రోజువారీ కరోనా కేసుల్లో భారత్ ప్రస్తుతం ప్రపంచంలోనే అగ్ర స్థానంలో ఉంది. దీనితో కరోనా వ్యాప్తిని అరికట్టేందుకు.. అన్ని రాష్ట్రాలు లాక్డౌన్, కర్ఫ్యూ వంటి చర్యలకు చేపడుతున్నాయి. ఈ నేపథ్యంలో 2021-22 ఆర్థిక సంవత్సర వృద్ధి రేటు అంచనాలను 10.4 శాతానికి తగ్గించింది ఎస్బీఐ రీసెర్చ్. గత నివేదికలో ఈ అంచనా 11 శాతంగా ఉంది. వాస్తవిక జీడీపీ అంచనాను కూడా 14.3 శాతానికి సవరించింది.
వ్యాక్సినేషన్ వేగం పెంచితేనే ప్రయోజనం..
ప్రస్తుత పరిస్థితుల్లో లాక్డౌన్ కన్నా వ్యాక్సినేషన్ వేగవంతం చేయడమే .. ఉత్తమమైన చర్య అని ఎస్బీఐ ముఖ్య ఆర్థిక సలహాదారు సౌమ్య కాంతి ఘోష్ సూచించారు. దీని వల్ల జీడీపీలో 0.1 శాతం మాత్రమే ఖర్చవుతుందని పేర్కొన్నారు. లాక్డౌన్ వల్ల దేశ జీడీపీ 0.7 శాతం ప్రభావితమైనట్లు పేర్కొన్నారు.
మహారాష్ట్ర వాటానే అధికం..
ప్రస్తుతం విధిస్తున్న పాక్షిక లాక్డౌన్ల వల్ల రూ.1.5 లక్షల కోట్ల నష్టం రావచ్చని సౌమ్య కాంతి ఘోష్ పేర్కొన్నారు. ఇందులో మహారాష్ట్ర, మధ్యప్రదేశ్, రాజస్థాన్ వంటి పెద్ద రాష్ట్రాల వాటా 80 శాతం ఉంటుందని తెలిపారు. మహారాష్ట్ర వాటానే 54 శాతమని స్పష్టం చేశారు.
వలస కూలీల తిరుగు బాట..
లాక్డౌన్ వంటి చర్యల ప్రభావం వలస కార్మికులపైనా తీవ్రంగా పడినట్లు పేర్కొంది ఎస్బీఐ నివేదిక. మహారాష్ట్ర నుంచి ఏప్రిల్ 1 నుంచి 12 మధ్య 4.32 లక్షల మంది కార్మికుల తమ స్వస్థలాలకు వెళ్లిపోయినట్లు వెల్లడించింది. పశ్చిమ రైల్వే డేటా ఆధారంగా ఈ గణాంకాలు పేర్కొంది ఎస్బీఐ.