ఏడాది క్రితం వరకూ ఆరోగ్య బీమా ఉన్న వారు వస్తే.. ఆసుపత్రులు వారికి ప్రత్యేక ఏర్పాట్లు చేసేవి. కానీ, కొవిడ్-19 రాకతో ఈ పరిస్థితులు మారిపోయాయి. 2020లో కొన్ని ఇబ్బందులు వచ్చినా.. ప్రభుత్వం, ఐఆర్‌డీఏఐ, బీమా సంస్థలు జోక్యం చేసుకోవడం వల్ల సమస్యలు పరిష్కారం అయ్యాయి. ఆరోగ్య బీమా పాలసీల్లో కొవిడ్-19కు కచ్చితంగా పరిహారం ఇవ్వాల్సిందేనని చెప్పడం, తర్వాత కరోనా రక్షక్, కరోనా కవచ్ పేర్లతో ప్రత్యేకంగా బీమా పాలసీలూ రావడం ప్రారంభమయ్యాయి. అన్నీ సర్దుకుంటున్నాయని భావిస్తున్న తరుణంలోనే మరోసారి మహమ్మారి విరుచుకుపడింది. ఇంట్లో ఉండి చికిత్స తీసుకునే దశ నుంచి ఆసుపత్రిలో చేరి, ఆక్సిజన్ తీసుకోవాల్సిన అవసరం ఏర్పడుతోంది. దీంతో హాస్పిటళ్లన్నీ కరోనా రోగులతో నిండి పోయాయి. ఫలితం.. అడిగినంత డబ్బు చెల్లిస్తేనే బెడ్లు అందుబాటులో ఉన్నాయన్న సమాధానం ఆసుపత్రుల నుంచి వినిపిస్తోంది..
ఆరోగ్య బీమా పాలసీ ఉన్న వారిని చేర్చుకోవడం, నగదు రహిత (క్యాష్‌లెస్) చికిత్స అందించడంలో ఎలాంటి ఆలస్యం చేయొద్దని ఆదేశించాల్సిందిగా బీమా నియంత్రణ, అభివృద్ధి ప్రాధికార సంస్థ (ఐఆర్‌డీఏఐ)కు కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ సూచించారు. ఐఆర్‌డీఏఐ వెంటనే ఈ విషయంలో తగిన చర్యలు తీసుకోవాల్సిందిగా బీమా సంస్థలనూ ఆదేశించింది. బీమా పాలసీలను తిరస్కరించే ఆసుపత్రులతో మాట్లాడాల్సిందిగా బీమా సంస్థలకు మార్గదర్శకాలు జారీ చేసింది. అయినప్పటికీ.. పాలసీదారులు సమస్యలు ఎదుర్కొంటూనే ఉన్నారు. ఇలాంటి సందర్భాల్లో పాలసీదారులు ఏం చేయాలంటే..
టీపీఏ..మాట్లాడండి..
బీమా సంస్థతో ఒప్పందం కుదుర్చుకున్న ఆసుపత్రికి వెళ్లినప్పుడు.. నగదు రహిత చికిత్సకు నిరాకరిస్తే.. బీమా సంస్థ థర్డ్ పార్టీ అడ్మినిస్ట్రేటర్ (టీపీఏ) లేదా బీమా సంస్థ సేవా కేంద్రాన్ని సంప్రదించాలి. ఆసుపత్రితో మాట్లాడాల్సిందిగా కోరండి. అప్పటికీ నగదు రహిత చికిత్సకు నిరాకరిస్తే.. ఆసుపత్రిపై బీమా సంస్థకు, ఐఆర్‌డీఏఐకి ఫిర్యాదు చేయొచ్చు.
ఖర్చులను తిరిగి పొందడం..
