కరోనా మహమ్మారి దేశాన్ని ఓ కుదుపునకు గురి చేసింది. ఫలితంగా ఆర్థిక వ్యవస్థ భారీగా కుదేలైంది. ఈ కారణాలన్నింటితో దేశవ్యాప్తంగా అనేక మంది ఉద్యోగాలు కోల్పోయారు. మరెంతో మంది స్వయం ఉపాధి పొందుతున్నవారికి ఆదాయం లేకుండా పోయింది.
సంక్షోభం అనేది ఇది మొదటిది కాదు. అలానే చివరిది కూడా కాదు. ఇక ముందు కూడా సంక్షోభాలు రావచ్చు. మళ్లీ అప్పుడూ ఉద్యోగం పోవడం, ఆదాయాలు తగ్గటం వంటి పరిణామలు చోటు చేసుకోవచ్చు. ఇలా ఒక్క సారిగా ఉద్యోగం పోవటం, ఆదాయం కోల్పోవడం వంటివి జరిగితే.. మధ్య తరగతి వారిని ఆర్థిక సమస్యలూ చుట్టుముడతాయి. ఇలాంటి పరిస్థితులు వచ్చినా.. ఒక్క సారిగా ఆర్థిక సంక్షోభంలోకి కూరుకుపోకుండా ఆన్లైన్ ఇన్సూరెన్స్ పోర్టల్ పాలసీ బజార్ డాట్‌కామ్ ఓ ప్రత్యేక సదుపాయాన్ని అందుబాటులోకి తెచ్చింది.
ఈ సదుపాయంతో.. దేశంలో ప్రముఖ బీమా సంస్థలైన ఎస్బీఐ జనరల్, శ్రీరామ్ జనరల్, యూనివర్సల్ సంపో, ఆదిత్యా బిర్లా ఇన్సూరెన్స్ అందించే జాబ్‌లాస్ పాలసీలను కొనుగోలు చేయవచ్చు.
ఇందులో కొన్ని పాలసీలు కేవలం ఉద్యోగం కోల్పోయిన సందర్భంలోనే కాకుండా స్వయం ఉపాధి పొందుతున్న వారు ఆదాయం కోల్పోయినా కవరేజీని ఇస్తాయి.
ఏమిటీ జాబ్ లాస్ బీమా పాలసీ?
లే-ఆఫ్స్, సంస్థల ఖర్చు తగ్గింపులో భాగంగా ఉద్యోగం కోల్పోవటం, ప్రాజెక్టుల మూసివేత, ప్రమాదవశాత్తు వైకల్యం మొదలైన కారణాల వల్ల ఉద్యోగం కోల్పోయిన వారికి కొంత వరకు ఆర్థికంగా భరోసానిచ్చేవే ఈ జాబ్‌లాస్ పాలసీలు.
స్వయం ఉపాధి విషయంలో అయితే కార్యాలయం దెబ్బతినటం లేదా ఆనారోగ్యం, వైకల్యం వల్ల ఆదాయం కోల్పోవడం వంటి వాటికి కూడా ఈ పాలసీలు వారికి ఆర్థికంగా అండగా నిలుస్తాయి.
ప్రస్తుతం ఉద్యోగం/ఆదాయం కోల్పోవడం వంటివి జరిగితే బీమా ప్రామాణికంగా అందరికీ అందుబాటులో లేదు. ఇది గృహ బీమా, జీవిత బీమా లాంటి ఎక్కువ విలువున్న పాలసీలపై రైడర్‌గా లభిస్తోంది.
జాబ్‌లాస్ పాలసీల ప్రయోజనాలు
బీమా సంస్థను బట్టి స్వయం ఉపాధి, వేతన జీవులకు వివిధ రకాల పాలసీలు ఉన్నాయి. ప్లాన్‌ను బట్టి ప్రయోజనాలు మారుతుంటాయి. ఈ పాలసీల్లో కవరేజీ రెండు సందర్భాలపై ఆధారపడి ఉంటుంది.
లే-ఆఫ్స్ (టర్మినేషన్), సంస్థ ఖర్చు తగ్గింపులో భాగంగా ఉద్యోగం/ఆదాయం నష్టపోవటం ఇందులో మొదటిది.
