ఉద్యోగం చేస్తున్నప్పటికీ 20,30 ఏళ్ల వయసులోనూ చాలా మంది యువత ఇంకా ఆర్థిక విషయాల్లో తల్లిదండ్రులపై ఆధారపడుతుంటారు. వారు ఆర్థిక విషయాలను సొంతంగా నిర్వహించుకోలేరు కాబట్టి తల్లిదండ్రులకు ఇది భారంగా మారడమే కాకుండా ఆర్థిక విషయాలపై ప్రభావం చూపుతుంది. అందుకే పిల్లలు అడిగినప్పుడు డబ్బు ఇవ్వడమే కాదు వారికి ఆర్థిక విషయాలపై అవగాహన కల్పిస్తే మంచిదని నిపుణులు సూచిస్తున్నారు.
పరిస్థితిని అర్థం చేసుకోండి
మొదట మీ పిల్లలు వారి ఖర్చులను ఎందుకు నిర్వహించలేకపోతున్నారో తెలుసుకోండి. ఇక్కడ రెండు కారణాలు ఉండవచ్చు. ఒకటి వారి ఖర్చులకు తగినంత ఆదాయం లేకపోవడం, రెండవది తగినంత ఆదాయం ఉన్నప్పటికీ ఎక్కువ ఖర్చు చేయడం.
ఈ రెండు సందర్భాలలో వారితో మాట్లాడి సమస్యను పరిష్కరించేందుకు ప్రయత్నించాలి. వారి ఖర్చులను వారే నిర్వహించుకునేవిధంగా సలహాలను ఇవ్వాలి. ఆర్థిక విషయాలు మాట్లాడేందుకు ఇబ్బంది పడితే మీ ఆర్థిక సలహాదారుడిని సూచనలు ఇవ్వాల్సిందిగా కోరాలి.
సమస్యలు..
మీ పిల్లలు ఆర్థికంగా స్వతంత్రులు కాకపోతే మీతో పాటు వారి భవిష్యత్తూ ప్రశ్నార్థకంగా మారుతుంది. పొదుపు, పెట్టుబడుల గురించి వారికి తెలియజేయకపోతే ఎక్కువ ఖర్చు చేయడం, అప్పులు చేయడం వంటివి చేస్తుంటారు. వారికి వీలైనంత త్వరగా ఆర్థిక విలువలు, ఆర్థిక అంశాలపై అవగాహన కల్పించాలి అని ఆర్థిక నిపుణులు చెబుతున్నారు.
డబ్బు విలువ ఎప్పుడు తెలియజేయాలి?
స్కూల్ లేదా కాలేజీలో వారికి ఫీజులు చెల్లిస్తున్న సమయంలోనే పిల్లలకు ఆర్థిక విషయాలపై అవగాహన కల్పించాలి. చిన్న వయసులో ఉన్నప్పుడే ఇలాంటి విషయాల గురించి చెబితే త్వరగా వాటిని ఆర్థం చేసుకోగలుగుతారు.
అలా కాకుండా వారు అడిగిన ప్రతిసారి డబ్బు ఇస్తుంటే మీ పెట్టుబడులపై ప్రభావం చూపడమే కాకుండా ఆర్థిక లక్ష్యాలనూ దెబ్బతీస్తుంది.
ప్రోత్సాహమివ్వండి.. డబ్బు కాదు!
తల్లిదండ్రులు పిల్లలను పొదుపు చేసేలా ప్రోత్సహించాలి. మొదట తమ వేతనంలో 20 శాతం పొదుపు చేసి మిగతాది ఖర్చు పెట్టుకోమని చెప్పాలి. మీకు మీ పిల్లల్ని పోషించేంత స్థోమత ఉన్నప్పటికీ వారి ఆర్థిక నిర్ణయాలు వారే తీసుకునేలా ప్రోత్సహించాలి. పెట్టుబడుల నిర్ణయాల్లో సహకరించి అవసరమైన సూచనలు చేయాలి.
సరైన సందేశాన్నివ్వండి
పిల్లలు వారికి వచ్చే డబ్బు ఖర్చులకు సరిపోకపోతే ఒకసారి వారు చేసే ఖర్చులను గమనించాల్సి ఉంటుంది. ఎక్కువ అత్యాశకు పోవడం, విలాసాలను అలవాటు చేసుకోవడం మంచిది కాదన్న విషయాన్ని అర్థమయ్యేలా వివరించాలి.
దీర్ఘకాలిక లక్ష్యాల కోసం, పదవీ విరమణ కోసం డబ్బు దాచుకోవడంలో ఉన్న ఆవశ్యకతను తెలియజేయాలి. హోటళ్లు, రోస్టారెంట్లలో భోజనం, వినోదం, సినిమాలు, షికార్లు వంటి ఖర్చులకు పరిమితి విధించి పొదుపు చేయడం అలవాటు చేసుకునే విధంగా సలహాలు ఇవ్వాలి.
ఇదీ చూడండి:వాహన మహారథులకు పద్మభూషణ్