భారత గణాంక వ్యవస్థను నవీన పద్ధతుల్లో పునర్వ్యవస్థీకరించాలన్నారు నీతి ఆయోగ్ వైస్ ఛైర్మన్ రాజీవ్ కుమార్. నూతన పద్ధతుల్లో గణాంకాలను తీసుకోవడం వల్ల విధాన నిర్ణయాల విశ్లేషణ సులభతరమవుతుందని ఓ వార్తా సంస్థతో తెలిపారు. పలు ఆర్థిక సమస్యలపైనా సమాధానాలిచ్చారు రాజీవ్‌కుమార్.
అవసరమైన మార్పులు చేపట్టేందుకు ప్రపంచ బ్యాంకుతో సంప్రదింపులు జరుపుతున్నామని వెల్లడించారు.
"గణాంక వ్యవస్థను సంస్కరించాలని స్పష్టంగా చెప్పగలను. నవీన పద్ధతులను ప్రవేశపెట్టడం ద్వారా ప్రపంచ గణాంక వ్యవస్థతో మమేకమయ్యేందుకు అవకాశం ఏర్పడుతుంది. భారత్‌లో పర్యటించిన ప్రపంచ బ్యాంకు బృందం గణాంక వ్యవస్థను నవీకరించేందుకు కసరత్తులు చేస్తోంది. నవీకరణ ద్వారా వాస్తవిక పరిస్థితులకు అనుగుణంగా సమాచారం, విధాన విశ్లేషణ చేయవచ్చు"
-రాజీవ్ కుమార్ , నీతి ఆయోగ్ వైస్ ఛైర్మన్
కేంద్ర గణాంక కార్యాలయం(సీఎస్ఓ), జాతీయ నమూనా సర్వే కార్యాలయం(ఎన్ఎస్ఎస్ఓ), జాతీయ గణాంకాల కార్యాలయం కూటమిలో చేరేందుకు గణాంకాలు- పథకాల అమలు సంస్థ (ఎంఓ ఎస్పీఐ) మొగ్గు చూపుతున్న సమయంలో రాజీవ్‌కుమార్ వ్యాఖ్యలు ప్రాధాన్యతను సంతరించుకున్నాయి. గణాంక వ్యవస్థలను కలపడం ద్వారా సమష్టి తత్వం వచ్చే అవకాశముందన్నారు.
ఆర్థికవేత్తల అనుమానాలు
సవరించిన భారత ఆర్థిక వృద్ధి గణాంకాలపై ఆర్బీఐ మాజీ గవర్నర్ రఘురాం రాజన్, మాజీ ఆర్థిక సలహాదారు అరవింద్ సుబ్రహ్మణ్యం ఇటీవల అనుమానాలు వ్యక్తం చేశారు. జీడీపీకి సంబంధించిన తాజా గణాంకాలను విశ్లేషించేందుకు ఓ స్వతంత్ర వ్యవస్థ నియామకం అవసరమని అభిప్రాయపడ్డారు.
ఆర్థిక వేత్తల వ్యాఖ్యలు, నీతి ఆయోగ్ ఉపాధ్యక్షుడి అభిప్రాయాల నేపథ్యంలో గణాంక వ్యవస్థలో మార్పులు జరిగే అవకాశాలు కన్పిస్తున్నాయి.
ఖాయిలాలు ప్రైవేటుపరం
సరైన ఫలితాలు లేని ప్రభుత్వ రంగ సంస్థలను ప్రైవేటుకు అప్పగిస్తామన్నారు రాజీవ్ కుమార్. పన్నేతర వ్యయం పెంచేందుకు, పెట్టుబడుల ఉపసంహరణకు ఈ ఆర్థిక సంవత్సరంలో చర్యలు తీసుకుంటామన్నారు. ఎయిర్ ఇండియా సహా 34 ఖాయిలా సంస్థల్లో పెట్టుబడులను ఉపసంహరించి ప్రైవేటుకు అప్పగించేందుకు ప్రధాని కార్యాలయానికి సిఫారసు చేశామని రాజీవ్ కుమార్ వెల్లడించారు.
కేంద్ర ప్రభుత్వంపై ప్రశంసలు
మోదీ తొలి ఐదేళ్ల పాలనలో నిర్మాణాత్మక సంస్కరణలు జరిగాయన్నారు రాజీవ్‌కుమార్. ప్రభుత్వ నిర్ణయాలతో ఆర్థిక వృద్ధి ఫలితాలు పేదలకు చేరేందుకు మార్గం సుగమమైందన్నారు. పాలనపరమైన సంస్కరణలతో గుర్తుండిపోతుందన్నారు.
వైవీ రెడ్డితో భేటీకి సిద్ధం
నీతి ఆయోగ్‌పై మాజీ ఆర్బీఐ గవర్నర్ వైవీ రెడ్డి చేసిన వ్యాఖ్యలపైనా రాజీవ్‌కుమార్ స్పందించారు. నీతి ఆయోగ్ బాధ్యతలు పెరిగాయని, పలు అంశాలపై దృష్టి సారించలేకపోతోందని, సంస్థలో వ్యవస్థీకృత మార్పులు చేయాలని ఇటీవల వైవీ రెడ్డి వ్యాఖ్యానించారు. వైవీ రెడ్డిని కలిసి ఆయన అభిప్రాయలపై మరింత స్పష్టత తెచ్చుకుంటానన్నారు.
'వ్యవసాయ వ్యయం తగ్గాలి'
2022 నాటికల్లా వ్యవసాయ ఆదాయాన్ని రెట్టింపు చేయాలన్న మోదీ ప్రభుత్వ లక్ష్యంపై ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. రైతులకు రెట్టింపు ఆదాయం రావాలంటే వ్యవసాయం వ్యయం తగ్గాలన్నారు. పంటకు ఎక్కువ ధరను పరిశ్రమల నుంచి ఇప్పించగలగాలన్నారు.
పూల సాగు, చేపల పెంపకం, పౌల్ట్రీ వంటి అనుబంధ పరిశ్రమల్లోనూ రైతులు ప్రవేశించాలన్నారు.
ఇదీ చూడండి: అనుచరుడు సురేంద్ర సింగ్ పాడె మోసిన స్మృతి