దేశవ్యాప్తంగా అనూహ్యంగా పెరుగుతున్న కరోనా కేసులు.. ఇప్పుడిప్పుడే కోలుకుంటున్న ఆర్థిక వ్యవస్థపై ప్రతికూల ప్రభావం చూపొచ్చని విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. ఈ కారణంగా తదుపరి ద్రవ్య పరపతి విధాన సమీక్షలోనూ కీలక వడ్డీ రేట్లలో మార్పు ఉండకపోవచ్చని అంచనా వేస్తున్నారు.
రెపో, రివర్స్ రెపో రేట్లను నిర్ణయించే ద్వైమాసిక ద్రవ్య పరపతి విధాన సమీక్ష సోమవారం (ఏప్రిల్ 5న) ప్రారంభం కానుంది. మూడు రోజుల సమీక్ష అనంతరం ఏప్రిల్ 7న.. ఎంపీసీ నిర్ణయాలను వెల్లడించనున్నారు ఆర్బీఐ గవర్నర్ శక్తికాంత దాస్. ప్రస్తుత ఆర్థిక సంవత్సరం జరగనున్న తొలి ఎంపీసీ సమీక్ష కూడా ఇదే కావడం గమనార్హం.
నిపుణుల మాట..
కరోనా నుంచి ఇప్పుడిప్పుడే కోలుకుంటున్న ఆర్థిక వ్యవస్థకు పెరుగుతున్న కొవిడ్ కేసులు ఆటంకంగా మారొచ్చని హౌసింగ్ డాట్ కామ్ సీఈఓ ధృవ్ అగర్వాల్ పేర్కొన్నారు. ఇది రిటైల్ ద్రవ్యోల్బణం మళ్లీ భారీగా పెరిగేందుకు దారితీయొచ్చని అభిప్రాయపడ్డారు. ఇలాంటి పరిస్థితుల్లో కీలక వడ్డీ రేట్లను సవరించేందుకు ఎంపీసీ మొగ్గు చూపకపోవచ్చని అంచనా వేశారు.
కీలక వడ్డీ రేట్లను చివరగా.. గత ఏడాది మేలో అత్యల్ప స్థాయికి (రెపో రేటు 4 శాతం, రివర్స్ రెపో రేటు 3.35 శాతం) తగ్గించింది ఆర్బీఐ. కరోనా భయాల నేపథ్యంలో తదుపరి సమావేశాల్లోనూ అవే వడ్డీ రేట్లను యథాతథంగా కొనసాగిస్తూ వస్తోంది.
ఇదీ చదవండి:గిఫ్ట్ ఓచర్లపైనా జీఎస్టీ వసూలు!