అత్యవసర పరిస్థితుల్లో ఆసుపత్రిలో బెడ్ దొరకడమే పదివేలన్నట్లు ఉంది ఇప్పుడు పరిస్థితి. కాబట్టి, క్యాష్‌లెస్ తిరస్కరించినప్పుడు.. సాధ్యమైనంత వరకూ నగదు చెల్లించైనా చికిత్స చేయించుకోవడమే మేలని ఆర్థిక నిపుణులు సూచిస్తున్నారు. అత్యవసర నిధి, లేదా క్రెడిట్ కార్డుతో బిల్లు చెల్లించండి. ఆ తర్వాత బీమా సంస్థకు ఆ బిల్లులన్నీ పంపించి, చికిత్స ఖర్చులను క్లెయిం (రీఇంబర్స్‌మెంట్) చేసుకోవచ్చు. రీఇంబర్స్‌మెంట్ కోసం చేసిన క్లెయింలను నిబంధనల మేరకు వెంటనే ఆమోదించాల్సిందిగా బీమా సంస్థలకు ఐఆర్‌డీఏఐ ఇప్పటికే ఆదేశాలిచ్చింది. ప్రాణాపాయం నుంచి గట్టెక్కడమే ఇప్పుడు కీలకం అన్నది మర్చిపోకండి.
నెట్‌వర్క్ ఆసుపత్రి కాకపోతే..
బీమా సంస్థ, టీపీఏలతో ఒప్పందం ఉన్న ఆసుపత్రుల్లో చికిత్స కోసం చేరినప్పుడే నగదు రహిత చికిత్స వర్తిస్తుంది. వాటిని సంప్రదించినప్పుడు డబ్బు చెల్లిస్తేనే చేర్చుకుంటామని చెబితే.. అంతకన్నా అప్పుడు అదే కాకుండా.. ఇతర హాస్పిటళ్లనూ పరిశీలించవచ్చు. బీమా సంస్థతో ఒప్పందం లేని ఆసుపత్రిలో మరింత మెరుగైన చికిత్స అందుతుంది అనుకుంటే అటే వెళ్లవచ్చు. ఆరోగ్యంగా ఇంటికి వచ్చాక.. బీమా సంస్థకు బిల్లులను పంపించి పరిహారాన్ని పొందే వీలుంటుంది.
ఆసుపత్రిపై ఫిర్యాదు..
బీమా పాలసీ ఉన్న వారికి చికిత్సను నిరాకరిస్తే.. ఆ ఆసుపత్రిపై ఫిర్యాదు చేసే అధికారం పాలసీదారులకు ఉంటుంది. ఈ విషయాన్ని తాజాగా జారీ చేసిన సర్క్యులర్‌లో ఐఆర్‌డీఏఐ స్పష్టం చేసింది. దీనికోసం ప్రత్యేకంగా ఒక ఫిర్యాదుల విభాగాన్నీ నియంత్రణ సంస్థ ప్రారంభించింది. బీమా సంస్థతో ఒప్పందం కుదుర్చుకునేటప్పుడే కొన్ని నిబంధనలు ఉంటాయి. వీటిని అమలు చేయాల్సిన బాధ్యత అటు బీమా సంస్థ, ఇటు ఆసుపత్రిపైనా ఉంటుంది. నిబంధనల ఉల్లంఘన జరిగిన సందర్భాల్లో బీమా సంస్థ సంబంధిత ఆసుపత్రులపై న్యాయపరమైన చర్యలు తీసుకోవాలని ఐఆర్‌డీఏఐ స్పష్టం చేసింది.
పరిహారం రాకపోతే..
బీమా సంస్థ బిల్లులను తిరిగి చెల్లించడంలో ఆలస్యం చేస్తే.. బీమా సంస్థ ఫిర్యాదుల విభాగాన్ని సంప్రదించాలి. సమస్య 15 రోజుల్లోగా పరిష్కారం కాకపోతే.. ఐఆర్‌డీఏ ఇంటిగ్రేటెడ్ గ్రీవియన్స్ మేనేజ్‌మెంట్ సిస్టం (ఐజీఎంఎస్)కు ఫిర్యాదు చేయాల్సి ఉంటుంది.
బీమా సంస్థే నిరాకరిస్తే..
