2014 అక్టోబర్ 11న ప్రధానమంత్రి మోదీ నేతృత్వంలో ప్రారంభమైన 'సాంసద్ ఆదర్శ్ గ్రామ యోజన' కింద ఈ ఐదేళ్లలో 56 శాతం పనులు మాత్రమే పూర్తయ్యాయని తాజా ప్రభుత్వ గణాంకాలు స్పష్టం చేస్తున్నాయి.
ఈ పథకంలో భాగంగా ప్రతి పార్లమెంట్ సభ్యుడు వెనుకబడిన గ్రామాల్ని ఎంపిక చేసుకుని అభివృద్ధి చేయాల్సి ఉంటుంది. జులై 3 వరకు వెబ్సైట్లో పొందుపరిచిన వివరాల ప్రకారం అభివృద్ధి పనుల కోసం 1,484 గ్రామ పంచాయతీలను ఎంపిక చేసుకున్నారు ఎంపీలు.
ఇప్పటివరకు 1,297 గ్రామపంచాయతీల్లో 68 వేల 407 అభివృద్ధి పనులకు శ్రీకారం చుట్టారు. కానీ అందులో 38,021 మాత్రమే పూర్తయ్యాయి.
పలు రాష్ట్రాల్లో సంపూర్ణం..
తమిళనాడు, ఉత్తర్‌ప్రదేశ్, గుజరాత్, మధ్యప్రదేశ్, ఉత్తరాఖండ్, తెలంగాణలో ఈ పథకం సంపూర్ణంగా అమలవుతోంది.
⦁ 159 గ్రామాల్లోని.. 5,282 ప్రాజెక్టుల్లో 4,591 పూర్తి చేసుకుంది తమిళనాడు.
⦁ తెలంగాణలో 45 గ్రామ పంచాయతీల్లోని 1765 ప్రాజెక్టుల్లో 893 ఇప్పటికే పూర్తయ్యాయి.
గుజరాత్, మధ్యప్రదేశ్‌లలోనూ 70 శాతానికి పైగా అభివృద్ధి పనులు పూర్తయ్యాయి.
ఈ రాష్ట్రాల్లో నెమ్మదిగా..
అరుణాచల్ ప్రదేశ్, బిహార్, అసోం, హిమాచల్‌ప్రదేశ్, కేరళ, మహారాష్ట్ర, ఒడిశా, పంజాబ్‌లో ఈ పథకం నత్తనడకన సాగుతోంది.
అరుణాచల్ ప్రదేశ్‌లో అభివృద్ధికి ఎంపికైన 7 గ్రామాల్లోని 216 ప్రాజెక్టుల్లో 28 మాత్రమే పూర్తయ్యాయి. అసోం, బిహార్‌లోనూ ఇవే ఫలితాలు పునరావృతమయ్యాయి.
హిమాచల్, కర్ణాటకలో 30 శాతం పనులు మాత్రమే పూర్తయ్యాయి.
హిమాచల్ ప్రదేశ్‌లో 14 గ్రామాల్లో 1,291 ప్రాజెక్టులు చేయాల్సి ఉండగా 420 మాత్రమే పూర్తయ్యాయి.
కాలు కదపని రాష్టాలు
⦁ దేశ రాజధాని దిల్లీలో ఎంపికైన 13 గ్రామాల్లో ఒక్క ప్రాజెక్టు కూడా పూర్తయిన దాఖలాలు కనిపించలేదు.
⦁ పశ్చిమ్ బంగాలో 9 గ్రామాల్లోని 61 అభివృద్ధి పనుల్లో ఒక్కటీ పూర్తి కాలేదు.
ఇదీ చూడండి: ఫెడ్ వడ్డీ రేట్లు, కీలక గణాంకాలే ఈ వారానికి కీలకం