వైకల్యం సంభవించంటం లేదా మరణించటం వల్ల ఉద్యోగం/ఆదాయం కోల్పోవటం రెండోది.
మొదటి దానిలో బీమా సంస్థ మూడు నెలల ఈఎంఐ చెల్లిస్తుంది. వాయిదా మొత్తం పాలసీదారుడు చెల్లించే ఈఎంఐపై ఆధారపడి ఉంటుంది.
రెండో సందర్భంలో అయితే పాలసీదారుడి కుటుంబం రెండు సంవత్సరాల వరకు వారం వారీగా వేతన ప్రయోజనాలు పొందుతుంది. ఇది పాలసీదారుడి నికర వేతనంపై ఆధారపడి ఉంటుంది. ఆదాయ పన్ను చట్టం సెక్షన్ 80(డీ) ప్రకారం ఈ పాలసీల ప్రీమియం పై రిబేట్ పొందవచ్చు.
ప్రీమియం ఎంత చెల్లించాలి?
పాలసీదారుడి వేతనం, ఎంత రుణం ఉంది, ఈఎంఐలు, వారం వారీగా అందుకోవాలనుకుంటున్న ప్రయోజనం తదితర అంశాలపై ప్రీమియం ఆధారపడి ఉంటుంది.
ఉదాహరణకు..
రుణం మొత్తం రూ.15 లక్షలు, ఈఎంఐ రూ.15వేలు. ఇలాంటి సందర్భాలో రూ.45వేల ఈఎంఐ కోసం.. రూ.2,070 వార్షిక ప్రీమియం ఉన్న పాలసీ అందుబాటులో ఉన్నాయి.
బీమా ఎప్పుడు వర్తిస్తుంది? ఎప్పుడు వర్తించదు?
టర్మినేషన్, డిస్ మిసల్, వ్యయ తగ్గింపులో భాగంగా ఉద్యోగం కోల్పోయినట్లైతే ఈ బీమా వర్తిస్తుంది.
మోసం, అవినీతికి పాల్పడటం వంటి కారణాలతో ఉద్యోగం కోల్పోతే బీమా వర్తించదు.
ఆదాయ నష్టానికీ ప్రత్యేక బీమా
రుణం లేనట్లయితే ఆదాయం నష్టం విషయంలో మాత్రమే బీమా చేయించుకోవాలనుకుంటే.. రూ.499 వార్షిక ప్రీమియం నుంచి పాలసీలు అందుబాటులో ఉన్నాయి. ఇవి 100 వారాల వరకు నెలకు రూ.5వేలు అందిస్తాయి.
104 వారాల పాటు వారం వారీగా రూ.1,000 పొందేందుకు రూ. 104 వార్షిక ప్రీమియం చెల్లిస్తే సరిపోతుంది.
రూ. 20 లక్షల వార్షిక ఆదాయం. వైకల్యం సంభవించిన సందర్భంలో వారం వారీగా ప్రయోజనం రూ.10వేలు పొందాలనుకుంటే వార్షిక ప్రీమియం రూ. 622తో పాలసీ తీసుకోవచ్చు.
ప్రమాదంలో వైకల్యం సంభవించటం లేదా మరణించిచటం వల్ల ఆదాయం కోల్పోయిన వారికి మాత్రమే ఈ బీమా వర్తిస్తుంది.
వీటిని ఎలా కొనుగోలు చేయాలి?
పాలసీ బజార్ వెబ్సైట్లో జాబ్‌లాస్ ఇన్సూరెన్స్ ట్యాబ్ ద్వారా పేరు, వయస్సు, వేతనం/ఆదాయం, రుణం మొత్తం, ఈఎంఐ, ఫోన్ నంబర్ సమర్పించాలి. అనంతరం బీమా సంస్థలు అందించే పాలసీలకు సంబంధించిన వివరాలు వస్తాయి. అందులో మీ అవసరాలకు తగ్గ బీమాను తీసుకోవచ్చు.
ఇదీ చూడండి:బీమా పత్రాలకు ధీమానిచ్చే ఈ-ఇన్సూరెన్స్