బీమా సంస్థ నెట్‌వర్క్ ఆసుపత్రిలో చేరడానికి వెళ్లినప్పుడు.. ఆసుపత్రి నగదు రహిత చికిత్సకు అంగీకరించినప్పటికీ.. బీమా సంస్థ దీనికి తిరస్కరిస్తున్న సందర్భాలూ ఇటీవల కనిపిస్తున్నాయి. చాలామంది స్వల్ప, మధ్యస్థ కొవిడ్-19 లక్షణాలు కనిపించగానే ఆసుపత్రిలో చేరేందుకు వెళ్తున్నారు. ఇలాంటి వారు ఇంటి వద్ద ఉండీ చికిత్స చేయించుకునే వీలుంటుంది కాబట్టి, ఆసుపత్రిలో చేరాల్సిన అవసరం లేదని బీమా సంస్థలు వాదిస్తున్నాయి. బీమా ఉంది కదా అని ముందు జాగ్రత్తగా ఆసుపత్రిలో చేరడం వల్ల బీమా సంస్థలపై భారం పడుతోందనీ, రోజూ ఇలాంటి క్లెయింలు ఎన్నో వస్తున్నాయని, తప్పనిసరి పరిస్థితుల్లో వీటిని తిరస్కరించాల్సి వస్తోందని కొన్ని సంస్థలు చెబుతున్నాయి. టెలీ మెడిసిన్ సేవలను వినియోగించుకునే వీలును పరిశీలించాల్సిందిగా తమ పాలసీదార్లకు సూచిస్తున్నాయి. ఒకవేళ నిజంగానే ఆసుపత్రిలో చేరాల్సిన అవసరం ఉండీ, బీమా సంస్థ నగదు రహిత చికిత్సకు నిరాకరిస్తే.. బీమా సంస్థ ఫిర్యాదుల పరిష్కార వేదికకు ఆ విషయాన్ని తెలియజేయొచ్చు. నియంత్రణ సంస్థకు ఫిర్యాదు చేయొచ్చు. మరోవైపు ఆసుపత్రులు బీమా సంస్థ చెల్లించే బిల్లు సరిపోదని, కాబట్టి, కొంత డబ్బు చెల్లించాల్సిందేననీ ఒత్తిడి చేస్తున్నాయి. వీటిని తిరిగి క్లెయిం చేసుకునే వీలూ ఉండదు. కాబట్టి, తప్పనిసరి అయితేనే ఆసుపత్రిలో చేరడం మేలని నిపుణులు సూచిస్తున్నారు.
వైద్య రంగంలో మదుపు..
దాదాపు ఏడాదిన్నర కాలంగా కొవిడ్-19 మహమ్మారితో మనదేశంతో పాటు ప్రపంచ దేశాలన్నీ అతలాకుతలం అయిపోతున్నాయి. ఈ పరిస్థితుల్లో ఫార్మా కంపెనీలు, ఆస్పత్రులు, వైద్య ఉపకరణాల తయారీ కంపెనీల, శాస్త్ర పరిశోధనలు- ఆవిష్కరణల్లో నిమగ్నమై ఉన్న సంస్థలకు ఆదాయాలు, లాభాలు ఎంతగానో పెరిగే పరిస్థితి ఏర్పడింది. ఏడాది కాలంలో ఆయా కంపెనీల షేర్ల ధరలు పెరిగి మదుపరులకు లాభాల పంట పండింది. ఈ రంగానికి చెందిన కంపెనీలపై పెట్టుబడి ఇంకా ఆకర్షణీయమేననే అభిప్రాయం సర్వత్రా ఉంది. ఈ నేపథ్యంలో అగ్రశ్రేణి హెల్త్‌కేర్ కంపెనీలన్నింటిలో పెట్టుబడి పెట్టే అవకాశాన్ని కల్పిస్తూ ‘యాక్సిస్ హెల్త్‌కేర్ ఈటీఎఫ్’ అనే మ్యూచువల్ ఫండ్ పథకాన్ని యాక్సిస్ మ్యూచువల్ ఫండ్ తీసుకొచ్చింది. దీర్ఘకాలిక లాభాలు గడించటం ఈ ఫండ్ ప్రధాన లక్ష్యం. ఈ ఫండ్‌కు ప్రామాణికంగా తీసుకున్న నిఫ్టీ హెల్త్‌కేర్ ట్రై ఇండెక్స్ దీర్ఘకాలంలో ఎంతో