులు, పేదలు తినే సాదా రోటీ, సాదా పరోటాలను ఫ్రోజెన్ పరోటాలతో పోల్చడం సరికాదన్నారు.
దేశంలో పాలు పన్ను రహితంగా ఉన్నాయని తెలిపిన ప్రభుత్వాధికారి.. టెట్రా ప్యాకెట్ పాలపై 5 శాతం, చిక్కటి పాల ప్యాకెట్‌పై 12 శాతం జీఎస్‌టీ విధిస్తున్న విషయాన్నీ గుర్తు చేశారు.
ప్రపంచవ్యాప్తంగా ప్రాసెస్ చేసిన లేదా ప్యాకేజ్ చేసిన ఆహార ఉత్పత్తులపై అధిక పన్ను రేటు విధిస్తుండటం గమనార్హం.
అందుకే వాటిపై అధిక పన్ను..
"నెస్లే, హెచ్‌యూఎల్, కోకా కోలా, పెప్సీ వంటి సంస్థలు ప్యాకేజ్ చేసిన ఆహార వస్తువులను ఎక్కువ ధరలకు విక్రయించి భారీ లాభాలు ఆర్జిస్తున్నాయి. నిజానికి ఎవరైనా అలాంటి ప్యాకేజ్ ఆహార వస్తువులు కొంటున్నారంటే వారి ఆర్థిక స్థితి ఎంతో కొంత మెరుగ్గా ఉందని అర్థం. అందుకే అలాంటి వాటిపై అధిక పన్నులు విధించడం సరైందే" అని ఆ ప్రభుత్వాధికారి చెప్పుకొచ్చారు.
అసలు ఈ పరోటా కేసు ఏమిటి?
బెంగళూరు కేంద్రంగా ఉన్న రెడీ టూ కుక్, తాజా ఆహార ఉత్పత్తుల తయారీ సంస్థ ఐడీ ఫ్రెష్ ఫుడ్ ఇండియా ప్రైవేట్ లిమిటెడ్.. ఫ్రోజెన్ పరోటాలను 1905 హెడింగ్ కింద పరిగణించి.. వాటిని 5 శాతం జీఎస్‌టీ పరిధిలోకి తీసుకురావాలని అథారిటీ ఆఫ్ అడ్వాన్స్ రూలింగ్‌ను ఆశ్రయించింది. గత నెల ఈ వ్యాజ్యాన్ని కోర్టు ముందు ఉంచగా.. ఈ వాదనను తోసిపుచ్చిన ధర్మాసనం.. 18 శాతం జీఎస్‌టీ శ్లాబులోనే మలబార్ పరోటాలను కొనసాగించాలని స్పష్టం చేసింది.
పరోటాకు, చపాతీకి తేడా ఉందని, అందుకే రెస్టారెంట్లలో సర్వ్ చేసే రెడీ టు ఈట్ పరోటాపై 18% జీఎస్‌టీ వర్తిస్తుందని పేర్కొంది. పరోటాను తినేముందు మరోమారు వేడి చేయాల్సి ఉండటమే ఇందుకు కారణంగా పేర్కొంది. 5 శాతం జీఎస్‌టీ వర్తించాలంటే ఛాప్టర్ 1905 లేదా 2106లో షరతులను తృప్తి పరచడం సహా సాధారణ చపాతీ లేదా రోటీలో ఏదో ఒకటి అయి ఉండాలని ఏఏఆర్ తన ఆదేశాల్లో పేర్కొంది. పరోటా ఛాప్టర్ 2106 కిందకు వచ్చినప్పటికీ అది చపాతీ లేదా రోటీ లాంటిది కాదని, వాటికి దీనికి తేడా ఉందని తెలిపింది.
అధికారిక వర్గాల ప్రకారం నిల్వచేసే పరోటాలపై జీఎస్‌టీ తగ్గించాలన్న ప్రతిపాదనేది 37వ జీఎస్‌టీ మండలి సమావేశంలో చేయలేదని తెలిసింది.
ఇదీ చూడండి:బ్యాంకుల ప్రైవేటీకరణ ఈ ఏడాది కష్టమే!