రియల్ టైమ్ గ్రాస్ సెటిల్మెంట్(ఆర్టీజీఎస్) సేవలు ఈ నెల 14 నుంచి 24x7 అందుబాటులోకి రానున్నాయి. ఈ మేరకు ఆర్బీఐ అధికారిక ప్రకటన విడుదల చేసింది.
ప్రస్తుతం ఈ సేవలు బ్యాంకుల పని దినాల్లో ఉదయం 7 గంటల నుంచి సాయంత్రం 6 గంటల వరకు మాత్రమే అందుబాటులో ఉంటున్నాయి. భారీ మొత్తాల చెల్లింపుల వ్యవస్థలో ఆవిష్కరణలను సులభతరం చేయడానికి, వ్యాపారం చేసే సౌలభ్యాన్ని ప్రోత్సహించడానికి ఈ నిర్ణయం తీసుకున్నట్లు ఆర్బీఐ వెల్లడించింది.
ఏమిటి ఈ ఆర్టీజీఎస్..
ఆర్టీజీఎస్ అనేది తక్షణ నగదు బదిలీ వ్యవస్థ. కనీసం రూ.2 లక్షల నుంచి పెద్ద మొత్తాల్లో నగదు బదిలీకి ఈ వ్యవస్థను ఉపయోగిస్తారు. గరిష్ఠ మొత్తం అనేది బ్యాంకులపై ఆధారపడి ఉంటుంది. మిగతా వ్యవస్థలతో పోలిస్తే.. తక్షణమే నగదు బదిలీ అవ్వడం ఈ వ్యవస్థ ప్రత్యేకత.
భారీ మొత్తంలో నగదు బదిలీకి మరో వ్యవస్థ కూడా అందుబాటులో ఉంది అదే నెఫ్ట్. ఈ వ్యవస్థను కూడా గత ఏడాది డిసెంబర్ 16 నుంచి 24x7 అందుబాటులోకి తెచ్చింది ఆర్బీఐ. ఈ వ్యవస్థలో కనీస పరిమితులు ఉండవు. దీని ద్వారా గంటలోపు నగదు బదిలీ పూర్తవుతుంది.
ఇదీ చూడండి:ఆ నిబంధనలతో టేక్ హోం శాలరీలో కోత?