సంపద సృష్టించింది. దీన్లో 20 పెద్ద హాస్పిటళ్లు, డయాగ్నస్టిక్ సేవల కంపెనీలు, ఫార్మా, ఆర్‌అండ్‌డీ కంపెనీలు ఉన్నాయి. నిష్క్రియాత్మక పెట్టుబడుల (పాసివ్ ఇన్వెస్టింగ్) విధానానికి ఇటీవల మనదేశంలో ఆదరణ పెరుగుతోంది. ఇండెక్స్ ఫండ్స్ లేదా ఎక్స్ఛేంజి ట్రేడెడ్ ఫండ్స్ (ఈటీఎఫ్) వైపు మదుపరులు మొగ్గుచూపుతున్నారు. ఇటువంటి ఫండ్స్‌లో ఫండ్ మేనేజర్ పాత్ర పరిమితంగానూ, పోర్ట్‌ఫోలియో ఛర్నింగ్ (ఫండ్‌లోని షేర్ల అమ్మకాలు, కొనుగోళ్లు) తక్కువగానూ ఉంటాయి. పైగా ఈటీఎఫ్‌లలో ఫండ్ ఛార్జీలు తక్కువగా ఉంటాయి. ఎన్‌ఏవీ ఎప్పటికప్పుడు (రియల్‌టైమ్ పద్దతిలో..) తెలుస్తూ ఉంటుంది. యాక్సిస్ హెల్త్‌కేర్ ఈటీఎఫ్ లో రెండు ప్రయోజనాలు ఉన్నాయి. ఒకటి- ఇది ఈటీఎఫ్ ఫండ్. రెండు- ఇది హెల్త్‌కేర్ రంగానికి చెందినది కావటం. దీనిపై పెట్టుబడి ఆకర్షణీయమనే విశ్వాసం ఉన్న మదుపరులు దీన్ని పరిశీలించవచ్చు.
- ఇది ఓపెన్ ఎండెడ్ ఎక్స్ఛేంజి ట్రేడెడ్ ఫండ్.
- దేశంలో అగ్రశ్రేణి హెల్త్‌కేర్ కంపెనీల్లో పెట్టుబడి పెట్టే అవకాశాన్ని మదుపరులకు ఈ ఫండ్ కల్పిస్తుంది.
- కనీస పెట్టుబడి రూ.5,000.
- ఎన్‌ఎఫ్‌ఓ మే 10 వరకూ అందుబాటులో ఉంటుంది.
నమ్మకమైన సంస్థల్లో..
నమ్మకం ఉన్న కంపెనీలపై కేంద్రీకృత పెట్టుబడులు పెట్టటం, తద్వారా అధిక లాభాలు ఆర్జించటం.. అనేది ఈ మధ్యకాలంలో ఈక్విటీ పెట్టుబడులకు సంబంధించి వచ్చిన సరికొత్త పంథా. ఇదే లక్ష్యంతో ఫోకస్డ్ మ్యూచువల్ ఫండ్ పథకాలను పలు ఫండ్ సంస్థలు ప్రవేశపెట్టాయి. ఈ కోవలో మరొక ఫండ్‌ను కెనరా రొబేకో మ్యూచువల్ ఫండ్ తీసుకువచ్చింది.
కెనరా రొబేకో ఫోకస్డ్ ఈక్విటీ ఫండ్ - న్యూఫండ్ ఆఫర్ (ఎన్‌ఎఫ్‌ఓ) ముగింపు తేదీ మే 7. ఈ పథకం కింద సేకరించిన నిధులను ప్రధానంగా 30 కంపెనీల షేర్లపై పెట్టుబడి పెడతారు. ఈక్విటీకి కనీసం 65 శాతం నిధులను కేటాయిస్తారు. మిగిలిన సొమ్మును రుణపత్రాలు, రీట్, ఇన్విట్, ఈటీఎఫ్‌లకు మళ్లించవచ్చు. ఈ పథకం పనితీరును ఎస్‌అండ్‌పీ బీఎస్‌ఈ 500 ట్రై ఇండెక్స్‌తో పోల్చి చూస్తారు. దీనికి శ్రీదత్త భండ్‌వాల్దర్ ఫండ్ మేనేజర్‌గా వ్యవహరిస్తారు.
ఫోకస్డ్ ఫండ్ విషయంలో రిస్కు అధికం. రివర్డూ ఎక్కువే. ఫండ్ మేనేజర్ అంచనా సరిగా ఉంటే లాభాల పంట పండుతుంది. లేకపోతే పెద్దగా ప్రతిఫలం ఉండకపోవచ్చు. కొంత రిస్క్ తీసుకోవటానికి సిద్ధంగా ఉన్నవారు ఇటువంటి పథకాలను పరిశీలించవచ్చు.
ఇవీ చదవండి: